news18-telugu
Updated: May 19, 2019, 1:27 PM IST
ఓటు హక్కు వినియోగించుకున్న 103 ఏళ్ల శ్యామ్ శరణ్ నేగి
దేశంలోనే తొలి ఓటరు ఆయన.. రాజకీయ ఉద్ధండులకు కూడా దక్కని అపూర్వ గౌరవం దక్కిందాయనకు.. ఆ గౌరవాన్ని మరింత పెంచేలా ప్రజాస్వామ్య పండుగను దగ్గరుండి మరీ ఘనంగా జరిపిస్తున్నారు.. ఎంతలా అంటే, భావి తరాలకు ఓటు హక్కు విలువెంతో చెప్పేంతగా.. తన వయసు వంద దాటినా ఓటు వేయడం తన హక్కుగా భావించి పోలింగ్ స్టేషన్‌కు వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనే హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లా కల్పకు చెందిన 103 ఏళ్ల శ్యామ్ శరణ్ నేగి. లోక్ సభ ఎన్నికల 7వ విడతలో భాగంగా ఈ రోజు ఉదయ కల్పలో ఓటు హక్కు వినియోగించుకున్న నేగికి ఎన్నికల సంఘం అధికారులు రెడ్ కార్పెట్ పరిచి అపూర్వ స్వాగతం పలికారు. సకల మర్యాదలతో ఆయనను పోలింగ్ బూత్‌లోకి తీసుకెళ్లి దగ్గరుండి వేలికి ఇంకు సిరా పూసి, ఈవీఎం వద్దకు తీసుకెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకునేలా చేశారు.
ఆయనే తొలి ఓటరు అని తెలిసిందిలా..
శ్యామ్ శరణ్ నేగి దేశంలో అందరికంటే ముందుగా ఓటు వేసి భారత తొలి ఓటరుగా రికార్డుల్లోకి ఎక్కారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లా కల్పా గ్రామానికి చెందిన శ్యామ్ 1917 జూలై 1న జన్మించారు. అయితే ఆయనే తొలి ఓటరు ఎలా తెలిసిందంటే.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1951లో తొలిసారి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. 1951 అక్టోబర్ నుంచి 1952 ఫిబ్రవరి వరకు మొత్తం 68 దశల్లో పోలింగ్ నిర్వహించారు. వాతవరణ పరిస్థితుల దృష్ట్యా అన్ని రాష్ట్రాల కంటే ముందుగా హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్రంలోని కిన్నౌర్ జిల్లాలో తొలి పోలింగ్ జరిగింది. వృత్తి రీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయిన శ్యామ్ శరణ్ తొలి ఎన్నికల్లో విధుల్లో పాల్గొన్నారు. అయితే విధులకు హాజరయ్యేందుకు మరో ప్రాంతానికి వెళ్లాల్సి రావడంతో ఆయన ముందుగా ఓటు హక్కును వినియోగించుకున్నారు.దీంతో దేశంలో తొలిగా ఓటు హక్కును వినియోగించుకున్న వ్యక్తిగా రికార్డుల్లోకి ఎక్కారు. అయితే శ్యామ్ శరణ్ ఘనత గురించి 2007 వరకు దేశంలో ఎవరికీ పెద్దగా తెలియదు. 2007 జూలైలో మనీశా నందా అనే ఐఏఎస్ అధికారిణి తొలిసారిగా శ్యామ్ గురించి తెలుకున్నారు. 90 ఏళ్లు పైబడిన ఓటర్ల గురించి ఆమె వెతుకుతుండగా శ్యామ్ శరణ్ గురించి తెలిసింది. అప్పటికి ఆయన వయసు 92 సంవత్సరాలు. ఈ క్రమంలో ఆయన గురించి తెలుసుకోవాల్సిందిగా ఎన్నికల అధికారులను కోరారు. ఆ సమయంలో కిన్నౌర్ డిప్యూటీ కమిషనర్‌గా ఉన్న ఐఏఎస్ అధికారిణి సుధా దేవి స్వయంగా శ్యామ్ శరణ్ ఇంటికి వెళ్లి ఆరా తీయగా ఆయన తొలి ఓటు ఎలా వేశారో కుమారుడు తెలిపారు. దీన్ని నిర్ధారించేందుకు 4 నెలల పాటు పాత రికార్డులన్నీ తిరగేయగా విషయం వెలుగులోకి వచ్చిందని మనీశా వెల్లడించారు.
కాగా, శ్యామ్ శరణ్ ఈ ఏడాది 103వ పడిలోకి అడుగుపెట్టబోతున్నారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు, మనవళ్లు, మనవరాల్లు ఉన్నారు. 1975లో పదవీ విరమణ చేసిన శ్యామ్ ప్రతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుంటూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ రోజు కిన్నౌర్ జిల్లాలోని కల్పాలో తన ఓటు హక్కును వినియోగించుకొని మొత్తంగా 32వ సారి ఓటు వేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు.
First published:
May 19, 2019, 1:27 PM IST