మోదీ చిల్లర ప్రధాని..మత రాజకీయాలను నమ్మొద్దు: నిర్మల్ సభలో కేసీఆర్

ఆదిలాబాద్‌ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నగేశ్‌కు ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు తెలంగాణ సీఎం. 3లక్షల పైచిలుకు మెజార్టీ వస్తుందని ధీమావ్యక్తం చేశారు కేసీఆర్.

news18-telugu
Updated: April 7, 2019, 6:05 PM IST
మోదీ చిల్లర ప్రధాని..మత రాజకీయాలను నమ్మొద్దు: నిర్మల్ సభలో కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ (File)
  • Share this:
నరేంద్ర మోదీ చిల్లర ప్రధానమంత్రని మండిపడ్డారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఎన్నికలకు ముందే బీజేపీ నేతలకు హిందూత్వం, రామాలయం, పాకిస్తాన్ అంశాలు గుర్తుకొస్తాయని ధ్వజమెత్తారు. మత రాజకీయాలను నమ్మవద్దని యువతకు పిలుపునిచ్చారు. జూన్ తర్వాత యావత్ దేశం ఆశ్చర్యపోయేలా కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తానని చెప్పారు కేసీఆర్. రాబోయే పదేళ్లలో రూ.30 లక్షల కోట్లు ఖర్చుపెట్టి తెలంగాణను అద్భుతంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్ సభలో మాట్లాడిన కేసీఆర్..కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

కొత్త రెవెన్యూ చట్టం

జూన్ తర్వాత భారత దేశమే ఆశ్చర్యపోయేలా కొత్త రెవెన్యూ చట్టం తెస్తున్నాం. గిరిజన, పోడు, ఇతర ఏ భూములైనా ప్రతి గుంట లెక్క తేలాలి. పూర్తి యాజమాన్య హక్కును భూమి యజమానికి కల్పిస్తాం. భూముల సమస్యలను పరిష్కరించడానికి ప్రతి జిల్లాలో మూడు రోజులుంటాం. సీఎస్ నుంచి కింది స్థాయి అధికారికి వరకు అక్కడే ఉంటాం. ఎవరికీ లంచం ఇవ్వకండి. భూముల అమ్మకం, కొనుగోళ్లు జరిగితే గంట లోపే సర్టిఫికెట్ వచ్చేలా కొత్త చట్టం తెస్తాం.

పసుపు బోర్డు ఎందుకివ్వరు?
రైతులకు గిట్టుబాటు ధర రావాలి. కనీస మద్దతు ధరను కేంద్రం తమ గుప్పిట్లో పెట్టుకుంది. పసుపు బోర్డు ఏర్పాటు కోసం రైతులు ఆందోళన చేస్తున్నారు. ఐదేళ్ల నుంచి 500 దరఖాస్తులు ఇచ్చినా స్పందించలేదు. మమ్మల్ని గెలిపిస్తే పసుపు బోర్డు ఏర్పాటుచేస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. మరి ఇన్ని రోజులు ఏం చేశారు? ఎలక్షన్లు వస్తేనే బీజేపీ పనులు చేస్తుందా? మేం చెప్పేది నిజమో కాదో మీరే చర్చించుకోండి. ఆ తర్వాతే ఓటు వేయండి.

అందరం హిందువులమే
ప్రతి పేదవాడి అకౌంట్లో రూ.15లక్షలు వేస్తామని చెప్పారు. 15 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఎవరికైనా ఇచ్చారా? ఎన్నికల ముందు పాకిస్తాన్, హిందూ, ముస్లిం, రామాలయం అంశాలను తెరపైకి తెస్తారు. దేశంలోని దేవాలయాలను బీజేపీ నేతలే కట్టించారా? అన్ని మతస్తులు జీవించే గడ్డ తెలంగాణ గడ్డ. ఎవరి ప్రార్థనలు వారు చేసుకుంటున్నారు. అన్ని మతస్తుల రక్తం ఎరుపే కదా..! మేం దేవుళ్లను కాపాడతలేమా..? దేవుడికి దండంపెట్టే అన్నం తింటాం. యువకులు మేల్కోవాలి. ఈ పిచ్చి హోరులో కొట్టుకుపోవద్దు. మత రాజకీయాలను నమ్మవద్దు.కులమత భేదాలొద్దు
భారత్‌పై చైనా ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. అందరు పిచ్చిగా ఉన్నారు. కులమతాలతో కొట్టుకుంటున్నారు. వాళ్ల మనతో పోటీకి వచ్చే ప్రసక్తేలేదని రిపోర్టు ఇచ్చారు. 1976కు ముందు చైనాది మనకున్న జీడీపీ. ఇప్పుడు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థికవ్యవస్థ. అక్కడ కుల,మత,జాతి,లింగ భేదాలు ఉండవు. కులాలు, మతాల పంచాయతీలు ఉండే వరకు మన దేశం బాగుపడదు.

మోదీ చిల్లర ప్రధాని
కేసీఆర్ జాతకం, జ్యోతిష్యాన్ని నమ్ముకుంటే నీకేంటి నష్టం? నేను ఎవరిని పూజిస్తే మీకెందుకు? మోదీ ఏ రాష్ట్రానికొస్తే ఆ రాష్ట్ర సీఎంను వ్యక్తిగతంగా తిడతారు. ఇంత చిల్లర ప్రధానమంత్రి ఎప్పుడూ చూడలేదు. దమ్ముంటే పాలసీలపై మాట్లాడాలి. పరస్పరం వ్యక్తిగత ఆరోపణలు చేసుకునే బీజేపీ, కాంగ్రెస్ మనకొద్దు.

మనది ధనిక రాష్ట్రం
తెలంగాణ ధనిక రాష్ట్రం. రాబోయే పదేళ్లలో రూ.30 లక్షలు కోట్లు ఖర్చెపెట్టబోతున్నాం. కేంద్ర బడ్జట్ కన్నా ఇది ఎక్కువ. వృద్ధులు, వితంతువులకు ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఇంకా చేస్తాం. డబుల్ బెడ్‌రూం ఇళ్లను మెల్లగానే కడుతున్నాం. కేంద్రంలో మనకు అనుకూలంగా ఉండే ప్రభుత్వమే రాబోతోంది. మరిన్ని నిధులు వస్తాయి. భూమి ఉన్న వారికి ఇల్లు కట్టుకునేందుకు డబ్బులు ఇస్తాం.

అందుకే ఫెడరల్ ఫ్రంట్
తెలంగాణ మాత్రమే బాగుంటే సరిపోదు. దేశం కూడా బాగుపడాలి. దేశంలో గుణాత్మక మార్పు కోసమే ఫెడరల్ ఫ్రంట్ ప్రస్తావన తీసుకొచ్చాం. చాలా మంది నేతలతో మాట్లాడా. సెక్యులర్ భావాలతో అన్ని మతాలు, కులాల ప్రజలు సమాన హోదా, గౌరవంతో బతికే దేశం కావాలి. అన్ని వర్గాల ప్రజలు పరస్పరం ప్రేమించుకునే భారతదేశం కావాలి. మతాల పంచాయతీ పెట్టే చిల్లరగాళ్లను చెంపదెబ్బ కొట్టాలి. 16కు 16 ఎంపీలు గెలిస్తే జాతీయ స్థాయిలో టీఆర్ఎస్ పాత్ర పెరుగుతుంది.

ఆదిలాబాద్‌ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నగేశ్‌కు ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు తెలంగాణ సీఎం. 3లక్షల పైచిలుకు మెజార్టీ వస్తుందని ధీమావ్యక్తం చేశారు కేసీఆర్. రాబోయే రోజుల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలను అద్భుతంగా అభివృద్ధి చేస్తానని..ఆదిలాబాద్‌ను కాశ్మీర్ చేస్తానని హామీ ఇచ్చారు.
Published by: Shiva Kumar Addula
First published: April 7, 2019, 6:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading