కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ కేరళ రాష్ట్రం వయనాడ్‌లో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా రాహుల్ వెంట ప్రియాంక గాంధీ ఎన్నారు.సోదరితో కలిసి రాహుల్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో అమేథి, వయనాడ్ నుంచి బరిలోకి దిగుతున్న రాహుల్. వాయనాడ్‌కు రాహుల్ గాంధీ హెలికాప్టర్లో చేరుకున్నారు. వేలాది కార్యకర్తలతో కలిసి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం అక్కడ రాహుల్ , ప్రియాంక రోడ్డుషో నిర్వహించనున్నారు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో కోజికోడ్‌లో భారీ ఏర్పాట్లు చేశారు కాంగ్రెస్ పార్టీ నేతలు. మరోవైపు పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
మరోవైపు వయనాడ్‌లో రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో అమేథి బీజేపీ అభ్యర్థి, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యలు చేశారు. 'పదిహేనేళ్లుగా అమేఠీలో ఉన్న వ్యక్తి ఆయన మద్దతుదారులను విడిచివెళ్లడానికి నిర్ణయించుకున్నారు. ఈసారి ఎన్నికల్లో పోటీ కోసం ఆయన మరో స్థానాన్ని ఎంచుకున్నారు. ఇది ఇక్కడి ప్రజలను మోసం చేసి అవమానానికి గురిచేయడమే. రాహుల్‌కు పెద్దగా మద్దతు లభించదన్న విషయం అమేఠీలోని కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా తెలుసు'' అని స్మృతి అభిప్రాయపడ్డారు. ''రాహుల్ గాంధీ సామర్థ్యంపై వయనాడ్ ప్రజలకు ఏమైనా అనుమానాలు ఉంటే.. నివృత్తి కోసం వారు అమేఠీకి రావాల్సిందే'' అంటూ ట్విటర్ వేదికగా అభిప్రాయపడ్డారు స్మృతి ఇరాని.