Home /News /politics /

మంగుళూరులో కాషాయం ధరించిన కాంగ్రెస్...ఎందుకో తెలుసా ?

మంగుళూరులో కాషాయం ధరించిన కాంగ్రెస్...ఎందుకో తెలుసా ?

కాషాయ కండువాలు ధరించి ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు (Image : Facebook)

కాషాయ కండువాలు ధరించి ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు (Image : Facebook)

మంగుళూరు పార్లమెంటరీ నియోజకవర్గంలో 1991 నుంచి బీజేపీ పార్టీ వరుసగా ఏడు సార్లు గెలిచింది. అయితే ఈ సారి మాత్రం ఎలాగైన ఇక్కడ జెండా ఎగురేయాలని కాంగ్రెస్ కొత్త ప్రయోగానికి తెర లేపింది. ఈ ప్రాంతంలో బలంగా ఉన్న హిందుత్వ ఓటు బ్యాంకు రాజకీయాలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ ముల్లును ముల్లుతోనే తీయాలనే ఫార్ములాను ప్రయోగించనుంది.

ఇంకా చదవండి ...
 • News18
 • Last Updated :
  కర్ణాటక కోస్తా ప్రాంతంలోని ప్రధాన పట్టణం మంగుళూరు, దక్షిణ కర్ణాటకకు చెందిన ఈ ప్రాంతంలో ఏఫ్రిల్ 18న రెండోదశలో భాగంగా లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడి రాజకీయాలు వేడెక్కాయి. ఈ ప్రాంతంలో 1991 నుంచి వరుసగా 7 సార్లు బీజేపీ పార్టీ వరుసగా గెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీ నుంచి పోటీలో ఉన్న ఎంపీ నళిన్ కుమార్ ఇప్పటికే రెండు సార్లు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. అయితే బీజేపీ ఎక్కువగా హిందుత్వ, అలాగే మోదీ ఇమేజీపైనే ఎక్కువగా ఆధారపడింది. ఇక్కడ వరుసగా రెండుసార్లు గెలిచిన బీజేపీ సిట్టింగ్ ఎంపీ ఉన్నప్పటికీ, అభ్యర్థితో సంబంధం లేకుండా హిందుత్వ ఫ్యాక్టర్ ఆధారంగా బీజేపీ కార్యకర్తలు ప్రచారంలో ముందుకు వెళ్లడం విశేషం. ఇదే అంశంపై స్థానిక కార్యకర్త ఒకరిని సంప్రదించగా, ప్రస్తుత బీజేపీ ఎంపీ గత పదేళ్ల పదవీకాలంలో నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదని విమర్శించారు. అంతే కాదు ఎంపీ పనితీరు ఆధారంగా ఎన్నికల్లోకి వెళితే మంగళూరులో బీజేపీకి ఒక్క ఓటు కూడా పడదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే కేవలం హిందుత్వ ఆధారంగానే ఎన్నికలకు వెళ్తామని, మోదీ ఇమేజీయే ఎన్నికల్లో తమను కాపాడుతుందని అన్నారు. స్థానిక సమస్యల ప్రాతిపదికన ఎన్నికలకు వెళితే తమ అభ్యర్థి పోటీలో నిలవడం కష్టమని అన్నారు.

  కాషాయ కండువాలతో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి మిథున్ (Image : Facebook)
  కాషాయ కండువాతో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి మిథున్ (Image : Facebook)


  అయితే వాణిజ్యపరంగానూ, పారిశ్రామికంగానూ పేరెన్నికగన్న మంగుళూరు ప్రాంతాన్ని 1990 నుంచి బీజేపీ దక్షిణాదిలో "హిందుత్వ పరిశోధనశాల"గా పరిగణిస్తుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో అన్ని ప్రధాన మతాల వారు ఉన్నారు. అంతే కాదు దక్షిణ కన్నడ ప్రాంతంలో ఆర్థికంగా పేర్కోదగిన ప్రాంతం, ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి ఏకంగా ఐదు జాతీయ బ్యాంకలుు ఉండటం విశేషం. అలాగే హోటల్ రంగానికి ప్రసిద్ధిగాంచిన ఉడిపి పట్టణం కూడా ఇక్కడే ఉంది. అలాగే ఎడ్యుకేషన్, మెడికల్ హబ్‌గా సైతం ఈ ప్రాంతం వెలుగొందుతోంది. నిజానికి ఈ ప్రాంతం ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది. ఇందిరా గాంధీ హయాంలో చేపట్టిన బ్యాంకుల జాతీయీకరణ, కర్ణాటక సీఎం దేవరాజ్ అర్స్ చేపట్టిన భూ సంస్కరణలు విజయవంతం కావడంతో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరిగింది. కానీ 90వ దశకంలో దక్షిణ కర్ణాటక తీరప్రాంతాల్లో అద్వానీ చేపట్టిన రథయాత్ర ఫలితంగా ఈ ప్రాంతం మతఘర్షణలతో అట్టుడుకింది. అప్పటి నుంచి దాదాపు 30 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో కమ్యూనల్ ప్రాతిపదికన హింస ప్రజ్వరిల్లుతూనే ఉంది.

  కాషాయ కండువాలతో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి మిథున్ (Image : Facebook)


  నిజానికి ఒకప్పుడు వెనుకబడిన తరగతులైన బిలావాస్ (కల్లుగీత కార్మికులు), మొగవీరాస్(మత్స్యకారులు) కాంగ్రెస్ విధానాలకు ఆకర్షితులై బలమైన ఓటు బ్యాంకుగా మారిపోయారు. అయితే అద్వానీ రథయాత్ర అనంతరం చెలరేగిన ఘర్షణలతో, ఈ ప్రాంతంలో మతప్రాతిపదిక ఓటు బ్యాంకు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. అయితే గడిచిన 7 దఫాలుగా కాంగ్రెస్ వరుసగా బీజేపీ చేతిలో ఓడిపోతూ వస్తోంది. అయితే ఈ సారి ఎన్నికల్లో హిందుత్వ అస్త్రాన్ని కాంగ్రెస్ సైతం వాడటం విశేషం. కాంగ్రెస్ తరపున బరిలోకి దిగుతున్న మిథున్ ఎం రాయ్ గెలుపుపై ఆశలు పెట్టుకున్నారు. ఆయన హిందుత్వకు ప్రతీకగా కాషాయ వస్త్రాలు ధరించి మరీ ప్రచారం చేయడం విశేషం. అంతే కాదు నిజమైన హిందుత్వకు తామే ప్రతీకలమని కాంగ్రెస్ వారు ప్రచారం చేయడం విశేషం. అంతే కాదు జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రిగా పనిచేస్తున్న యూటీ. ఖాదర్ సైతం కాషాయ కండువాలు ధరించి కాంగ్రెస్ తరపున ప్రచారం చేయడం విశేషం. కాంగ్రెస్ అభ్యర్థి మిథున్ స్థానికంగా ఒక గోశాల నిర్వహణ చేస్తున్నారు. అంతే కాదు హిందుత్వను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి బీజేపీ కన్నా తామే హిందుత్వకు అసలైన వారసులమని ప్రచారం చేయడం ద్వారా కొత్త వ్యూహానికి తెరతీయడం విశేషం.

  ఇదిలా ఉంటే మంగుళూరు ప్రాంతం బ్యాంకింగ్ రంగానికి పుట్టినిల్లనే చెప్పాలి. ఇక్కడి నుంచి ప్రసిద్ధ జాతీయ బ్యాంకులైన కెనరా, కార్పోరేషన్, విజయ, సిండికేట్ బ్యాంకులకు మంగుళూరే ప్రధాన కేంద్రం. కెనరా, సిండికేట్ బ్యాంకులను కొంకణీలు స్థాపిస్తే, కార్పోరేషన్ బ్యాంకును ముస్లింలు స్థాపించారు. అలాగే విజయా బ్యాంకును తులు ప్రాంతంలో ఆధిపత్య కులమైన బంట్‌ వారు స్థాపించారు. ఈ బ్యాంకుల ద్వారానే వ్యాపారాలు బాగా పెరిగి మంగుళూరు ప్రాంతం పారిశ్రామికంగానూ, ఇతర అన్ని రంగాల్లోనూ పై చేయి సాధించి, కర్ణాటకకే తలమానికంగా నిలిచింది. అయితే ఇటీవలే విజయాబ్యాంకును బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేయడంతో స్థానికంగా నిరసనలకు కారణమైంది. ఈ ప్రాంతంలో ఆధిపత్య కులంగా ఉన్న బంట్ కులస్థులు విజయా బ్యాంకు విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే ఈ సారి కాంగ్రెస్ తరపు నుంచి కూడా బంట్ కులం నుంచే అభ్యర్థిని నిలబెట్టడం కలిసి వచ్చే అంశంగానే చెప్పవచ్చు.

  అయితే ఇప్పటికీ బీజేపీ మంగుళూరులో బలంగానే ఉందని...ఎన్నికల్లో పూర్తిగా హిందుత్వ అంశం, మోదీ ఇమేజ్ పైనే ఆధారపడి ఉన్నామని బీజేపీ కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే స్థానిక బీజేపీ ఎంపీ పనితీరు ఏ మాత్రం బాగోలేదని, మోదీ, హిందుత్వ అంశాలు లేకపోతే డిపాజిట్ కూడా దక్కదని చురకలంటించారు. అయితే ప్రస్తుతం మంగళూరు ప్రాంతంలో మతపరంగా రెండు ప్రధాన వర్గాల మధ్య చీలిక బలంగా ఉందని దాని ఆధారంగానే బీజేపీ గెలుపు ఆధారపడి ఉందని కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు పొరపొచ్చాలు తొలగి ప్రజలు మతాలకు అతీతంగా ఓటు వేసే పరిస్థితి లేదని స్థానికులు పేర్కొంటున్నారు. మరోవైపు బీజేపీ తరపున ఆర్ఎస్ఎష్ వాలంటీర్లు డోర్ టు డోర్ కాంపెయిన్ బలంగా చేయడం విశేషం. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ చేపట్టిన సాఫ్ట్ హిందుత్వ కాంపెయిన్ ఈ సారి ప్రభావం చూపే అవకాశం ఉండవచ్చని, ఎందుకంటే బీజేపీ, కాంగ్రెస్ తరపున బరిలో నిలబడిన ఇద్దరు అభ్యర్థులు బంట్ సామాజిక వర్గానికే చెందిన వారు కావడంతో ఈ సారి పోటీ రసవత్తరంగా సాగే అవకాశం లేకపోలేదని స్థానికులు పేర్కొంటున్నారు.

  డీపీ. సతీష్, సౌత్ హెడ్, న్యూస్ 18
  First published:

  Tags: Bjp, Congress, Dakshina Kannada S10p17, Karnataka Lok Sabha Elections 2019, Karnataka Politics, Lok Sabha Election 2019

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు