Home /News /politics /

LEFT PARTIES HOPES ON TELANGANA CM KCR STRATEGIES WILL IT HELP THEM POLITICALLY AK

ఆ నేతల్లో ఆశలు పెంచిన KCR.. TRS లెక్కలు కలిసొచ్చేనా..? కానీ అదొక్కటే అనుమానం ?

కేసీఆర్ (ఫైల్ ఫోటో)

కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Telangana: ఒకవేళ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటే.. రాజకీయ ప్రయోజనం కోసం కచ్చితంగా టీఆర్ఎస్ తమతో పొత్తు పెట్టుకుంటుందని వామపక్ష నేతలు భావిస్తున్నారు.

    తెలంగాణ రాజకీయాల్లో మార్పు మొదలైంది. ఇక్కడి రాజకీయాల్లో బీజేపీ బలపడుతుండటంతో.. అధికార టీఆర్ఎస్ అప్రమత్తమైంది. ఈ క్రమంలో కేసీఆర్ తన వ్యూహాలకు పదునుపెట్టారు. ఆయన వ్యూహాలు ఎలా ఉన్నా.. తమ రాజకీయాలకు కేసీఆర్ ప్లాన్ వల్ల లాభం కలుగుతుందేమో అని కొందరు నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. లెఫ్ట్ పార్టీలకు చెందిన కేరళ సీఎం విజయన్‌తో కేసీఆర్ భేటీ తరువాత తెలంగాణలో కొత్త సమీకరణాలకు తెరలేచే అవకాశం ఉందని ఊహాగానాలు మొదలయ్యాయి. వామపక్షాలతో కలిసి జాతీయ స్థాయిలో పని చేయాలని భావిస్తున్న టీఆర్ఎస్.. రాష్ట్రస్థాయిలోనూ ఆ పార్టీ నేతలతో కలిసి పని చేసే అవకాశం లేకపోలేదనే చర్చ జరుగుతోంది. అదే జరిగితే.. చాలాకాలం నుంచి గెలుపు చూడని వామపక్ష నేతలు మళ్లీ టీఆర్ఎస్ సపోర్ట్‌తో అయినా ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

    నిజానికి తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ ఇప్పటికీ బలహీనంగానే ఉంది. అందులో ఖమ్మం, నల్లగొండ జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల్లో వామపక్షాలకు ఎంతోకొంత బలంగా ఉంది. తమ బలానికి టీఆర్ఎస్ బలం కూడా తోడైతే.. ఇక్కడి కొన్ని సీట్లు గెలుచుకోవచ్చని వామపక్ష నేతలు లెక్కలు వేసుకుంటున్నట్టు సమాచారం. అయితే కేసీఆర్ రాజకీయాలు, ఆయన వ్యూహాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కాబట్టి వామపక్షాలతో సఖ్యత కోసం ప్రయత్నిస్తున్న కేసీఆర్.. ఆ సంబంధాన్ని ఎన్నికలకు కొనసాగిస్తారా ? అన్నది ఎవరికీ అంతుచిక్కడం లేదు. మరోవైపు రాజకీయాల్లో పొత్తులు పెట్టుకోవడం టీఆర్ఎస్‌కు పెద్దగా కలిసిరాలేదు.

    రెండుసార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్.. ఏ పార్టీతోనూ అధికారికంగా పొత్తు పొత్తు పెట్టుకోకుండానే అధికార పీఠాన్ని సొంతం చేసుకుంది. ఈ కారణంగానే టీఆర్ఎస్ నాయకత్వం కచ్చితంగా తమతో పొత్తు పెట్టుకుంటుందా ? లేదా ? అనే సందేహంతో వామపక్షాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే వామపక్షాలు కాంగ్రెస్ వైపు వెళ్లకుండా ఉండేందుకైనా తమతో కలుపుకుంటాయని మరికొందరు లెక్కలు వేసుకుంటున్నారు.

    ఒకవేళ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటే.. రాజకీయ ప్రయోజనం కోసం కచ్చితంగా టీఆర్ఎస్ తమతో పొత్తు పెట్టుకుంటుందని వామపక్ష నేతలు భావిస్తున్నారు. అదే జరిగితే.. తాము బలంగా ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలని నేతలు అనుకుంటున్నారు. ఎక్కడెక్కడ పోటీ చేయాలనే దానిపై కూడా రెండు వామపక్ష పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయని సమాచారం. అయితే టీఆర్ఎస్ కాకపోయినా.. కాంగ్రెస్‌తో కలిసి ముందుకు సాగేందుకు వామపక్షాలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయని తెలుస్తోంది.

    Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే.. పూర్తి వివరాలు

    ఆ సీట్లపై కన్నేసిన Telangana Bjp.. 2 నెలలు పాదయాత్ర.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

    వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కచ్చితంగా గెలవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. కలిసి వచ్చే మిత్రపక్షాలను కలుపుకుని ముందుకు సాగాలని భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీతో కలిసి వామపక్షాలు గతంలో అనేకసార్లు కలిసి పోటీ చేశాయి. కాబట్టి మరోసారి ఆ పార్టీతో కలిసి పోటీ చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని వామపక్ష నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. అయితే కాంగ్రెస్‌తో పోల్చితే.. టీఆర్ఎస్‌తో కలిసి పోటీ చేయడం వల్ల ఎక్కువ లాభాలు ఉంటాయని ఆ పార్టీలు అంచనా వేసుకుంటున్నట్టు సమాచారం.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: CM KCR, Telangana, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు