ఏపీలోని అధికార వైసీపీపై విపక్షాలు టీడీపీ, జనసేన, బీజేపీ విమర్శలు గుప్పించడం కొత్తేమీ కాదు. వాటికి వైసీపీ (YSRCP) నుంచి కౌంటర్లు రావడం కూడా సాధారణమే. అయితే తాజాగా వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించే వారి జాబితాలో దివంగత వైఎస్ఆర్ సన్నిహితుడు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా చేరిపోవడం గమనార్హం. వైఎస్ఆర్‌కు సన్నిహితుడిగా కొనసాగిన ఉండవల్లి అరుణ్ కుమార్(Undavalli Arun Kumar).. రాజకీయాల్లో జగన్‌తో కలిసి నడుస్తారని చాలామంది భావించారు. కానీ ఆయన వైసీపీలో చేరలేదు. అయితే టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలను విమర్శించి వైఎస్ జగన్(YS Jagan Mohan Reddy)కు పరోక్షంగా మేలు చేశారనే వాదన ఉంది. వైఎస్ఆర్ కుమారుడు జగన్ ముఖ్యమంత్రి కావాలని తాను కోరుకుంటున్నానని ఆయన అనేకసార్లు బహిరంగంగానే వ్యాఖ్యానించారు.
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అనేకసార్లు మీడియా ముందుకు వచ్చిన ఉండవల్లి.. జగన్ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు చేస్తూ వచ్చారు. అయితే కొద్దిరోజుల క్రితం ఆయన వైసీపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారి అప్పులు తెస్తేగాని గడవని పరిస్థితి నెలకొందని ఉండవల్లి అన్నారు. ఈ పరిస్థితుల్లో ఆర్థికవేత్తలు, సలహాదారులు ఏమయ్యారని కామెంట్ చేశారు. ఇప్పటివరకు రాష్ట్రానికి రూ. 6 లక్షల కోట్లు అప్పులున్నాయని.. వాటికి ఏటా రూ. 42 వేల కోట్లు వడ్డీ కట్టాల్సి వస్తోందని అన్నారు.
ఉన్నంత కాలం పంచేద్దాం.. ఆ తరువాత చేతులెత్తేద్దాం అన్న ఆలోచనలో ఉన్నారా ? అని ప్రశ్నించారు. ఇలా అనేక అంశాల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఉండవల్లి అరుణ్ కుమార్.. వారి విధానాలను తప్పుబట్టారు. అయితే ఉండవల్లి ఈ స్థాయిలో తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తారని వైసీపీ శ్రేణులు కూడా ఊహించలేకపోయాయి. మరోవైపు ఏ విషయాన్నైనా జనానికి అర్థమయ్యేలా చెప్పడంలో దిట్టగా పేరున్న ఉండవల్లి అరుణ్ కుమార్.. ఈ రకంగా జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వైసీపీకి ఇబ్బంది కలిగించే పరిణామమే అనే చర్చ జరుగుతోంది.
Telangana: ఆ కారు బండి సంజయ్ మిత్రుడిదే.. బీజేపీకి టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కౌంటర్
Manchu Vishnu: మంచు విష్ణు అలాంటి రూల్ పెట్టబోతున్నారా ? ప్రకాశ్ రాజ్ మాటలకు అర్థమేంటి ?
ఉండవల్లి ప్రశ్నలు, ఆయన చెప్పిన విషయాలను వైసీపీ ఖండించలేదు. అయితే ఉండవల్లి ఇదే రకమైన వైఖరితో ముందుకు సాగితే మాత్రం వైసీపీకి ఇబ్బందే అనే చర్చ కూడా సాగుతోంది. ఒకప్పుడు టీడీపీని ఇదే రకంగా టార్గెట్ చేసి వైసీపీకి మేలు చేసిన ఉండవల్లి.. ఇప్పుడు వైసీపీని ఈ రకంగా విమర్శిస్తే విపక్షాలకు మేలు జరుగుతుందనే టెన్షన్ జగన్‌తో పాటు వైసీపీలోనూ ఉందనే చర్చ జరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap cm ys jagan mohan reddy, Undavalli Arun Kumar, Ysrcp