ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలపై రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో ఉన్న తెలుగువారిలో కూడా చాలా ఆసక్తి ఉంది. ఈ క్రమంలో భారీ ఎత్తున బెట్టింగ్ జరుగుతోంది. అందులో లగడపాటి రాజగోపాల్ చేసే సర్వేల మీద కూడా బెట్టింగ్ రాయుళ్లకు ఆసక్తి ఎక్కువ. లగడపాటి రాజగోపాల్ చెప్పే అంశాలను బేరీజు వేసుకుని చాలా మంది బెట్టింగ్ పెడుతుంటారు. తాజాగా లగడపాటి రాజగోపాల్ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో ఓటర్లు సైకిల్ ఎక్కారు. తెలంగాణలో కారు ఎక్కారు అని చెప్పారు. పరోక్షంగా ఏపీలో టీడీపీ, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ మెజారిటీ సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్టు తెలిపారు. అయితే, ఎవరెవరికి ఎన్ని సీట్లు వస్తాయనే అంశంపై ఆదివారం సాయంత్రం 6 గంటలకు తిరుపతిలో చెబుతానన్నారు.
ఈ క్రమంలో లగడపాటి రాజగోపాల్ బెట్టింగ్ రాయుళ్లకు సలహా ఇచ్చారు. ఎన్నికల మీద, రాజకీయాల మీద తనకు ఉన్న హాబీని దృష్టిలో పెట్టుకుని తాను సర్వేలు చేస్తుంటానని చెప్పారు. అవి నిజం కావడంతో తన సర్వేల మీద ప్రజల్లో నమ్మకం వచ్చిందన్నారు. తాను ప్రజల నాడిని బట్టి చెబుతానే కానీ, ఈవీఎంలో దూరి చెప్పలేనని లగడపాటి చెప్పారు. తనను నమ్ముకుని బెట్టింగ్ లాంటివి పెట్టొద్దని పరోక్షంగా సలహా ఇచ్చారు. బెట్టింగ్ అనేది ఏ రూపంలో చేసినా తప్పేనని, దీనిపై ఎన్నికల కమిషన్ గట్టి చర్యలు తీసుకోవాలని లగడపాటి కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.