తెలంగాణ ఫలితాలపై లగడపాటి రాజగోపాల్ ఫస్ట్ రియాక్షన్

తెలంగాణ ఎన్నికల ఫలితాల తరువాత ఎక్కడా కనిపించని లగడపాటి రాజగోపాల్... శుక్రవారం కుటంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సాధారణంగా తాను గుడి దగ్గర రాజకీయాల గురించి మాట్లాడబోనని వ్యాఖ్యానించిన లగడపాటి... కొద్ది రోజుల క్రితం ఇక్కడ రాజకీయాలపై మాట్లాడటం పొరపాటైందని అన్నారు.

news18-telugu
Updated: December 15, 2018, 8:03 PM IST
తెలంగాణ ఫలితాలపై లగడపాటి రాజగోపాల్ ఫస్ట్ రియాక్షన్
లగడపాటి రాజగోపాల్ (ఫైల్ ఫొటో)
  • Share this:
తెలంగాణ ఎన్నికల ఫలితాలు రాగానే, చాలా మందిలో మెదిలిన ప్రశ్న ఒక్కటే. లగడపాటి రాజగోపాల్ ఎక్కడ? ఆయన చెప్పిన జోస్యం ఎందుకు తారుమారైంది? ఎన్నికల ఫలితాల మీద ఆయన ఎలా స్పందిస్తారు? అని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూశారు. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాజగోపాల్ ఇవాళ తిరుమలలో ప్రత్యక్షమయ్యారు. కుటుంబసమేతంగా శ్రీవారిని దర్శించుకున్న లగడపాటి రాజగోపాల్... తెలంగాణ సర్వే ఫలితాలపై మాట్లాడతారని అంతా అనుకున్నారు. కానీ ఆయన మాత్రం తెలంగాణలో టీఆర్ఎస్ విజయం, తన సర్వే అంచనాలపై మాట్లాడలేదు. తనను మాట్లాడమని కోరిన మీడియా ప్రతినిధుల వినతిని లగడపాటి సున్నితంగా తిరస్కరించారు. సాధారణంగా తాను గుడి దగ్గర రాజకీయాల గురించి మాట్లాడబోనని వ్యాఖ్యానించిన లగడపాటి... కొద్ది రోజుల క్రితం ఇక్కడ తెలంగాణ రాజకీయాలపై మాట్లాడటం పొరపాటైందని అన్నారు. ఆ రోజు కూడా తాను మాట్లాడాలనుకోలేదని... అయితే అనుకోకుండా రాజకీయాలపై మాట్లాడానని లగడపాటి రాజగోపాల్ చెప్పడం మరో విశేషం.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమికే విజయావకాశాలు ఉన్నాయని తన సర్వేలో తేలినట్టు ప్రకటించిన లగడపాటి రాజగోపాల్... తిరుమలలోనే రాజకీయ వేడికి బీజం వేశారు. కొద్ది రోజుల క్రితం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తరువాత తెలంగాణలో 8 నుంచి 10 మంది ఇండిపెండెంట్లు గెలవబోతున్నారని ప్రకటించిన రాజగోపాల్... వారిలో ఇద్దరు పేర్లను కూడా అక్కడే ప్రకటించారు. ఆ తరువాత ఓ టీవీ ఛానల్ నిర్వహించిన చర్చలో పాల్గొన్న లగడపాటి... ఎన్నికలకు రెండు రోజుల ముందు కూడా మీడియా ముందుకు వచ్చి తన సర్వే అంచనాలు వెల్లడించారు. మహాకూటమి బలపడుతోందని జోస్యం చెప్పారు.

ఎన్నికలు పూర్తయిన తరువాత అన్ని ఎగ్జిట్ పోల్స్ టీఆర్ఎస్ గెలుస్తుందని అంచనా వేయగా... లగడపాటి మాత్రం మహాకూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని మరోసారి అందరిలోనూ ఉత్కంఠ పెరిగేలా చేశారు. అయితే వాస్తవ ఫలితాల్లో టీఆర్ఎస్ ఘనవిజయం సాధించడంతో లగడపాటి అంచనాలు తారుమారయ్యాయి. దీంతో ఆయన తన సర్వే అంచనాలపై ఏ విధంగా స్పందిస్తారో అని అంతా ఎదురుచూశారు. కానీ... ఈ అంశంపై ఇప్పుడప్పుడే మాట్లాడే అవకాశం లేదని ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది.

ఇవి కూడా చదవండి
Published by: Kishore Akkaladevi
First published: December 15, 2018, 7:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading