Jr.NTR in TDP: ఎన్టీఆర్ రావాల్సిందే.. కుప్పంలో చంద్రబాబుకు కార్యకర్తల షాక్

చంద్రబాబు, జూ.ఎన్టీఆర్ (ఫైల్)

తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party, అధినేత నారా చంద్రబాబునాయుడుకి (TDP Chief Nara Chandra Babu Naidu) తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఊహించని పరిణామం ఎదురైంది. కార్యకర్తలు చేసిన నినాదాలతో చంద్రబాబు మౌనంగా ఉండిపోవాల్సి వచ్చింది.

 • Share this:
  తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుకి తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఊహించని పరిణామం ఎదురైంది. కార్యకర్తలు చేసిన నినాదాలతో చంద్రబాబు మౌనంగా ఉండిపోవాల్సి వచ్చింది. కుప్పంలో చంద్రబాబు తప్ప మరో నేత పేరు వినిపించదు. మూడు దశాబ్దాలుగా ఆయన కుప్పంలోనే విజయం సాధిస్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు కుప్పం సాక్షిగా పార్టీ బలోపేతంపై కార్యకర్తలు మనసులో మాట చెప్పేశారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన శాంతిపురం మండలంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై, వైఎస్ఆర్సీపీ నేతలపై విమర్శలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈక్రమంలో చంద్రబాబు ప్రసంగిస్తుండగా అక్కడున్న కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ రావాలంటూ నినాదాలు చేశారు.

  ఎన్టీఆర్ రావాలి సార్..
  శాంతిపురం రోడ్ షోలో చంద్రబాబును సార్ సార్ అంటూ పిలిచి మరీ జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకురావాలంటూ అక్కడి కార్యకర్తలు కోరారు. “జూనియర్ ఎన్టీఆర్ ని ప్రచారానికి తీసుకుండి సార్.. జూనియర్ ఎన్టీఆర్ తప్పకుండా రావాలి సర్.. కుప్పం కూడా తీసుకురావాలి సర్..” అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఐతే ఈ నినాదాలు విన్న చంద్రబాబు మౌనంగా తలుపుతూ ఉండిపోయారు. ఎన్టీఆర్ వస్తారని గానీ.., రారు అని గానీ చెప్పలేదు. దీంతో టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం ఎంతుందో కార్యకర్తలు చంద్రబాబుకు చెప్పకనే చెప్పారు. సొంత నియోజకవర్గంలోనే ఈ డిమాండ్ వినిపించడం పార్టీలో చర్చనీయాంశమైంది.


  ఇది చదవండి: కుప్పంలో ‘పవర్ కట్’ పాలిటిక్స్.. వైసీపీ పనేనంటూ టీడీపీ ఫైర్  కార్యకర్తలు మనసులో మాట అదేనా..?
  రాష్ట్రంలో టీడీపీ బలపడాలంటే జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఒక్కటే మార్గమని కార్యకర్తలతో పాటు నేతలు కూడా భావిస్తున్నారు. గతంలో పలు చోట్ల ఎన్టీఆర్ సీఎం అంటూ ఫ్లెక్సీలు కూడా వెలిశాయి. అంతెందుకు చంద్రబాబు పర్యటన సందర్భంగా కార్యకర్తలు కుప్పంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో కూడా ఎన్టీఆర్ ఫోటోలు దర్శనమిచ్చాయి. గతంలో చంద్రబాబు కుప్పం వెళ్లినప్పుడల్లా కేవలం చంద్రబాబు, లోకేష్ ఫోటోలతో మాత్రమే ఫ్లెక్సీలుండేవి కానీ ఈసారి అందుకు భిన్నంగా ఎన్టీఆర్, బాలకృష్ణ, హరికృష్ణ ఫోటోలు కూడా కనిపించాయి.

  ఇది చదవండి: ఆ నేత విషయంలో సీఎం జగన్ మాట తప్పారా..? ఆమె వల్లే పదవి రావడం లేదా..?  తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తర్వాత బలమైన నాయకుడు ఎవరని ప్రశ్నిస్తే.. ఆ పార్టీ నేతలు టక్కున జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పేస్తారు. ఎన్టీఆర్ ఒక్కడే టీడీపీని గట్టెక్కించగలడని చాలా సార్లు బహిరంగంగానే ప్రకటించిన సందర్భాలున్నాయి. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైన తర్వాత ఎన్టీఆర్ అవసరం పార్టీకి చాలా ఉందని కొంతమంది నేతలు వ్యాఖ్యానించారు. పార్టీ పూర్వవైభవం ఎన్టీఆర్ తోనే సాధ్యమని కూడా చెప్పారు. కానీ ఈ డిమాండ్లపై అటు ఎన్టీఆర్ గానీ.. ఇటు చంద్రబాబు గానీ స్పందించలేదు.

  మౌనంగానే ఎన్టీఆర్..
  ఐతే యాక్టివ్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వడంపై ప్రశ్నించిన ప్రతిసారీ ఎన్టీఆర్ మాత్రం మౌనంగానే ఉంటున్నారు. అప్పుడప్పుడు మాత్రం తెలుగుదేశం పార్టీ తమదేనని.. ప్రత్యేకంగా చేరాల్సిన అవసరం ఏముందని కామెంట్ చేశారు. 2009 ఎన్నికల సమయంలో మాత్రం టీడీపీకి మద్దతుగా ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఐతే అప్పట్లో ఎన్టీఆర్ ప్రచారం చేసిన చోట పార్టీకి ఓటమే ఎదురైంది. ఓవరాల్ గా ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలవడంతో రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

  ఐతే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే ఎన్టీఆర్ ను ఎన్నికల కోసం వాడుకొని వదిలేశారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లాంటి వారు కూడా ఇదే విషయాన్ని పలుసార్లు లేవనెత్తారు. తన కుమారుడు లోకేష్ కోసమే చంద్రబాబు.. ఎన్టీఆర్ ను పక్కనబెట్టారని నాని, వంశీ ఆరోపించారు. ఐతే ఈ విమర్శలపై ఎన్టీఆర్ ఎప్పటికీ స్పందించకపోయినా పార్టీ మాత్రం అంటీ ముట్టనట్లుగానే వ్యవరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఏకంగా కుప్పంలోనే కార్యకర్తలు ఎన్టీఆర్ రావాలని కోరిన నేపథ్యంలో చంద్రబాబు.. ఎన్టీఆర్ ను ఆహ్వానిస్తారా? లేదా? అనేది వేచి చూడాలి.
  Published by:Purna Chandra
  First published: