HOME »NEWS »POLITICS »kumaraswamay completes 100 days as cm meets rahul gandhi

సీఎంగా 100 రోజులు... రాహుల్‌తో కుమార‌స్వామి భేటీ

సీఎంగా 100 రోజులు... రాహుల్‌తో కుమార‌స్వామి భేటీ
రాహుల్‌గాంధీతో కుమార‌స్వామి

సెప్టెంబ‌ర్ తొలివారంలో సిద్ధ‌రామయ్య యూర‌ప్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా రాష్ట్రంలో కుమార‌స్వామికి వ్య‌తిరేకంగా కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకునే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో సిద్ధ‌రామ‌య్య‌ను క‌ట్ట‌డి చేయాల‌ని కుమార‌స్వామి రాహుల్‌ను కోరిన‌ట్టు తెలుస్తోంది.

  • Share this:
    క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌క్కువ సీట్లు గెలుచుకున్నా... అనూహ్యంగా కాంగ్రెస్ మ‌ద్ద‌తుతో ముఖ్య‌మంత్రి ప‌ద‌విని ద‌క్కించుకున్నారు జేడీఎస్ నేత కుమార‌స్వామి. మే నెల‌లో సీఎంగా ప్ర‌మాణం చేసిన కుమార‌స్వామి... సీఎంగా వంద రోజులు పూర్తి చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఢిల్లీలో కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్‌గాంధీని క‌లిసి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. పాల‌నాప‌ర‌మైన అంశాల్లో ఇప్ప‌టివ‌ర‌కు కాంగ్రెస్ త‌న‌కు సంపూర్ణ మ‌ద్దతు ఇచ్చింద‌ని రాహుల్‌కు తెలియ‌జేసిన కర్ణాట‌క సీఎం... ఇక ముందు కూడా ఇదే ర‌క‌మైన స‌హ‌కారం అందించాల‌ని ఆయ‌న‌కు విజ్ఞ‌ప్తి చేశారు. త‌న ప‌రిపాల‌న ప‌ట్ల కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్‌గాంధీ పూర్తి సంతృప్తిగా ఉన్నార‌నే న‌మ్మ‌కంతో ఉన్న కుమార‌స్వామి... తాను పూర్తికాలం ముఖ్య‌మంత్రి ప‌ద‌విలో కొన‌సాగుతాన‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

    కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ త‌న ప‌రిపాల‌న ప‌ట్ల పూర్తి సంతృప్తితో ఉన్నార‌ని భావిస్తున్నారు క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి. అయితే కర్ణాట‌క‌లో కొంద‌రు కాంగ్రెస్ నేత‌లు త‌న ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని కుమార‌స్వామి రాహుల్‌కు ఫిర్యాదు చేశార‌ని జేడీఎస్ వ‌ర్గాలు చెబుతున్నాయి. మాజీ సీఎం సిద్ధ‌రామ‌య్య వ్యాఖ్య‌ల‌ను కుమార‌స్వామి రాహుల్ దృష్టికి తీసుకెళ్లిన‌ట్టు తెలుస్తోంది.




    సిద్ధ‌రామ‌య్య వ్యాఖ్య‌ల ప్ర‌స్తావ‌న‌
    రాహుల్‌గాంధీతో భేటీ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి మాజీ సీఎం, కాంగ్రెస్ నాయ‌కుడు సిద్ధ‌రామ‌య్య వ్యాఖ్య‌ల‌ను ప్ర‌ముఖంగా ప్ర‌స్తావించిన‌ట్టు జేడీఎస్ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి. కొద్దిరోజుల క్రితం క‌ర్ణాట‌క‌లోని వ‌ర‌ద బాధిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించిన సిద్ధ‌రామ‌య్య... ఆ సంద‌ర్భంగా ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాను మ‌రోసారి ముఖ్య‌మంత్రి కావాల‌ని అనుకుంటున్నాన‌ని, తన‌కు ప్ర‌జ‌ల ఆశీస్సులు కూడా ఉంటాయ‌ని భావిస్తున్నాన‌ని వ్యాఖ్యానించారు. సిద్ధ‌రామ‌య్య వ్యాఖ్య‌లు జేడీఎస్ వ‌ర్గాల్లో స‌రికొత్త చ‌ర్చ‌కు తెర‌లేపాయి. కొంద‌రైతే ఆయ‌న జేడీఎస్ ప్ర‌భుత్వాన్ని కూల‌దోసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌నే అనుమానాలు కూడా వ్య‌క్తం చేశారు. సెప్టెంబ‌ర్ తొలివారంలో సిద్ధ‌రామయ్య యూర‌ప్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా రాష్ట్రంలో కుమార‌స్వామికి వ్య‌తిరేకంగా కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకునే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో సిద్ధ‌రామ‌య్య‌ను క‌ట్ట‌డి చేయాల‌ని కుమార‌స్వామి రాహుల్‌ను కోరిన‌ట్టు తెలుస్తోంది. అయితే రాహుల్‌తో భేటీ అనంత‌రం ఈ ప్ర‌చారంపై కుమార‌స్వామి స్పందించారు. సిద్ధ‌రామ‌య్య త‌న ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు వ‌స్తున్న వార్త‌ల్లో ఎలాంటి నిజం లేద‌న్నారు. ఇక క‌ర్ణాట‌క కేబినెట్ విస్త‌ర‌ణ అంశంపై కూడా కుమార‌స్వామి రాహుల్ గాంధీతో చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.
    Published by:Kishore Akkaladevi
    First published:August 30, 2018, 17:43 IST

    टॉप स्टोरीज