ఆర్టీసీపై పార్లమెంట్‌లో టీఆర్ఎస్ వ్యూహం ఇదే... ఎంపీలకు కేటీఆర్ దిశానిర్దేశం...

టీఆర్ఎస్ ఎంపీలతో కేటీఆర్ సమీక్ష

ఈనెల 18 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో టీఆర్ఎస్ ఎంపీలతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్ష నిర్వహించారు.

  • Share this:
    పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈనెల 18 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఎంపీలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. తెలంగాణలో ప్రస్తుతం ఆర్టీసీ సమ్మె హాట్ హాట్‌గా ఉంది. తెలంగాణ నుంచి కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు పార్లమెంట్‌లో ఈ అంశాన్ని లేవనెత్తడానికి ప్లాన్ చేస్తున్నారు. బీజేపీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్.. తన మీద పోలీసులు చేసిన దాడి గురించి ప్రివిలేజ్ నోటీస్ కూడా ఇచ్చారు. ఈ క్రమంలో పార్లమెంట్‌ సమావేశాల్లో ఆర్టీసీ అంశం మీద ఎలా ముందుకెళ్లాలనే అంశంపై ఎంపీలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.

    ‘పార్లమెంట్‌లో ఏం మాట్లాడాలో సిద్ధంగా ఉండాలి. ఆర్టీసీ మీద ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ఏదైతే చెబుతున్నారో వాటినే ఎంపీలు పార్లమెంట్‌లో కూడా వినిపించాలి. ఎవరు మాట్లాడినా అవే అంశాలు ఉండాలి. తలోరకంగా మాట్లాడొద్దు. ప్రభుత్వం ఇన్ని రోజులుగా ఏం చెబుతుందో అదే చెబుతాం. అబద్ధాలు చెప్పాల్సిన పనిలేదు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీల గురించి కూడా తెలుసుకోండి. అవసరమైతే ప్రభుత్వం నుంచి సమగ్రంగా సమాచారం తీసుకోండి. ఎంపీలు ప్రిపేర్‌గా ఉండండి.’ అని కేటీఆర్ ఎంపీలకు సూచించినట్టు తెలిసింది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయ్యే నాటికి ఆర్టీసీపై అధికారికంగా ఒకరో, ఇద్దరు మాత్రమే మాట్లాడేలా ప్లాన్ చేద్దామని కేటీఆర్ చెప్పినట్టు సమాచారం.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: