కృష్ణపట్నం ఆనందయ్య (Krishnapatnam Anandaiah).. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. కరోనాసెకండ్ వేవ్ (Corona Second Wave) సమయంలో ఈయన చాలా పాపులర్ అయ్యారు. కరోనాకు ఆనందయ్య కనిపెట్టిన ఆయుర్వేద మందు దేశవ్యాప్తంగా మార్మోగింది. కరోనాకు అప్పటికే వ్యాక్సిన్ వచ్చినా.. ఆస్పత్రుల్లో చికిత్స అందుబాటులో ఉన్నా.. వాటిని కాదని.. లక్షలాది మంది నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి పరుగులు పెట్టారు. అక్కడ ఆనందయ్య ఇచ్చే కరోనా ఆయుర్వేద మందు కోసం ఎగబడ్డారు. ఆనందయ్య మందు తీసుకున్న తర్వాతే తమకు కరోనా తగ్గిపోయిందని.. విషమ పరిస్థితుల నుంచి క్షేమంగా ఇంటికి వెళ్లామని చాలా మంది చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఆనందయ్య మందు గురించి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. సాధారణ ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఆయన మందు తీసుకున్నారు. అంతేకాదు ఉచితంగానే మందును పంపిణీ చేయడంతో అసలైన హీరోగా అభివర్ణించారు.
ఐతే అదే ఆనందయ్య ఇప్పుడు మరో సంచలనానికి తెరలేపారు. ఏపీలో కొత్త పార్టీని ప్రకటిస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం బీసీ సంక్షేమ సంఘం గదౌరవ అధ్యక్షుడిగా ఉన్న ఆనందయ్య రాజకీయ పార్టీ ప్రకటన చేశారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలోని నూకాలమ్మ ఆలయాన్ని సందర్శించిన ఆనందయ్య.. అన్ని రాజకీయ పార్టీలు బీసీలను విస్మరిస్తున్నాయన్నారు. బీసీ జేఏసీ ద్వారా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు స్పష్టం చేశారు. గతంలోనే ఆనందయ్య రాజకీయ పార్టీపై కామెంట్స్ చేశారు. ఇక కరోనా థర్డ్ వేవ్ వచ్చినా తాను సిద్ధమని.. మందును పంపిణీ చేయడానికి రెడీగా ఉన్నట్లు ఆనందయ్య ప్రకటించారు.
ఇతర బీసీ కులాలను కలుపుకొని ప్రత్యేక పార్టీని ఏర్పాటు చేస్తామని ఆనందయ్య వెల్లడించారు. జాతీయ నేతల అండదండలతో బలహీన వర్గాలను కలుపుకుని ముందకు వెళ్తామని ఆయన చెప్పారు. అంతేకాదు వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో రథయాత్ర నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నామని ఆనందయ్య అప్పట్లో చెప్పారు.
గతంలో తన మందు పంపిణీకి ప్రభుత్వం అడ్డంకులు సృష్టించిందంటూ ఆనందయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో తన ఆయుర్వేద మందుకు అనుమతి ఇవ్వకుండా వైసీపీ సర్కార్ ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపించారు. ప్రభుత్వం తనను అణగదొక్కాలని చూసిందని, అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయించడానికి ప్రయత్నించిందని విమర్శించారు ఆనందయ్య. కరోనా మందు ఫేమస్ అయిన సందర్భంలోనే ఆనందయ్య రాజకీయాల్లోకి వస్తారన్న ప్రచారం జరిగింది. అలాగే ఆయన్ను ఎమ్మెల్సీ చేస్తారన్న వార్తలు కూడా వినిపించాయి. ఈ వార్తలు చక్కర్లు కొడుతున్న సమయంలోనే ఆనందయ్య రాజకీయ పార్టీ ప్రకటన చర్చనీయాంశమైంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anandaiah corona medicine, Andhra Pradesh, AP Politics