Home /News /politics /

KOTTHAGUDEM TRS MLA VANAMA VENKATESWARA RAO SON RAGHAVA SINS ARE NOW WRAPPED AROUND HIS FATHERS NECK KMM PRV

TRS MLA: ఆ టీఆర్​ఎస్​ ఎమ్మెల్యే రాజీనామా చేస్తారా? లేక రాజీ పడుతారా? కొడుకు పాపాలే తండ్రికి ఎసరు.!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పంచాయతీ బోర్డు సభ్యునిగా రాజకీయ జీవితం ప్రారంభించిన వనమా అంచెలంచలుగా ఎదిగారు.ప్రజలకు అందుబాటులో ఉండే నేతగా, మాస్‌ లీడర్‌గా పేరు తెచ్చుకున్నప్పటికీ.. కొడుకు రాఘవ చేసిన పాపాలు ఇప్పుడు తండ్రి మెడకు చుట్టుకుంటున్నాయి.

  (జి. శ్రీనివాసరెడ్డి, కరస్పాండెంట్‌, న్యూస్‌ 18 తెలుగు, ఖమ్మం జిల్లా)

  కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తన పదవికి రాజీనామా చేస్తారా..? లేక పార్టీ అధిష్టానం చేయిస్తుందా..? కొడుకు చేసిన పాపాలు ఒక్కొక్కటి బయటికి వచ్చి శాపాల్లా తగులుతున్న వేళ వృద్ధాప్యంలో వనమా వణికిపోతున్నారు. పంచాయతీ బోర్డు సభ్యునిగా రాజకీయ జీవితం ప్రారంభించిన వనమా అంచెలంచలుగా ఎదిగారు. సొసైటీ ఛైర్మన్‌గా, పాల్వంచ మున్సిపల్‌ ఛైర్మన్‌గా, కొత్తగూడెం ఎమ్మెల్యేగా, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. తనవరకు తాను ప్రజలకు అందుబాటులో ఉండే నేతగా, మాస్‌ లీడర్‌గా పేరు తెచ్చుకున్నప్పటికీ.. కొడుకు రాఘవ చేసిన పాపాలు ఇప్పుడు తండ్రి మెడకు చుట్టుకుంటున్నాయి.

  ఈనెల 3వ తేదీ తెల్లవారుజామున పాత పాల్వంచకు చెందిన నాగరామకృష్ణ కుటుంబం సామూహిక ఆత్మాహుతికి పాల్పడటానికి.. ఇంకా నియోజకవర్గంలో అనేక మంది బలవర్మణాలకు రాఘవ వేధింపులు, దౌర్జన్యాలే కారణమని జనం ఘోషిస్తున్న పరిస్థితి. నాగరామకృష్ణ కుటుంబం బలవన్మరణం కేసులో రామకృష్ణ సెల్ఫీ వీడియో ఆధారంగా ఇప్పటికే రాఘవను అరెస్టు చేశారు. భద్రతా కారణాల రీత్యా భద్రాచలం సబ్‌జైలు నుంచి నిన్న తెల్లవారుజామున ఖమ్మం జిల్లా జైలుకు తరలించారు. పాల్వంచ ఏఎస్పీ రోహిత్‌రాజ్‌ స్వయంగా జరిపిన విచారణలో తాను నాగరామకృష్ణ కుటుంబాన్ని మానసికంగా తీవ్రంగా వేధించినట్టు రాఘవ ఒప్పుకున్నాడని ఏఎస్పీ మీడియా సమావేశంలో ప్రకటించారు. ఇది రాఘవ ప్రమేయాన్ని స్పష్టం చేసింది.

  రాఘవను అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చిన రోజున అతని బాధితులు వందల సంఖ్యలో అక్కడ గుమిగూడారు. అతన్ని ఉరి తీయాలంటూ నినాదాలు చేశారు. అతను పాల్పడిన అక్రమాలపై ఒక ప్రత్యేక కమిషన్‌ వేసి విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. ఇలా వనమా రాఘవ అలియాస్‌ రాఘవేంద్ర చేసిన పాపాలు ఇప్పుడు తండ్రి వనమా వెంకటేశ్వరరావును వెంటాడుతున్నాయి. గడిచిన మూడు దశాబ్దాలుగా తండ్రి. అధికారాలను అడ్డుపెట్టుకుని కొడుకు రాఘవ సాగించిన అక్రమాలు, అరాచకాలు, దౌర్జన్యాలు, దాష్టీకాలను ప్రజలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రాఘవ జైలు నుంచి బయటకు రావొద్దని కోరుకుంటున్నారు. రానీయొద్దని వేడుకుంటున్నారు.

  కొన్నేళ్ల క్రితం విక్రమార్కుడు సినిమాలో దర్శకుడు రాజమౌళి చూపినట్టు.. పోలీసు అధికారి సతీమణిని సైతం చెరపట్టిన కీచకుడు రాఘవ అని స్థానిక ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఇలా రాఘవ బాధితుల సంఖ్య వందల్లోనే ఉంటుందని చెబుతున్నారు. వనమా రాఘవ అక్రమాలపై విచారణ విషయంలో భాజపా, కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎంఎల్‌ సహా దాదాపు అన్ని పార్టీలు గొంతెత్తుతున్నాయి. తెరాస సైతం మౌనంగా ఉన్నా జరిగిన అక్రమాలపై, వెలుగులోకి వస్తున్న అరాచకాలపై ఎలా స్పందించాలో అర్థంకాక మౌనం వహిస్తోంది. అసలు ఎమ్మెల్యేగా ఉన్న వనమాను రాజీనామా చేయించడం ద్వారానో లేక బర్తరఫ్‌ చేయడం ద్వారానో పరిస్థితిని చక్కదిద్దొచ్చన్న చర్చ సైతం నడుస్తోంది. ఇన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చాక కూడా అధికార పార్టీ మౌనం వహిస్తే జనంలోకి తప్పుడు సందేశం వెళ్తుందన్న చర్చ కూడా నడుస్తోంది.

  వనమా రాఘవ అక్రమాలు వెలుగులోకి వచ్చాక తెరాస పార్టీ అధిష్టానం, సీఎం కేసీఆర్‌ ఆరా తీసినట్టు చెబుతున్నారు. ఆయన ఓకే అన్న తర్వాతనే వనమా రాఘవను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. నిజానికి ప్రభుత్వంలోగాని, పార్టీలోగాని  చెప్పుకోదగిన స్థాయి పదవులు చేపట్టని రాఘవపై తీసుకున్న చర్యల విషయంలో ఎవరూ సంతృప్తిగా లేరు. కేవలం అతని ప్రాథమిక సభ్యత్వాన్ని మాత్రమే సస్పెండ్‌ చేసింది. ఇది ఏ విధంగా సమర్ధనీయమన్నది జనం ప్రశ్న. అసలు వనమా రాఘవ దుర్వినియోగం చేసింది తండ్రి  అధికారాన్ని.. ఎమ్మెల్యేగా ఉన్న తండ్రి అధికారాలను తాను షాడో ఎమ్మెల్యేలా అనుభవించి జనాన్ని వేధించాడని, పోలీసు అధికారులను ఉపయోగించి దారుణాలకు ఒడిగట్టాడని చెబుతున్నారు. ఇప్పటికీ అతనికి కొందరు పోలీసు అధికారులు సహకరిస్తున్నారని, గతంలో రాఘవ ద్వారా లబ్ది పొందిన  అధికారులు ఇప్పటికీ లోపాయికారిగా  సహాయం అందిస్తున్నారని చెబుతున్నారు.

  రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం..

  ఇప్పటికైనా తెరాస అధినాయకత్వం సరైన చర్యలు తీసుకోకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పని పరిస్థితి ఉందంటున్నారు పలువురు . దీనిపైనే తెరాస అధినాయకత్వం తర్జనభర్జనకు గురవుతున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాకు చెందిన నేతల అభిప్రాయాలను సేకరించి తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. వనమా రాఘవ అక్రమాలపై చట్ట ప్రకారం వ్యవహరిస్తున్నప్పటికీ, ప్రజలను ఈ మేరకు సంతృప్తి పర్చడంలో విఫలమైతే రాజకీయంగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. అయితే కాంగ్రెస్‌ నుంచి గెలిచి ఆనక తెరాస తీర్థం పుచ్చుకున్న వనమా వెంకటేశ్వరరావుకు ఇప్పుడు దాదాపు అన్ని దారులు మూసుకుపోయినట్టే అని చర్చించుకుంటున్నారు పలువురు. ఇది ఒక రకంగా ఆయన రాజకీయ భవిష్యత్‌ను చీకటిమయం చేసినట్లేనని అందరూ భావిస్తున్నారు.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Bhadrari kothagudem, Khammam, Vanama

  తదుపరి వార్తలు