Konda Vishweshwar Reddy: షర్మిల పార్టీపై కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ నేతలపై షాకింగ్ కామెంట్స్..

కొండా విశ్వేశ్వర్ రెడ్డి(ఫైల్ పొటో)

తన రాజకీయ భవిష్యత్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 • Share this:
  తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలపై చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాంగ్రెస్ గుడ్ బై చెప్పిన కొండా విశ్వేశ్వరరెడ్డి.. ఆదివారం మీడియాతో మాట్లాడారు. తాను అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చినట్టు తెలిపారు. కేసీఆర్ మూడేళ్లు వెంటపడితే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. తాను అనుకున్నంత మార్పు తెలంగాణలో కేసీఆర్ తీసుకురాలేకపోయారని అన్నారు. కాగ్ నివేదికలో ఇదే విషయం తెలుస్తుందన్నారు. తెలంగాణలో బలమైన ప్రతిపక్షం ఉండాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ అవసరం ఉందని.. అయితే పార్టీలు ఎక్కువైతే అంతిమంగా టీఆర్‌ఎస్‌కే లాభం జరుగుతుందని అన్నారు. మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్ తనకు ఇష్టమైన నేతలు అని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్‌ తప్పుకుని టీఆర్ఎస్ నాయకత్వాన్ని హరీశ్ లేదా ఈటలకు ఇస్తే మళ్ళీ టీఆర్ఎస్‌లో చేరతానన్నారు.

  కాంగ్రెస్ పార్టీలో అనేక గ్రూపులున్నాయన్నారు. ఎన్నికలకు ముందు సగం మంది కాంగ్రెస్ నేతలు అమ్ముడుపోయారని సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌కు సొంత పార్టీ నేతలే విలన్లుగా మారుతున్నారని విమర్శించారు. ఇప్పటివరకు తన రాజకీయ భవిష్యత్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని అన్నారు. కొత్త పార్టీని పెట్టాలా స్వతంత్రంగా పోటీ చేయాలా? కాంగ్రెస్ లో ఉండాలా లేదా బీజేపీ లో జాయిన్ కావాలా అని ఆలోచిస్తున్నట్టు చెప్పారు.

  ఇక, తెలంగాణలో వైఎస్ షర్మిల ఏర్పాటు చేయనున్న పార్టీపై కొండా విశ్వేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను షర్మిల పార్టీలో చేరే ప్రసక్తి లేదని, షర్మిల పార్టీ తెలంగాణ వ్యతిరేకి అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలో కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్న షర్మిల.. అందుకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే వేగం పెంచారు. ఏప్రిల్ 9న ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో పార్టీకి సంబంధించిన వివరాలను షర్మిల వెల్లడించనున్నారు.
  Published by:Sumanth Kanukula
  First published: