తెలంగాణ పీసీసీ కొత్త అధ్యక్షుడిపై కాంగ్రెస్ అధిష్టానం త్వరలోనే ప్రకటన చేయొచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ కావడం ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ పీసీసీ చీఫ్ మార్పు ఊహాగానాలు మళ్లీ జోరందుకున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానంలో కొత్త పీసీసీ చీఫ్ ఎంపికకై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు షురూ చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం వీలైనంత త్వరలోనే కొత్త అధ్యక్షుడిని ప్రకటించవచ్చని ప్రచారం జరుగుతోంది. మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాధిత్య సింథియా కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీ తీర్థంపుచ్చుకోవడం చకచకా జరిగిపోయింది. పార్టీకి సంబంధించిన కీలకమైన అంశాల్లో కాంగ్రెస్ అధిష్టానం నాన్చుడు ధోరణి అవలంభించడమే ఈ పరిణామాలకు కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాస్త ఆలస్యంగానైనా మేల్కొన్న కాంగ్రెస్ అధిష్టానం..పలు రాష్ట్రాల్లో పార్టీ ప్రక్షాళనపై దృష్టిసారించినట్లు సమాచారం. ఇందులో భాగంగా కర్ణాటకలో కాంగ్రెస్ సారథ్యపగ్గాలను పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరున్న డీకే శివకుమార్‌కు అప్పగించింది.
ఇటు తెలంగాణలోనూ పార్టీపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యారు. స్వయంగా సోనియాగాంధీ కోమటిరెడ్డిని తన నివాసానికి పిలుపించుకుని మాట్లాడినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, ఇతర రాజకీయ అంశాలపై వారు చర్చించినట్లు సమాచారం. కొత్త పీసీసీ చీఫ్ ప్రకటన త్వరలోనే వెలువడుతుందన్న కథనాల నేపథ్యంలో సోనియాగాంధీతో కోమటిరెడ్డి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కొత్త పీసీసీ చీఫ్ రేసులో కోమటిరెడ్డి ముందున్నారని ప్రచారం జరుగుతోంది. పీసీసీ సారథ్యపగ్గాలను తనకు అప్పగించాలని గతంలో పలుసార్లు ఆయన కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు మరో ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గా రెడ్డి తదితరులు కూడా పీసీసీ చీఫ్ పదవిని ఆశిస్తున్నారు. తెలంగాణలో బీజేపీ కొత్త సారథిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పేరును ఆ పార్టీ బుధవారం ఖరారు చేసింది. దీంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కొత్త పీసీసీ అధ్యక్షుడిని ప్రకటించాలని తెలంగాణ పార్టీ నేతలు కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరుతున్నారు. ఈ విషయంలో ఏ మాత్రం జాప్యం చేసినా పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు.
Published by:Janardhan V
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.