కోదండరామ్‌కు కొత్త పరీక్ష... ఇదే లాస్ట్ ఛాన్స్ ?

శాసనమండలిలో అడుగుపెట్టేందుకు కోదండరామ్ ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారనే ప్రచారం రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది.

news18-telugu
Updated: February 18, 2020, 4:05 PM IST
కోదండరామ్‌కు కొత్త పరీక్ష... ఇదే లాస్ట్ ఛాన్స్ ?
కోదండరామ్
  • Share this:
కేసీఆర్‌తో విభేదించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన టీజేఏసీ మాజీ చైర్మన్ కోదండరామ్... తెలంగాణ జనసమితి పేరుతో కొత్తగా పార్టీని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలతో కలిసి గత ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను ఢీకొట్టిన కోదండరామ్... అధికార పార్టీని నిలువరించడంలో ఏ మాత్రం విజయం సాధించలేకపోయారు. అసలు తెలంగాణ రాజకీయాల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది ఆయన సారథ్యంలోని తెలంగాణ జనసమితి. ఆ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు ఏ ఎన్నికల్లోనూ సత్తా చాటలేకపోయారు. గత ఎన్నికల్లో కోదండరామ్ రంగంలోకి దిగాలని భావించినా... పొత్తుల సమీకరణలో భాగంగా అది సాధ్యపడలేదు.

అయితే శాసనమండలిలో అడుగుపెట్టేందుకు కోదండరామ్ ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారనే ప్రచారం రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది. వచ్చే ఏడాది మార్చిలో జరగబోయే నల్లగండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టుభద్రుల నియోజకవర్గం ఎన్నికల్లో పోటీ చేయాలని కోదండరామ్ భావిస్తున్నారని సమాచారం. కాంగ్రెస్, వామపక్షాల సహకారంతో ఈ ఎన్నికల బరిలో దిగి విజయం సాధించాలని ఆయన యోచిస్తున్నారని తెలుస్తోంది. పట్టుభద్రుల ఎన్నికల్లో కోదండరామ్ పోటీ చేస్తే కచ్చితంగా టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఉంటుందని... ఆయన గెలిచే అవకాశం కూడా ఉంటుందని టీజేఎస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

గతేడాది కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇదే రకంగా విజయం సాధించారని పలువురు గుర్తు చేసుకుంటున్నారు. అయితే పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరామ్ పోటీ చేస్తే... ఆయన కచ్చితంగా గెలవాల్సి ఉంటుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఆ ఎన్నికల్లోనూ ఆయన ఓటమిపాలైతే... ప్రజల్లో ఆయన ఇమేజ్ మరింత తగ్గిపోతుందని భావిస్తున్నారు. మొత్తానికి ఎమ్మెల్సీగా ఎన్నికై... కేసీఆర్‌కు సవాల్ విసరాలని భావిస్తున్న కోదండరామ్ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.
First published: February 18, 2020, 4:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading