జగన్ పార్టీలో కొత్త అస్త్రం.. ఆ బాధ్యతలు ఆయనకే

డిసెంబర్ 9 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోనూ ఈ మాటల యుద్ధం కొనసాగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి

news18-telugu
Updated: November 24, 2019, 2:43 PM IST
జగన్ పార్టీలో కొత్త అస్త్రం.. ఆ బాధ్యతలు ఆయనకే
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
  • Share this:
(సయ్యద్ అహ్మద్, న్యూస్ 18 విజయవాడ  కరెస్పాండెంట్)

ఏపీలో ఇంగ్లీష్ మాధ్యమం, తిరుమల వ్యవహారాలను అడ్డుపెట్టుకుని విపక్ష టీడీపీ, బీజేపీ, జనసేన చేస్తున్న మతపరమైన విమర్శలకు దీటుగా కౌంటర్ ఇవ్వాలని నిర్ణయించిన వైసీపీ సర్కారు ఆ బాధ్యతను మంత్రి కొడాలి నానికి అప్పగించినట్లు అర్ధమవుతోంది. చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు లోకేష్, మాజీ మంత్రి దేవినేని ఉమ, బీజేపీ ఎంపీ సుజనా చౌదరి, జనసేనాని పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ మంత్రి చేస్తున్న విమర్శలకు సమాధానం చెప్పేందుకు సైతం వారు జంకుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో మత రాజకీయాలు జోరందుకుంటున్నాయి. తొలుత ఈ తరహా విమర్శలు ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కొన్నిరోజులుగా సైలెంట్ అయిపోయారు. అయితే ఆయన ప్రారంభించిన విమర్శలను తన పార్టీకే చెందిన ఎంపీ సుజనా చౌదరితో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, మాజీ మంత్రి దేవినేని ఉమ, జనసేనాని పవన్ కళ్యాణ్ వంటి వారు కొనసాగిస్తున్నారు. వీరంతా దాదాపుగా సీఎం జగన్ ను మతపరంగా టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. తొలుత కన్నా ఇంగ్లీష్ భాష అమలులో మతపరమైన కుట్ర ఉందని ఆరోపిస్తే అదే అంశాన్ని వీరంతా తమ అజెండాగా మార్చేసుకున్నారు. ఆ తర్వాత తిరుమలలో జగన్ డిక్లరేషన్ ఇవ్వకపోవడాన్ని చంద్రబాబుతో పాటు ఆయన పార్టీ నేతలు ప్రతీ రోజూ ప్రస్తావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అయితే ఓ అడుగు ముందుకేసి జగన్ తిరుమల లడ్డూను జగన్ స్వీకరిస్తారా లేదా అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. రాష్ట్రంలో ఇంగ్లీష్ భాష అమలుకు వ్యతిరేకంగా చేస్తున్న వ్యాఖ్యల్లో భాగంగా తిరుమలలో సుప్రభాతం కూడా ఇంగ్లీష్ లో పాడిస్తారేమో అంటూ పవన్ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

పవన్ కళ్యాణ్, కొడాలి నాని, చంద్రబాబునాయుడు


స్వతహాగా క్రిస్టియన్ అయిన సీఎం జగన్ ను టార్గెట్ చేసే క్రమంలో రాష్ట్రంలో చేయడానికి ఇతర విమర్శలు లేక విపక్షాలు మత రాజకీయాన్ని ఎంచుకున్నాయని భావిస్తున్న సర్కారు.. వాటికి గట్టిగా కౌంటర్ ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో మాటల తూటాలు పేల్చే మంత్రి కొడాలి నానిని రంగంలోకి దింపింది. సన్నబియ్యానికి సంబంధించి టీడీపీ నేత దేవినేని ఉమకు కౌంటర్ ఇచ్చేందుకు ప్రెస్ మీట్ పెట్టిన నాని ఇదే అదనుగా బూతుపురాణం అందుకున్నారు. ఈ క్రమంలో విమర్శలు అదుపుతప్పాయి. జగన్ ను డిక్లరేషన్ ఇమ్మని అడగడానికి మీ తండ్రి ఖర్జూరనాయుడు కట్టించాడా అంటూ చంద్రబాబుపై కొడాలి నాని తీవ్ర విమర్శలకు దిగారు. దీనిపై టీడీపీ, బీజేపీ నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. బీజేపీ నేతలైతే మరో అడుగు ముందుకేసి మంత్రి వ్యాఖ్యలపై తిరుపతి, విజయవాడలో పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయినా వెనక్కి తగ్గని మంత్రి కొడాలి కొన్నిరోజులుగా మరింత జోరు పెంచారు. చంద్రబాబు, లోకేష్ తో పాటు సుజనా చౌదరిని దారుణంగా టార్గెట్ చేస్తూ ఆయన చేస్తున్న విమర్శలు హద్దులు దాటి పోతున్నాయి. అయినా ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు.

వాస్తవానికి తిరుమలపై కొడాలి నాని చేసిన విమర్శలపై అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో సీఎం జగన్ ఆయన్ను మందలించారని తొలుత వార్తలొచ్చాయి. అయితే అవేవీ నిజం కాదని కొన్నిరోజులుగా జరుగుతున్న పరిణామాలను బట్టి అర్ధమవుతోంది. తాను అన్నమాటకే కట్టుబడి ఉన్నానంటూ నాని చేస్తున్న విమర్శల హీట్ తో విపక్షాలు ఇప్పుడు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. మంత్రి కొడాలి పేరెత్తేందుకు సైతం ఆయా నేతలు ఇష్టపడటం లేదంటే అతిశయోక్తి కాదు. దీంతో మతపరమైన విమర్శలకు కొడాలి మాటల దాడితో కంట్రోల్ చేయాలని అధికారపక్షం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. డిసెంబర్ 9 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోనూ ఈ మాటల యుద్ధం కొనసాగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
Published by: Shiva Kumar Addula
First published: November 24, 2019, 2:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading