ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ – జనసేన పార్టీల మధ్య పొలిటికల్ వార్ ఓ రేంజ్ లో సాగుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. నిన్న గుడివాడ, మచిలీపట్నంలో నిర్వహించిన రోడ్ షో సందర్భంగా పవన్ చేసిన విమర్శలకు నాని ఘాటుగా స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ ఓటమితో పాటు పలు అంశాలపై ఆయన్ని టార్గెట్ చేశారు. ఎవరో వచ్చి ఏదో మాట్లాడితే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని కొడాలి నాని అన్నారు. అలాగే రాష్ట్రంలో పేకాట క్లబ్బులు మూయిస్తోందని మేమేనని.. పేకాట ఆడించాల్సిన అవసరం లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం జోలికి వస్తే ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు.
కొడాలి నాని మాట్లాడుతూ.. “ఈ రాష్ట్రంలో శివలింగం ఎవరో బొడి లింగం ఎవరో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ శివలింగం గనుకే నెత్తిన పెట్టుకున్నారన్నారు. శివలింగం ఎవరో బోడి లింగం ఎవరో భీమవరం, గాజువాక వెళ్తే చెప్తారని కౌంటర్ వేశారు. రెండు చోట్ల డిపాజిట్లు కూడా రానివారికి సీఎం జగన్మోహన్ రెడ్డిని విమర్శించే అర్హత లేదన్నారు. బీమవరం, గాజువాకలో పోటీ చేస్తే ప్రజలు ఛీ కొట్టినా సిగ్గులేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్యాకేజీ తీసుకొని స్క్రిప్ట్ చదివి వెళ్లిపోయే దొంగలను ప్రజలు నమ్మొద్దన్నారు. పవన్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండటం దురదృష్టకరం” అని కొడాలి నాని వ్యాఖ్యానించారు.
ఒక రాజకీయ పార్టీతో ఇంత స్థాయిలో వ్యాపారం చేయొచ్చని చూపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని కొడాలి నాని విమర్శించారు. యాక్టర్ల దగ్గర సలహాలు తీసుకోవాల్సిన అవసరం ముఖ్యమంత్రికి లేదన్నారు. అవసరమైతే స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్లి ముఖ్యమంత్రితో మాట్లాడవచ్చన్నారు. అసెంబ్లీలోపలికి రాలేకే.. రైతుల పేరుతో అసెంబ్లీని ముట్టడిస్తాముంటున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ది జనసేన పార్టీ కాదని.., తెలుగు సేనా శాంతి పార్టీ అని ఎద్దేవా చేశారు.
పవన్ కామెంట్స్ పై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చేందుకు పవన్ కల్యాణ్ ఎవరని ప్రశ్నించారు. అసెంబ్లీని ముట్టడించేందుకు ఆయనేమైనా విజయవాడలో ఉన్నారా..? అని నిలదీశారు. పవన్ ఫామ్ హౌస్ లో ఉండి రాజకీయాలు చేస్తున్నాన్నారు. పవన్ లాంటి వ్యక్తి రాజకీయాలకు పనికిరాడంటూ మండిపడ్డారు.
పవన్ ఎమన్నారంటే..!
నివర్ తుఫాన్ బాధితులను ఆదుకోవాలని కోరుతూ కృష్ణాజిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తున్న సమయంలో పవన్ కల్యాణ్ గుడివాడ, మచిలీపట్నం ఎమ్మెల్యేలు, మంత్రులైన కొడాలి నాని, పేర్ని నానిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘గుడివాడ నడిబొడ్డున నిలబడి చెబుతున్నా. అంతిమ శ్వాస వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అండగా నిలబడతా. సినిమాలు చేస్తూ ఏం రాజకీయాలు చేస్తారని కొందరు మాట్లాడుతున్నారు. పేకాట క్లబులు నడిపి మీరు రాజకీయం చేయగా లేనిది నిజాయితీగా సినిమాలు చేసుకుంటూ నేను రాజకీయాలు చేయకూడదా? సిమెంటు ఫ్యాక్టరీలు, మైనింగ్ సంస్థలు, మీడియా సంస్థలు నడిపి మీరు రాజకీయం చేస్తుంటే... సినిమాలు చేసుకుంటూ మేమెందుకు రాజకీయాలు చేయకూడదు? ఎంతసేపూ మీరంటున్న మాటలు పడుతూ, మీ కిందే ఊడిగం చేయాలా? ఆ రోజులు పోయాయి. ఎదురు తిరిగే రోజులు వచ్చాయి. చొక్కా పట్టుకొని నిలదీసే రోజులివి జాగ్రత్తగా ఉండండి.’ అని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.