కర్ణాటకలో రాజకీయ రసవత్తరంగా మారింది. 14 మంది కాంగ్రెస్ - జేడీఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. అయితే, కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాల వెనుక మాజీ సీఎం సిద్ధరామయ్య ఉన్నారని జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ అనుమానం వ్యక్తం చేశారు. సిద్ధరామయ్య మళ్లీ సీఎం పీఠం ఎక్కడానికి ఇలా చేస్తున్నారని దేవెగౌడ సందేహించారు. బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఈ రాజకీయ సంక్షోభం వెనుక సిద్ధరామయ్య ఉన్నారని నాకు తెలుసు. రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు సిద్ధరామయ్య మద్దతుదారులే.’ అని దేవెగౌడ అన్నారు. కర్ణాటకలో ఏర్పడిన సంక్షోభంపై చర్చించేందుకు దేవెగౌడ ఇంటికి మంత్రి, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ వచ్చారు. రాష్ట్రంలో పరిస్థితి చక్కబడాలంటే మళ్లీ సిద్ధరామయ్యను సీఎంగా చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని డీకే శివకుమార్ వెలిబుచ్చినట్టు తెలిసింది. అయితే, అందుకు ఒప్పుకోబోమని దేవెగౌడ స్పష్టం చేసినట్టు సమాచారం. ఒకవేళ సిద్ధరామయ్యను సీఎంగా చేసే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ పరిశీలించినట్టయితే.. తాను మద్దతు ఉపసంహరించుకుంటానని కూడా ఆయన హెచ్చరించినట్టు తెలిసింది.

దేవేగౌడతో కుమారస్వామి(PTI Image)
‘దీని వెనుక సిద్ధరామయ్య ఉన్నారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు ఆయన మద్దతుదారులే. ప్రభుత్వం ఏర్పాటైన దగ్గరి నుంచి ఆయన (సిద్ధరామయ్య) అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన గేమ్ ప్లాన్ నాకు తెలుసు. సిద్ధరామయ్యను మళ్లీ సీఎం కానివ్వను. సిద్ధరామయ్యను సీఎం చేయడమే కాంగ్రెస్ ప్రతిపాదన అయితే, నా మద్దతు ఉపసంహరిస్తా.’ అని దేవెగౌడ స్పష్టం చేసినట్టు తెలిసింది.

సీఎం కుమారస్వామి, మాజీ సీఎం సిద్ధరామయ్య (ఫైల్)
అయితే, కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గేను సీఎంగా ప్రతిపాదిస్తే తమకు సమ్మతమే అనే సమాచారాన్ని ఇచ్చినట్టు తెలిసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన దళిత నాయకుడు మల్లికార్జున ఖర్గే. అయితే, ఖర్గేను సీఎం చేసేందుకు సిద్ధరామయ్య మద్దతుదారులు ఒప్పుకోకపోవచ్చని రాజకీయ పరిశీలకుల అంచనా.

కన్నీరుపెట్టిన కుమారస్వామి (PTI)
సిద్ధరామయ్య, దేవెగౌడల మధ్య వైరం 2005 కంటే ముందు నుంచి ఉంది. ఒకప్పుడు జేడీఎస్లో కీలకనేతగా ఉన్న సిద్ధరామయ్య.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుత జేడీఎస్ - కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం 14 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. అందులో 11 మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలు. ప్రస్తుతం వారు ముంబైలోని ఓ హోటల్లో ఉన్నారు.