ఏపీలో ఎన్నికల ‘ఆట’ మొదలుకాకముందే...కాంగ్రెస్ టీమ్ ఆలౌట్!

కిశోర్ చంద్ర దేవ్(File)

ఒక్కో కాంగ్రెస్ సీనియర్ పార్టీ నాయకుడు పార్టీ వీడుతుండడంతో ఏపీలో ఆ పార్టీ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. టీడీపీతో పొత్తు ఉండదని తేలిపోవడంతో పార్టీ నేతలు ప్రత్యామ్నాయం వెతుక్కుంటున్నారు.

 • Share this:
  (పీవీ రమణ కుమార్ -అసిస్టెంట్ ఎడిటర్, న్యూస్18)

  హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. తాజాగా మాజీ కేంద్ర మంత్రి కిషోర్ చంద్ర దేవ్ పార్టీని వీడారు. “కాంగ్రెస్ పార్టీలో రాజకీయ శూన్యత ఉంది. దీన్ని సరిచేసేందుకు ఎన్నో సార్లు అధిష్టానానికి లేఖలు రాశాను. అయినా ఉపయోగం లేదు. మరో దారి లేక పార్టీని వీడుతున్నాను. స్థానిక నాయకత్వం పేరు కోసమే సమావేశాలు నిర్వహిస్తోంది తప్పితే పార్టీని బలోపేతం చేసేందుకు కాదు.” అని పార్టీని వీడిన కిషోర్ చంద్ర దేవ్ న్యూస్ 18 తో అన్నారు.

  విశ్వసనీయ సమాచారం ప్రకారం కిషోర్ చంద్ర దేవ్ అధికార తెలుగుదేశం పార్టీలో చేరేందుకు లైన్ క్లీయర్ చేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో టచ్ లో ఉంటూ తన నియోజకర్గమైన అరకు నుంచి మళ్లీ పార్లమెంటు సభ్యునిగా పోటీ చేసేందుకు టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. అయితే... చంద్రదేవ్  బయటకు మాత్రం తన రాజకీయ భవిష్యత్తు గురించి ఇంకా ఏమీ అనుకోలేదని... తన అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెబుతున్నారు.

  సీనియర్ కాంగ్రెస్ నాయకుడైన చంద్రదేవ్ ఐదు పర్యాయాలు లోక్ సభ సభ్యునిగా, ఒక టర్మ్ రాజ్యసభ సభ్యునిగా పని చేశారు. మన్మోహన్ సింగ్ కాబినేట్ లో గిరిజనాభివృద్ధి, పంచాయత్ రాజ్ శాఖ మంత్రిగా పని చేశారు. 1979లో గనుల శాఖ బాధ్యతలు నిర్వర్తించారు. ఇంత సుదీర్ఘ రాజకీయ జీవితాన్నిచ్చిన కాంగ్రెస్ పార్టీని వీడటంపై అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


  మరో సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి కూడా టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే ఆయన ఒకదఫా టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. రాహుల్ గాంధీ ఫోన్ చేసినా ఇక కాంగ్రెస్‌లో కొనసాగలేనని తేల్చిచెప్పిన కోట్ల...ఈ వారాంతంలోనే సైకిల్ ఎక్కనున్నారు. మరోవైపు ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్న నాదేండ్ల మనోహర్ కూడా కొన్ని మాసాల క్రితమే కాంగ్రెస్‌ను వీడి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీలో చేరారు. ఇలా ఒక్కొక్కరుగా ముఖ్య నాయకులంతా కాంగ్రెస్ పార్టీని వీడటంతో ఆ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది.

  కేంద్ర రాజకీయాల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలిసి పని చేయాలన్న నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో కూడా పొత్తులుంటాయని స్థానిక నేతలు భావించారు. టీడీపీ సాయంతో గౌరవప్రదమైన సీట్లు సాధించవచ్చిని అంచనా వేశారు. ముఖ్యనాయకులు సైతం తమ భవిష్యత్తుపై ఎన్నో కలలు కన్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో పొత్తు వికటించడంచో ఏపీ ఎన్నికల్లో పొత్తుకు టీడీపీ నేతలు వద్దంటున్నారు. కాంగ్రెస్‌తో కలిస్తే మొదటికే మోసం వస్తుందని భయపడుతున్నారు.ఏపీలో ఇరు పార్టీల మధ్య పొత్తు ఉండదని తేలిపోవడంతో తీవ్ర నిరాశకు లోనైన కాంగ్రెస్ నేతలు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు.

  ఇంకా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఏముంది. పార్టీ వీడటం తప్ప నేతలకు మరో మార్గం లేదు. అందుకే ఒక్కొక్కరుగా ఎవరి దారి వారు చూసుకుంటున్నారు అని పోలె విక్రం అనే రాజకీయ పరిశీలకులు న్యూస్ 18తో విశ్లేషించారు.


  అవకాశాలు వస్తున్న నాయకులు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. మిగతా నాయకులు రానున్న ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని... ఆ తర్వాత తమ భవిష్యత్తుకు ఎలాంటి డోకా ఉండదని లెక్కలు వేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సర్వ భోగాలు అనుభవించిన నాయకులు కష్టకాలంలో పార్టీని వీడటం వారి అవకాశవాదనికి నిదర్శనమని పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాళ్లే పార్టీని నాశనం చేశారని ఆక్రోషం వెల్లగక్కుతున్నారు.
  First published: