news18-telugu
Updated: September 11, 2020, 6:27 PM IST
కేసీఆర్, కిషన్ రెడ్డి(ఫైల్ ఫోటో)
కేంద్రంపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న విమర్శలు సరికాదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేంద్రం వివక్షతో పని చేస్తోందన్న తెలంగాణ ప్రభుత్వం విమర్శలను తప్పుబట్టారు... కేంద్రం విచక్షణతో పని చేస్తోందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను కేసీఆర్ సర్కార్ కేంద్రం మీద నెట్టడం సరికాదని కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సచివాలయం కూల్చివేతపై పెట్టిన దృష్టి.. కరోనాపై పెడితే బాగుంటుందని వ్యాఖ్యానించారు. మజ్లిస్ మెప్పు కోసం కేంద్రంపై విమర్శలు చేయొద్దని కిషన్ రెడ్డి సూచించారు. కేంద్రం రూ. 6 వేల ఇస్తున్నా కేసీఆర్ కిట్లో ప్రధాని మోదీ ఫోటో ఎందుకు పెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు.
ఆరేళ్ల నుంచి కొత్త రేషన్ కార్డులను కూడా ముద్రించలేదని ఆయన ఆరోపించారు. ప్రధాని మోదీ ఫోటో వేయాల్సి వస్తుందనే కారణంగానే తెలంగాణ ప్రభుత్వం కొత్త కార్డులను ముద్రించడం లేదని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక జాతీయ రహదారుల నిర్మాణం పెరిగిందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ చేపట్టి ఇవ్వకపోవడం వల్ల కొన్ని ప్రాజెక్టుల్లో జాప్యం జరుగుతోందని అన్నారు. కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందడం లేదని కేసీఆర్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలోని కాళేశ్వరం సహా వివిధ ప్రాజెక్టులకు కేంద్ర సంస్థల నుంచి ఎంత అప్పు వచ్చిందో చెప్పాలని ఆయన అన్నారు. కేంద్రం నుంచి వచ్చేవన్నీ తెలంగాణ ప్రజల హక్కు అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
Published by:
Kishore Akkaladevi
First published:
September 11, 2020, 6:27 PM IST