news18-telugu
Updated: May 19, 2020, 2:36 PM IST
సీఎం కేసీఆర్(ఫైల్ ఫోటో)
కేంద్రంపై విమర్శలు గుప్పించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్ సంకుచితభావంతో పరిపాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆరే నియంతృత్వపాలన సాగిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్ని నిధులు ఇచ్చారని ప్రశ్నించిన కిషన్ రెడ్డి.. వాళ్లు భిక్షగాళ్లా అని వ్యాఖ్యానించారు. చెప్పిన పంటే వేయాలంటూ రైతుల మెడపై కత్తి పెట్టడం ఏంటని తెలంగాణ ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. ప్రజాసంక్షేమం కోసమే కేంద్రం అనేక సంస్కరణలు తీసుకొస్తోందని కిషన్‌రెడ్డి వివరించారు. ప్రధాని మోదీ అందరి సలహాలు తీసుకుంటున్నారని ఆయన తెలిపారు. దేశం పరువుతీసేలా కొందరు విపక్ష నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.
వలస కార్మికుల కోసం సొంత రాష్ట్రాలతో కేంద్రం సంప్రదింపులు చేస్తోందని అన్నారు. రాష్ట్రాలతో సంప్రదిస్తూ కేంద్రం చర్యలు తీసుకుంటోందని అన్నారు. బస్సులన్నీ రాష్ట్రాల పరిధిలో ఉన్నాయని... వాటిని ఉపయోగించుకోవాలని చెప్పామని తెలిపారు. కేంద్ర నిధులు అనొద్దని గతంలో కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ఎందుకు చెప్పలేదని కిషన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. తెలంగాణలో ఇప్పటివరకు రేషన్‌కార్డులు ఎందుకు ప్రింట్ చేయలేదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ లోగో ప్రింట్ చేయాల్సి వస్తుందని.. తెలంగాణ వచ్చాక కూడా కొత్త రేషన్ కార్డులు ప్రింట్ చేయలేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రతి కేజీకి రూ.28 సబ్సిడీ కేంద్రం అందిస్తోందని... రేషన్ బియ్యంపై తెలంగాణ ప్రభుత్వం రూ.2 మాత్రమే సబ్సిడీ ఇస్తోందని తెలిపారు.
Published by:
Kishore Akkaladevi
First published:
May 19, 2020, 2:36 PM IST