Khammam: ఖమ్మం టీఆర్ఎస్ నేతల్లో ‘గ్రేటర్’ ఎన్నికల టెన్షన్.. ఎందుకంటే..

Khammam: జీహెచ్‌ఎంసీ ఎన్నికలు పూర్తవుతూనే ఖమ్మం మునిసిపల్‌ కార్పోరేషన్‌ ఎన్నికల హడావుడి మొదలవుతుందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. ఈమేరకు ఇప్పటికే టీఆర్ఎస్‌ అధినాయకత్వం నుంచి స్పష్టమైన సంకేతాలు వచ్చాయి.

news18-telugu
Updated: November 20, 2020, 1:13 PM IST
Khammam: ఖమ్మం టీఆర్ఎస్ నేతల్లో ‘గ్రేటర్’ ఎన్నికల టెన్షన్.. ఎందుకంటే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఖమ్మం టీఆర్ఎస్‌లో ఇప్పుడు టెన్షన్‌ మొదలైంది. మునిసిపల్‌ కార్పోరేషన్‌ ఎన్నికలు నెత్తిమీదకు వచ్చిపడుతున్న నేపథ్యంలో ఆశావహుల హడావుడి మొదలైంది. గత ఎన్నికల్లో అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేతృత్వంలో మునిసిపల్‌ కార్పోరేషన్‌ను టీఆర్ఎస్‌ కైవసం చేసుకోగా.. అనంతర కాలంలో టీఆర్ఎస్‌లో చేరిన ప్రస్తుత మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ క్రమేణా తన పట్టును పెంచుకుంటున్నారు. గత మునిసిపల్‌ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్‌లో తుమ్మలే అన్నీ అయి టిక్కెట్లను కేటాయించారు. టీడీపీని వీడే సమయంలో తనవెంట నడచిన వారందరికీ ప్రాధాన్యం దక్కేలా చూశారు. అయితే ప్రస్తుతం టీఆర్ఎస్‌లో పరిస్థితి విచిత్రంగా ఉంది. గత మునిసిపల్‌ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్‌కు అప్పటి మంత్రి తుమ్మల బాధ్యునిగా ఉండగా.. కాంగ్రెస్‌కు పువ్వాడ అజయ్‌కుమార్‌, టీడీపీకు ప్రస్తుత ఎంపీ నామా నాగేశ్వరరావు, వైసీపీకి అప్పటి ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ప్రధాన బాధ్యులుగా ఉన్నారు.

టికెట్ల కేటాయింపు, వనరుల సమీకరణ, పంపిణీ, గెలిపించుకోడానికి ఎవరికి వారే తమ శక్తికొద్దీ శ్రమించారు. అయితే కాలక్రమంలో పరిస్థితులు పూర్తిస్థాయిలో మారిపోయాయి. అప్పటి ప్రధాన ప్రత్యర్థులంతా నేడు ఒకే గూటికి చేరారు. ఒకే పార్టీలో ఉన్నా పైకి కనిపించినంత సఖ్యత లేదని ఈ మధ్యన జరుగుతున్న పలు పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఖమ్మం కార్పోరేషన్‌ విషయంలో స్థానిక ఎమ్మెల్యే అయిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌దే పూర్తి నిర్ణయాధికారం. దీంతోనే ఆశావహుల్లో అసలు టెన్షన్‌ మొదలైంది. అప్పట్లో టీఆర్ఎస్‌ తరపున గెలిచిన వారంతా తుమ్మల అనుచరవర్గమే కావడం.. అనంతర కాలంలో అజయ్‌కుమార్‌తో కొద్దిమంది సన్నిహితంగా మెలగగలిగినా.. మరికొంత మంది మాత్రం దగ్గరా.. దూరమా అన్నట్టుగా ఉన్నారు. బీఫాంల జారీలో పూర్తి అధికారం మంత్రి అజయ్‌కుమార్‌దే కావడంతో అప్పట్లో తుమ్మల, నామా, పొంగులేటిల ద్వారా తొలిసారి కార్పోరేటర్లు అయిన వారిలో ఎక్కువ మందికి టెన్షన్‌ పట్టుకుంది. సర్వే పేరిట మెరిట్‌.. యావరేజ్‌.. పూర్‌ పెర్‌ఫార్మెన్స్‌ అంటూ ఒక్కొక్కరికి చెక్‌ పెట్టే పనిలో ఉన్నట్టు చెవులుకొరుక్కంటున్నారు.

Puvvada ajay kumar, puvvada ajay comments on corona virus, corona virus news, telangana news, పువ్వాడ అజయ్, కరోనా వైరస్, తెలంగాణ న్యూస్
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్(ఫైల్ ఫోటో)


టికెట్ల విషయంలో తమ భవిష్యత్‌ ఏమిటన్నదానిపై ఇప్పటికే కొందరు మానసికంగా సిద్ధం కూడా అయినట్టు చెబుతున్నారు. జిల్లాలోని రాజకీయ ఉద్దండులంతా ఒకే పార్టీలోనే ఉన్నా ఎక్కడో తెలీని నైరాశ్యం ఔత్సాహికుల్లో కనిపిస్తోంది. ఎవరికి వాళ్లే ఒక రకమైన అస్థిర వాతావరణాన్ని ఎదుర్కొంటున్నామని ఒక కార్పోరేటర్‌ వాపోయారు. దశాబ్దాలపాటు వామపక్షాల ఏలుబడిలో ఉన్న ఖమ్మంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం తొలిసారిగా టీఆర్ఎస్‌ పాగా వేసింది. కనిపించే స్థాయిలో అభివృద్ధి ఉన్నా అది ఓటు రూపం తీసుకుంటుందా..? నేతల మధ్య సఖ్యత సాకారమవుతుందా..? ఉద్ధండుల మధ్య పోరులో అన్ని విధాల అర్హులైన ఆశావహులకు అవకాశాలు దక్కుతాయా అన్న ప్రశ్నలు స్థానిక నాయకుల్లో ఉత్పన్నమవుతున్నాయి.

జీహెచ్‌ఎంసీతో బాటు, ఖమ్మం కార్పోరేషన్‌లోనూ ప్రధాన భూమిక పోషించాల్సిన మాజీ మంత్రి తుమ్మల, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను కలుపుకొని పోవడానికే అన్నట్టు పార్టీ అధినాయకత్వం స్పష్టమైన సంకేతాలిచ్చినా ... ఆధిపత్యపోరు మాత్రం ముదురుతూనే ఉంది. ఇది కాస్త శృతిమించి నేతల వ్యక్తిత్వ హననానికి దారితీసింది. సోషల్‌మీడియా వేదికగా రకరకాల కామెంట్లు హల్‌చల్‌ చేయడంతో మాజీ మంత్రి తుమ్మల ఆవేదనతో సీపీకి ఫిర్యాదు చేశారు. ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్న వారంతా టీఆర్ఎస్‌కు చెందిన వారే కావడంంతో.. వీరంతా ఎవరి దన్నుతో ఒక సీనియర్‌ నేత, మాజీ మంత్రిని టార్గెట్‌ చేస్తారన్న చర్చ నడుస్తోంది. మరి ఇది ఏవైపునకు దారితీస్తుందోనన్న భయం ఆశావహుల్లో వ్యక్తమవుతోంది. తాము నమ్ముకున్న నేతలంతా ఒక్కతాటిపై ఉంటే మెరిట్‌ ప్రాతిపదికన టికెట్లు దక్కే అవకాశం ఉంటుంది. ఇలా వైరుధ్యాలతో దూరం పెరిగితే అది తమ రాజకీయ అవకాశాలపై ప్రభావం చూపుతాయన్న భయం వారిలో వ్యక్తమవుతోంది.

Khammam politics, Khammam municipal corporation elections, tummala nageshwara rao, puvvada ajay kumar, ponguleti sudhakar reddy, ghmc vs Khammam, telangana news, ఖమ్మం రాజకీయాలు, తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, పువ్వాడ అజయ్ కుమార్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, జీహెచ్ఎంసీ వర్సెస్ ఖమ్మం, తెలంగాణ న్యూస్
తుమ్మల నాగేశ్వరరావు, నామా నాగేశ్వరరావు (ఫైల్ ఫోటో)


జీహెచ్‌ఎంసీ ఎన్నికలు పూర్తవుతూనే ఖమ్మం మునిసిపల్‌ కార్పోరేషన్‌ ఎన్నికల హడావుడి మొదలవుతుందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. ఈమేరకు ఇప్పటికే టీఆర్ఎస్‌ అధినాయకత్వం నుంచి స్పష్టమైన సంకేతాలందాయి. వచ్చే ఎన్నికల్లో జనం ముందుకు పోయి చెప్పుకోడానికి కొన్నియినా అభివృద్ధి కార్యక్రమాలు కనిపించాలన్న తాపత్రయం నేతల్లో కనిపిస్తోంది. దీనికోసం దశాబ్దాలుగా ఖమ్మం ప్రజలు ఎదురుచూస్తున్న ధంసలాపురం రైల్‌ ఓవర్‌ బ్రిడ్జి పూర్తయింది. యువతకు ఎక్కడికక్కడే ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో నిర్మిస్తున్న ఐటీ హబ్‌ కూడా దాదాపు పూర్తి కావొచ్చింది. దీంతోబాటుగా పట్టణంలో పలు ప్రధాన రోడ్ల విస్తరణ, డివైడర్ల నిర్మాణం, సెంట్రల్‌ లైటింగ్ ఏర్పాటు‌, చెరువుల ఆధునికీకరణ, లకారం బండింగ్‌ సుందరీకరణ, ఖానాపురం ట్యాంక్‌ అభివృద్ధి చెప్పుకోదగిన స్థాయిలో పూర్తయినట్టే. ఇక గోళ్లపాడు ఛానెల్‌ అభివృద్ధి కోసం మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ నిరంతరం శ్రమిస్తున్నారు.

మిషన్‌ భగీరధ పథకం కింద ఇప్పటికే పట్టణంలో పలు చోట్ల ట్యాంకులను నిర్మించారు. ఈ పథకం వందశాతం పూర్తయితే అందరికీ నల్లా కనెక్షన్‌ వచ్చేసినట్టే. ఇక ఖమ్మం పట్టణ జనాభా పెరిగినా, వాహనాలు పెరిగినా పెరగని రోడ్ల విస్తరణ పై జనంలో తీవ్రమైన అసంతృప్తిని అర్థం చేసుకున్న నేతలు ఇప్పటికే పలు ప్రధాన రహదార్లను విస్తరించే ప్రణాళికల్లో పడ్డారు. ఇప్పటికే ముస్తఫానగర్‌- ధంసలాపురం, ఎన్టీఆర్‌ సర్కిల్‌-రఘునాథపాలెం, ఇల్లెందు క్రాస్‌- శ్రీశ్రీ సర్కిల్‌, శ్రీనివాసనగర్‌- ప్రకాష్‌నగర్‌ వరకు విస్తరణ పనులు పూర్తవగా.. ముస్తఫానగర్‌- చర్చికాంపౌండ్‌, ముస్తఫానగర్‌- జడ్పీసెంటర్‌, మయూరినగర్‌- రాపర్తినగర్‌ బోర్డు, పీఎస్‌ఆర్‌ రోడ్డు, ఎన్నెస్టీరోడ్‌, స్టేషన్‌రోడ్‌ తదితర ముఖ్యమైన రహదారులు వివిధ దశల్లో ఉన్నాయి.

నేతల మధ్య ఆధిపత్యపోరు ఎలా ఉన్నా గత తొలివిడత టీఆర్ఎస్‌ ప్రభుత్వంలో జిల్లా నుంచి మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు సంకల్పించిన దాదాపు అన్ని పనులను వేగంగా కొనసాగిస్తూనే, మరికొన్ని ప్రాధాన్యాలను ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న పువ్వాడ అజయ్‌కుమార్‌ నెత్తికెత్తుకున్నారు. వీటిలో పూర్తియిన ధంసలాపురం రైల్‌ఓవర్‌ బ్రిడ్జి, ఐటీ హబ్, సీపీ ఆఫీస్‌‌లతో సహా పలు రహదారుల్లో పూర్తయిన సెంట్రల్‌ లైటింగ్‌ను డిసెంబరు రెండో తేదీన మంత్రులు కేటీఆర్‌, వేముల ప్రశాంతరెడ్డి, మహమూద్‌అలీల చేతుల మీదుగా ప్రారంభించాలని ఇప్పటికే నిర్ణయించారు. ఏది ఎలాఉన్నా జీహెచ్‌ఎంసీ అనంతరం దాదాపు వెంటనే జరిగే ఖమ్మం మునిసిపల్‌ కార్పోరేషన్‌ ఎన్నికల విషయంలో స్థానిక నాయకుల్లో మాత్రం తమ భవిష్యత్‌పై బెంగ వెంటాడుతూనే ఉంది.
Published by: Kishore Akkaladevi
First published: November 20, 2020, 1:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading