Home /News /politics /

KHAMMAM TRS GROUP POLITICS TRIGGERED AFTER PONGULETI SRINIVAS REDDY EMOTIONAL SPEECH IN FRONT OF MINISTER PUVVADA AJAY MKS KMM

పదవి లేదని పడుకున్నానా? పరువు తీయడం తగునా? -టీఆర్ఎస్ వేదికపై పొంగులేటి సంచలన వ్యాఖ్యలు -మంత్రి పువ్వాడకు పరోక్ష హెచ్చరిక

పొంగులేటి శ్రీనివాస రెడ్డి

పొంగులేటి శ్రీనివాస రెడ్డి

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యంత ఆదరణ కలిగిన నేతగా పాపులారిటీ ఉన్నప్పటికీ, కొనసాగేది అధికార పార్టీలోనే అయినప్పటికీ పొంగులేటి శ్రీనివాస రెడ్డికి ప్రభుత్వపరంగా ఎలాంటి పదవి లేకపోవడం తొలి నుంచీ చర్చనీయాంశంగా ఉంటూ వస్తోంది. పొంగులేటి పార్టీ మారతారని చాలా సార్లు ఉధృతంగా ప్రచారం జరిగినా ఆయన మాత్రం గులాబీ గట్టుదాటకుండా స్థిరంగా ఉండిపోయారు. అయితే, పార్టీనే నమ్ముకుని ఉన్న తనలాంటి వాళ్లను కనీసం పరువుగానైనా చూడంలేదన్న వ్యధను ఆయన బాహాటంగా వెళ్లగక్కారు. దీంతో జిల్లా టీఆర్ఎస్ లో గ్రూపుల గొడవలు మళ్లీ తెరపైకొచ్చినట్లయింది. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమక్షంలోనే పొంగులేటి పరోక్షంగా హెచ్చరికలివ్వడం కాక రేపుతున్నది..

ఇంకా చదవండి ...
  (G.Srinivasa Reddy, News 18, Khammam)
  ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో తాజాగా నిర్వహించిన పార్టీ మీటింగ్ లో మాట్లాడుతూ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. పదవి ఉన్నోళ్లకే తప్ప పార్టీనే నమ్ముకుని ఉంటోన్న తనలాంటి వాళ్లకు సరైన గౌరవం దక్కడం లేదన్న విషయాన్ని సున్నితంగా విన్నవించుకున్న ఆయన.. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2018మాదిగా జిల్లాలో టీఆర్ఎస్ ఒకే ఒక్క సీటుకు పరిమితమయ్యే ప్రమాదముందనీ హెచ్చరించారు. గత ఎన్నికల్లో ఖమ్మం జిల్లా నుంచి టీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన ఏకైక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కి మంత్రి పదవి లభించిందని, కష్టపడే వారిని గౌరవించుకోకపోతే రాబోయే ఎన్నికల్లో మళ్లీ పాత ఫలితాలు తప్పవేమో అని పొంగులేటి వ్యాఖ్యానించారు.

  పదవి లేదని పడుకున్నానా?
  ‘పదవి ఉన్నా.. లేకున్నా.. నేను ప్రజల్లో ఉంటా. పదవి లేదని నేనేమీ బెడ్‌ షీట్‌ కప్పుకుని ఇంట్లో పడుకోను.. జనంలోనే ఉంటా.. ఎవరికి ఇష్టమున్నా లేకున్నా.. నేను ప్రజల్లోనే తిరుగుతుంటా.. నేను పార్టీ మనిషిని.. ఈరోజు పదవి లేకపోవచ్చు.. నేను పార్టీని.. అధినేతను నమ్ముకున్నా.. మీరూ అంతే.. ఎవరో మీ పదవులు తీసేశారని దిగులుపడొద్దు.. క్షణికావేశానికి గురికావొద్దు.. ఆలోచనారహిత నిర్ణయాలు తీసుకోవద్దు.. నన్నే మోడల్‌గా తీసుకోండి.. పార్టీని బలోపేతం చేసే దిశగా మనం ముందుకుపోదాం’ అని సభను ఉద్దేశించి మాట్లాడుతూ పొంగులేటి ఎమోషనల్ అయ్యారు.

  పని చేసే వాళ్లను ఇబ్బంది పెట్టొద్దు..
  పార్టీ కార్యక్రమాలకు ఆయనొస్తే పోవద్దు.. ఈయనొస్తే పోవద్దంటూ కొందరు నేతలు కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్నారని, ఇది సరైన పద్ధతి కాదని, ఎవరొచ్చినా పార్టీకోణంలోనే చూడటం నేర్చుకోవాలని పొంగులేటి హితవు పలికారు. ‘మనందంర టీఆర్ఎస్ కోసమే పనిచేస్తున్నామని గుర్తుంచుకోవాలి. పని చేసేవాళ్లను ఇబ్బంది పెట్టొద్దు, మన పనితీరును మెరుగుపర్చుకోకుంటే పాత ఫలితాలు చవిచూడాల్సి వస్తుందేమో’అని మాజీ ఎంపీ చురకలేశారు. ఈ మాటలు వేదిక మీదున్న మంత్రి పువ్వాడ, ఎంపీ నామా, జెడ్పీ చైర్మన్ లింగాల కామల్ రాజ్ సహా ముఖ్యనేతలకూ వర్తిస్తాయని కూడా పొంగులేటి నొక్కి చెప్పారు.

  పొంగులేటికి పొగ పెట్టిందెవరు?
  మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి దాదాపు ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం నిత్యం పర్యటిస్తూ ప్రజలకు టచ్‌లో ఉండడాన్ని ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే జీర్ణించుకోవడం లేదని ఆయన అభిమానులు ఆరోపిస్తున్నారు. దీంతో ఆయన పర్యటనలకు వెళ్లొద్దని కొన్ని చోట్ల మండల, గ్రామ స్థాయి నేతలకు హుకుం జారీ చేస్తున్నారని పొంగులేటి బరస్ట్‌ అయ్యారు. జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి కమిటీల ఏర్పాటు అనంతరం ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పొంగులేటి ఎమోషన్‌కు గురయ్యారు. తన పర్యటనల్లో పాల్గొనకుండా కొందరు నేతలు కిందిస్థాయి నాతకత్వంపై వత్తిడి చేస్తున్నారని ఆరోపించారు.

  మంత్రి సముదాయింపు..
  దీనిపై వేదిక నుంచే స్పందించిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని నేతలకు హితవు పలికారు. పార్టీలో వర్గపోరుకు అద్దం పడుతున్న మాజీ ఎంపీ శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యల్లో కొంత ఆవేదన కనిపిస్తున్నా.. సభలో వాతావరణాన్ని సముదాయిస్తున్నట్లుగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గుంభనంగా వ్యవహరించారు. తామంతా ఒక్కటేనని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు గులాబీ నేతలు. మేడిపండు చందంగా ఉన్న ఖమ్మం జిల్లా పార్టీలో ఈ లుకలుకలు ఎప్పుడూ వినిపిస్తూనే ఉన్నా.. ఎప్పటికప్పుడు సర్దుబాట్లు చేసుకుంటూనే.. తమ గ్రూపులను మాత్రం ఒక కంట కనిపెట్టుకుంటూ ఉనికిని చాటుకుంటున్నట్టు వ్యవహారం కనిపిస్తోంది.

  తుమ్మల పరిస్థితీ అంతేనా?
  మాజీ మంత్రి తుమ్మల.. మాజీ ఎంపీ పొంగులేటి.. మంత్రి పువ్వాడ అజయ్‌.. ఎంపీ నామా.. మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు.. ఇలా ఉమ్మడి ఖమ్మం జిల్లా తెరాసలో సీనియర్‌ నేతలు ఎక్కువ కావడం.. ప్రస్తుతం వారిలో అధికులు ఖాళీగా ఉండడంతో ఎప్పటికప్పుడు ఆధిపత్య పోరు అవకాశం వచ్చినపుడల్లా బయటపడుతునే ఉంది. ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో తాజాలు, మాజీల మధ్య నువ్వా నేనా అన్నట్టు పోరాటం సాగుతునే ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు ప్రతి గ్రామంలో తమకంటూ ప్రత్యేక వర్గం ఉన్న తుమ్మల, పొంగులేటి, జలగం కుటుంబాల మధ్య ప్రస్తుతం ప్రత్యక్ష పోరాటం లేకున్నా.. వీరందరూ విచిత్రం వేరే నేతలతో చికాకులు ఎదొర్కొంటున్నారు. దాదాపు నాలుగు దశబ్దాలుగా ఉమ్మడి జిల్లాలో తన ప్రాబల్యాన్ని చాటుకుంటున్న తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుతం పాలేరులో మరోసారి పాగా వేయడానికి రోజువారీ కార్యక్రమాలతో జనానికి టచ్‌లో ఉంటున్నారు. ఇక్కడి ఎంఎల్‌ఏ కందాళ ఉపేందర్‌రెడ్డితో ఈయనకు అసలు పొసగడం లేదు సరికదా.. నిత్యం పోరు సాగుతోంది.

  అన్ని చోట్లా అదే తీరు..
  పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ తన వర్గం, అభిమానులకు అందుబాటులో ఉంటున్నారు. మాజీ ఎమ్‌ఎల్‌నే జలగం వెంకటరావు సైతం కొత్తగూడెంపై నజర్ పెట్టి అప్‌డేట్‌ ఇస్యూస్‌ను ఫాలో చేస్తున్నారు. దీంతో ప్రస్తుత ఎంఎల్‌ఏ వనమా వెంకటేశ్వరరావుకు కంటిమీద కునుకులేకుండా పోతోంది. వీరికితోడు వైరాలో ఎంఎల్‌ఏ రాములు నాయక్ వర్సెస్‌ మాజీ ఎంఎల్‌ఏ మదన్‌లాల్‌, ‌ఇల్లెందులో ఎంఎల్‌ఏ బాణోత్‌ హరిప్రియకు, జడ్పీ ఛైర్మన్‌ కోరం కనకయ్యకు నిత్యం పోరాటమే. ఇలా ఖమ్మం జిల్లా తెరాసలో నిత్యం రగడ చోటుచేసుకుంటునే ఉంది.. తమకు ప్రాధాన్యం దక్కడం లేదని కొందరు.. అదేం లేదు అందరూ ఒక్కటేనని మరొకరు.. తమ బ్రాండ్‌ ఇంకా ఉందని ఒకరు.. బ్రాండ్లతో పనిలేదని మరో నాయకుడు ఇలా ఒకరి వ్యాఖ్యలపై మరొకరు కౌంటర్‌ చేసుకుంటూ పార్టీ వేదికల మీదే మాటల యుద్ధానికి దిగడం పార్టీలో అంతర్గీతంగా సాగుతున్న పోరుకు నిదర్శనంగా నిలుస్తోంది.
  Published by:Madhu Kota
  First published:

  Tags: Khammam, Ponguleti srinivas reddy, Puvvada Ajay Kumar, Trs

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు