KHAMMAM NALGONDA WARANGAL MLC ELECTIONS ROTATION TO ONLY ONE POINT IN KHAMMAM BA KMM
Khammam: ఖమ్మం పొలిటిక్స్... తిప్పి తిప్పి మళ్లీ అక్కడికే వస్తున్నాయ్
ప్రతీకాత్మక చిత్రం
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఖమ్మంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. రాష్ట్రాభివృద్ధి.. యువతకు ఉపాధి.. ఉద్యోగుల సంక్షేమం లాంటి అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఓ పక్క విస్త్రత స్థాయిలో చర్చ నడుస్తుండగా.. ఖమ్మంలో మాత్రం దీనికి భిన్నంగా స్థానిక అంశాల పై వాడివేడి వాదనలు రగులుతున్నాయి.
(జి.శ్రీనివాసరెడ్డి, ఖమ్మం కరస్పాండెంట్, న్యూస్ 18)
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఖమ్మంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. రాష్ట్రాభివృద్ధి.. యువతకు ఉపాధి.. ఉద్యోగుల సంక్షేమం లాంటి అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఓ పక్క విస్త్రత స్థాయిలో చర్చ నడుస్తుండగా.. ఖమ్మంలో మాత్రం దీనికి భిన్నంగా స్థానిక అంశాల పై ఇటు అధికార.. అటు ప్రతిపక్ష పార్టీల మధ్య వాడివేడి వాదనలు రగులుతున్నాయి. ఖమ్మం నగరం నడిబొడ్డున ఉన్న కోట్ల విలువైన పాత బస్టాండు స్థలం కేంద్రంగా ఇప్పుడు రాజకీయం ఊపందుకుంది. 'పనిలేని.. పస లేని.. పాత పార్టీలు.. పాత అజెండాలతో.. పాత పంధాలో పోరాటం చేస్తున్నాయంటూ.. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ విపక్షాల ఆందోళనలను కొట్టి పారేస్తుండగా.. 'మీ నాన్న ఇప్పటికీ పాత పార్టీలోనే ఉన్నారు.. మీరూ గతంలో పాత పార్టీ నుంచే ఎమ్మెల్యేగా గెలిచారంటూ.. విపక్షాలు సైతం తమదైన శైలిలో విరుచుకుపడుతున్నాయి. మొత్తంమీద ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ లక్ష్యంగా సీపీఎం, కాంగ్రెస్‌లాంటి విపక్షాలన్నీ ఏకమై పాత బస్టాండు కేంద్రంగా ఉద్యమబాట పట్టాయి. దీనికి తోడు అన్నట్టు మాజీ మంత్రి, తెరాస రాష్ట్ర నాయకుడు తుమ్మల నాగేశ్వరావు సైతం పాత బస్టాండు ఉంటే పోయేదేముందంటూనే.. తాను ప్రస్తుతం మంత్రిగా లేనని.. ఈ విషయంలో మంత్రి అజయ్‌కుమార్ దగ్గరే తేల్చుకోవాలని తేల్చిచెప్పారు. దీనికితోడు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఖమ్మం వచ్చిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తంకుమార్‌రెడ్డి సైతం పాత బస్టాండు ఉండాల్సిందేనంటూ ఆందోళనకు మద్దతు పలికారు.. బస్టాండును సందర్శించారు. దీంతో ఈ విషయం మరింత చర్చనీయాంశంగా మారింది.
అసలేంటి వివాదం..
ఖమ్మం నగరంలో ప్రస్తుతం ఉన్న బస్టాండును దశాబ్దాల క్రితం నిర్మించారు. అప్పటి నుంచి జిల్లా నలుదిక్కులకు ఇక్కడి నుంచే బస్సులను ఆపరేట్ చేస్తున్నారు. లోకల్‌గా తిరిగే బస్సులకు తోడు.. హైదరాబాద్ వెళ్లే బస్సులకు.. రాజమండ్రి సహా ఇంకా ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర ప్రాంతాలకు తిరిగే బస్సులకు ఇదొక హాల్టింగ్ పాయింట్. రాను రాను జనాభా పెరిగిపోవడం.. కార్లు, ఆటోలు వేల సంఖ్యలో పెరగడం వల్ల ట్రాఫిక్ రద్దీ విపరీతంగా తయారైంది. నిత్యం ఈ ప్రాంతంలో బస్సులు బస్టాండు లోపలకు వెళ్లాలన్నా.. బయటకు రావాలన్నా.. ఎంతో ప్రయాస పడాల్సిన పరిస్థితి ఉంది. దీన్ని నివారించడానికి గానూ కొత్త బస్టాండు నిర్మాణం చేపట్టారు. సుమారు పదికోట్లకు పైగా నిధులతో ఏడెకరాలకు పైగా విస్తీర్ణంలో అధునాతనంగా నిర్మిస్తున్న ఈ బస్టాండు హైటెక్కు సౌకర్యాలతో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. వాస్తవానికి మార్చి 1నుంచి బస్సులను ఇక్కడి నుంచే ఆపరేట్ చేయాలన్న ప్రయత్నం జరిగింది. దీనికోసం ఓ ఫ్లెక్సీని సైతం ఏర్పాటు చేశారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల లాంటి కొన్ని సాంకేతిక కారణాలతో కొద్ది రోజుల పాటు ఈ షిఫ్టింగ్ ప్రయత్నాన్ని వాయిదా వేసుకున్నారు.
ఖమ్మం బస్టాండ్
ఈ క్రమంలో మరి పాత బస్టాండు సంగతేంటంటూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. కొత్తగా నిర్మిస్తున్న బస్టాండును వాడుకుంటూనే.. సిటీ బస్సుల కోసం.. ఇంకా పల్లెవెలుగు బస్సులను ఇక్కడి నుంచే నడపాలన్న డిమాండ్‌ను తెరమీదకు తీసుకొచ్చాయి. దీనిపై గతంలో పలు సందర్భాలలో స్పందించిన జిల్లాకే చెందిన రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మొత్తం బస్సులన్నీ కొత్త బస్టాండు కేంద్రంగానే ఆపరేట్ చేస్తామని.. పాత బస్టాండును ఇక భవిష్యత్‌లో వాడబోమంటూ ప్రకటించారు. దీనిపై విపక్షాలు పలు రకాల ఆరోపణలు చేస్తూ ఆందోళన బాట పట్టాయి. కోట్ల విలువైన స్థలంపై అధికార పక్షం నేతలు కన్నేశారని ఆరోపిస్తూ రోజుకోరీతిగా ఉద్యమిస్తున్నారు. దీనికోసం పాతబస్టాండ్ పరిరక్షణ కమిటీ పేరిట ఒక పోరాట సమితిని సైతం ఏర్పాటు చేశారు. ఈ కమిటీ తరపున అధికార, ప్రతిపక్షంలోని ముఖ్యనేతలను కలుస్తూ వారి మద్దతును కూడగడుతున్నారు. మొత్తంమీద గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ పాతబస్టాండ్ అంశం అధికార పక్షానికి కాస్త తలనొప్పిగానే మారింది.
నేతలతో మాట్లాడుతున్న తుమ్మల నాగేశ్వర రావు
ఆ బాధ్యత నాదేనంటున్న మంత్రి..
'నో డౌట్.. పాత బస్టాండ్ ప్లేస్ కోట్ల విలువైందే. అక్కడ ఏంచేయాలి.. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలన్న దానిపై ప్రభుత్వ స్థాయిలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటాం. ఆ స్థలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాక్రాంతం కానీయం. దీనికి సంబంధించిన పూర్తి బాధ్యత నాదేనంటూ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రకటించారు. వాస్తవానికి ఈ స్థలాన్ని డెవలప్మెంట్ పేరిట అధికార పక్షం నేతలు చేజిక్కించుకోవాలని చూస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనిని పూర్తిగా ఖండించిన మంత్రి పువ్వాడ స్థల పరిరక్షన బాధ్యత నాదేనంటూ బహిరంగంగానే ప్రకటించారు. అపోహలతో కూడిన అజెండాలతో ప్రజలను నమ్మించలేరని విపక్షాలపై మండిపడ్డారు. విపక్షాలు డిమాండ్ చేస్తున్నట్టు ఇక్కడి నుంచి సిటీ బస్సులను, పల్లెవెలుగు బస్సులను ఆపరేట్ చేయలేమని తేల్చిచెబుతున్నారు. ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆర్టీసీని తన చేజేతులా మరిన్ని నష్టాల్లోకి నెట్టలేనని చెబుతున్నారు. ఇక్కడొక బస్టాండు నిర్వహించాలంటే దానికో వ్యవస్థ ఉండాలి. ఖర్చుతో కూడుకున్న పని.. సంస్థకు వయబుల్ కాని నిర్ణయాలు తీసుకుని ఆర్టీసిని ఇంకా అప్పుల పాలు చేయలేనని మంత్రి పువ్వాడ స్పష్టం చేస్తున్నారు. మరోవైపు విపక్షాలు మాత్రం ఈ అంశాన్ని రోజురోజుకూ పెద్దది చేసే ఏ అవకాశాన్ని విడిచిపెట్టడం లేదు. గ్రాడ్యుయేట్ ఎన్నికలలో దీన్ని ఒక ప్రధాన అంశంగా ప్రచారం చేసే పనిలో నిమగ్నమయ్యాయి.