Home /News /politics /

KHAMMAM MUNICIPAL ELECTIONS TRS AND CONGRESS PUT ALL EFFORTS TO WIN SU KMM

Khammam Municipal Elections: ఖమ్మం మున్సిపోల్స్‌ హోరు.. పార్టీల వారీగా పొత్తుల వివరాలు ఇవే..

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్

ఖమ్మంలో మున్సిపోల్స్‌ హోరెత్తిస్తున్నాయి.. గత పదిరోజులుగా పార్టీలన్నీ ప్రచార పర్వంలో దూకుడు ప్రదర్శించాయి.

  ఖమ్మంలో మున్సిపోల్స్‌ హోరెత్తిస్తున్నాయి.. గత పదిరోజులుగా పార్టీలన్నీ ప్రచార పర్వంలో దూకుడు ప్రదర్శిస్తుండగా.. మంగళవారం సాయంత్రంతో ప్రచారం ముగిసింది. ఏప్రిల్‌ 30వ తేదీన పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కర్ణన్‌, రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరిస్తున్న మున్సిపల్‌ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి పర్యవేక్షిస్తున్నారు. ఖమ్మం ఖిల్లాపై వరుసగా మరోసారి జెండా ఎగురవేయాలన్న కసి, పట్టుదల టీఆర్‌ఎస్‌లో కనిపిస్తున్నాయి. వందశాతం ఫలితాన్ని రాబట్టాలన్న ప్రయత్నంలో టీఆర్‌ఎస్‌ నేతలు ఉన్నప్పటికీ, అది అంత సులభమయ్యే పనికాదని క్షేత్రస్థాయి వాస్తవాలు చెబుతున్నాయి. అరవైకి అరవై సీట్లు గెలవాలన్న లక్ష్యంతో ఉన్న టీఆర్‌ఎస్‌ దీనికోసం కామ్రేడ్లతో పొత్తుకు సిద్ధమైంది. అయితే సీపీఐతో దోస్తీ కుదిరినా.. సీపీఎంతో మాత్రం పొత్తు పొసగలేదు. సీపీఎం రాష్ట్ర, జిల్లా కమిటీలు పొత్తుకు అనుకూలంగానే ఉన్నప్పటికీ, నగర కమిటీ ఈ విషయంలో సానుకూలత చూపలేదు. దీంతో చివరి వరకూ వేచి చూసిన టీఆర్‌ఎస్‌, తనతో కలసి వచ్చిన సీపీఐకి మూడు డివిజన్లను ఇచ్చి మిగిలిన 57 చోట్ల తానే సొంతంగా బరిలోకి దిగింది. ఇక కాంగ్రెస్‌, సీపీఎంలు చివరి నిమిషంలో అవగాహన కుదుర్చుకుని పోటీకి సై అన్నాయి. దీంతో తమ బలం పెరిగినట్టేనని ఇరు పక్షాలు భావిస్తున్నాయి. ఇక బీజేపీ, జనసేన దోస్తీ కట్టగా.. టీడీపీ మాత్రం పరిమిత సీట్లలో ఒంటరి పోరుకు సిద్ధమైంది.

  ఊపుమీదున్న టీఆర్‌ఎస్‌..
  రెండోసారి ఖమ్మం ఖిల్లాపై జెండా ఎగరేయాలన్న పట్టుదలతో ఉన్న టీఆర్‌ఎస్‌ ప్రచారంలో సైతం ఆ ఊపును ప్రదర్శిస్తోంది. టీఆర్‌ఎస్‌లో డివిజన్ల వారీగా టికెట్ల పంపిణీలో అన్నీ తానై వ్యవహరించిన రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రచారంలోనూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఒక దశలో గెలుపోటములకు తానే బాధ్యుడిని అని ప్రకటించినా.. తెరాస అధినేత మాత్రం సీనియర్లను సైతం సమన్వయం చేసుకోవాలన్న సూచనతో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ ఛైర్మన్‌ లింగాల కమల్‌రాజు సహా జిల్లాలోని ఇతర ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్ రెడ్డి , సండ్ర వెంకటవీరయ్య, మాజీ మంత్రి, ప్రస్తుత కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఇంకా మాజీ ఎమ్మెల్యేలు మదన్‌లాల్‌, బాణోతు చంద్రావతి.. ఇలా టీఆర్‌ఎస్‌ నాయకత్వం అంతా ఖమ్మంలోనే తిష్టవేశారు. కోవిడ్‌ తీవ్రతను సైతం లెక్కచేయకుండా పార్టీని విజయతీరాలకు చేర్చాలన్న పట్టుదలతో ఎడతెరిపి లేకుండా ర్యాలీలు, ఇంటింటి ప్రచారంలో మునిగిపోయారు. ఉదయం నుంచే ప్రచారం ప్రారంభిస్తున్న నేతలు, పొద్దస్తమానం నగరంలో ప్రచారాన్ని ఉధృతంగా సాగిస్తున్నారు.  మంత్రి అజయ్‌కుమార్‌ సతీమణి.. కుమారుడు సైతం..
  మరోవైపు రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సతీమణి వసంతలక్ష్మి, తనయుడు నయన్‌రాజ్‌లు సైతం ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఇది టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. గత ఐదేళ్లుగా మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఆధ్వర్యంలోనూ, రాష్ట్రంలోని కేసీఆర్‌ ప్రభుత్వం ఇచ్చిన నిధులు.. చేపట్టిన అభివృద్ధి పనులను ప్రస్తావిస్తూ.. ఈ స్పీడును కొనసాగించాలంటే టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. ప్రతి డివిజన్‌లోనూ అభ్యర్థిని పరిచయం చేస్తూనే.. మంత్రి అజయ్‌కుమార్‌ను చూసి ఓటెయ్యండంటూ.. టీఆర్‌ఎస్‌ను బలపర్చండంటూ ప్రచారపర్వాన్ని ఊపెక్కిస్తున్నారు.

  ప్రచారంలో మంత్రి పువ్వాజ అజయ్ కుమారుడు నయన్


  ఇక వీరికి తోడు మాజీ మంత్రి తుమ్మల, మాజీ ఎంపీ పొంగులేటి తోడవడంతో ఖమ్మం ఖిల్లాపై టీఆర్‌ఎస్‌ జెండా మరోసారి ఎగరడం ఖాయమేనని ఆ పార్టీ శ్రేణులు సంబరపడుతున్నాయి. పార్టీలో ఎన్ని గ్రూపులు ఉన్నప్పటికీ అధినేత మనసెరిగి ప్రవర్తించాలన్న విషయంలో ఎవరూ రెండో ఆలోచన చేయడంలేదు. తొలుత ప్రచారానికి మంత్రి కేటీఆర్‌ వస్తారని భావించినప్పటికీ.. కోవిడ్‌ పాజిటివ్‌ మూలంగా కేటీఆర్‌ రాలేకపోయారు. దీంతో ప్రచారంలో ఎలాంటి లోటు రాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ విజయాన్ని ఖాయం చేసే దిశగా టీఆర్‌ఎస్‌లోని గ్రూపులన్నీఏకతాటిపైకి వచ్చేశాయి. దీంతో ఖమ్మం నగరంలోని ఏ వీధికి వెళ్లినా.. ఏడివిజన్‌లోకి తొంగిచూసినా టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేతలే కనిపిస్తున్న పరిస్థితి.

  ఇంటింటి ప్రచారంలో మంత్రి పువ్వాజ అజయ్ సతీమణి వసంతలక్ష్మి


  ప్రతిపక్షాలదీ దూకుడే..
  ఓవైపు టీఆర్‌ఎస్‌ దూకుడు ఇలా ఉండగా.. ప్రతిపక్షాలైన కాంగ్రెస్‌ తరపున సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్వయంగా డివిజన్లలో ప్రచారం చేస్తున్నారు. మంత్రి పువ్వాడను నేరుగా టార్గెట్‌ చేస్తూ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. కాంగ్రెస్‌కు జతకట్టిన సీపీఎం సైతం సోషల్‌మీడియా వేదికగా మంత్రి అజయ్‌కుమార్‌ను, టీఆర్‌ఎస్‌ను లక్ష్యంగా చేసుకుని స్థానిక సమస్యలపై గురిపెడుతోంది. ఇక బీజేపీ తరపున ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వచ్చి ర్యాలీలు, ఇంటింటా ప్రచారంలో పాల్గొన్నారు. భాజపా సీనియర్‌ నేత దగ్గుపాటి పురంధేశ్వరి సైతం ప్రచారంలో పాల్గొన్నారు. ఖమ్మం పట్టణంలో గణనీయంగా ఉన్న ఓటు బ్యాంకును ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకోవాలన్న పట్టుదలతో కాంగ్రెస్‌ నేతలు శ్రమిస్తుండగా.. ఎలాగైనా ఖాతా తెరవాలన్న కసితో బీజేపీ పనిచేస్తోంది.

  అయితే ప్రచార పర్వం ముగియకముందే ఒక డివిజన్‌ తెరాస పరం అయింది. 10వ డివిజన్‌లో తెరాస నుంచి చావా మాధురిపై పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్ధి పోటీ నుంచి తప్పుకోవడంతో ఆమె ఆ డివిజన్‌ ఏకగ్రీవమైంది. ఇక సోమవారం రాత్రి 18వ డివిజన్‌లో కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్న అయినాల పద్మ మంత్రి అజయ్‌కుమార్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో ఇక్కడ టీఆర్‌ఎస్‌ నుంచి పోటీలో ఉన్న మందడపు లక్ష్మిమనోహర్ గెలుపు లాంఛనంగా మారింది. ఇలా ఎన్నికలకు ముందే రెండు డివిజన్లు తెరాస ఖాతాలో చేరిపోయాయి. అయితే తమ అభ్యర్థులను అధికార పార్టీ నేతలు భయాందోళనకు గురిచేస్తున్నారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తంమీద ఈనెల 30న జరగనున్న పోలింగ్‌ నేపధ్యంలో మంగళవారం సాయంత్రంతో ప్రచార గడువు ముగిసింది.

  (జి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం న్యూస్ 18 కరస్పాండెంట్)
  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Bhatti Vikramarka, Congress, Khammam muncipal elections, Puvvada Ajay Kumar, Trs

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు