ఖమ్మం బస్టాండ్ సెంటర్లో రేణుకాచౌదరి ధర్నాకు దిగారు. తన మహిళ అనుచరులు ఉంటున్న గ్రాండ్ గాయత్రి హోటల్ గదుల తాళాలు తెరచి ఎవరూ లేని సమయంలో పోలీసులు తనిఖీలు చేశారంటూ ఆమె ఆరోపించారు. పోలీసులు మహిళల చట్టాల ఉల్లంఘనకు పాల్పడ్డారని నిరసిస్తూ రేణుకా చౌదరి ఖమ్మం కాంగ్రెస్ కార్యాలయం ఉన్న బస్ స్టాండ్ సెంటర్ లో బైఠాయించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, నియంతృత్వం, అరాచకాన్ని ఆపాలని కోరుతూ ధర్నా చేపట్టారు. తమ పార్టీ నేతలు ఇళ్లల్లో లేని సమయంలో సోదాలు నిర్వహిస్తున్నారని రేణుకా చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ, కేసీఆర్ కుట్రలకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. మీరు భయపడితే భయపడటానికి మేం టీఆర్ఎస్ వాళ్లం కాదన్నారు. చంపితే చంపండి, అంతేగానీ నీతిమాలిన రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు.
ఖమ్మంలో కాంగ్రెస్ తరఫున లోక్ సభ అభ్యర్థిగా రేణుక బరిలో ఉండగా.. టీఆర్ఎస్ తరఫున నామా నాగేశ్వర్రావు పోటీ చేస్తున్నారు. నామా నాగేశ్వరరావు ఇటీవలే టీడీపీని వీడి టీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామా టీడీపీ తరఫున ఖమ్మం అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. తొలిసారి ఖమ్మం ఎంపీ సీటును గెలవడం కోసం టీఆర్ఎస్ పార్టీ గట్టిగా ప్రయత్నిస్తోంది. మరోవైపు రేణుకా కూడా టీఆర్ఎస్ను ఓడించేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఖమ్మంలో ఆమె జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.