విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు ఝలక్ ఇచ్చారు. తనను లోక్ సభలో పార్టీ విప్‌గా నియమించిన చంద్రబాబుకు ధన్యావాదాలు తెలిపిన కేశినేని నాని... తాను మాత్రం ఆ పదవిని స్వీకరించేందుకు సిద్ధంగా లేనని అన్నారు. పార్టీలో అనేకమంది సమర్థులు ఉన్నారని... వారికి ఈ పదవి ఇస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అంత పెద్ద పదవికి తాను అర్హుడిని కానంటూ ఒకరకంగా పార్టీ అధిష్టానంపైనే సెటైర్ వేశారు. లోక్ సభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌తో పాటు పార్టీ విప్‌గా ఉండాలని టీడీపీ సూచించింది. అయితే ఇందుకు కేశినేని నాని ససేమిరా అన్నారు. విప్ పదవి కంటే ప్రజలకు సేవ చేయడమే తనకు ముఖ్యమని ఆయన తెలిపారు. తాను బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని కేశినేని నాని స్పష్టం చేశారు.
అయితే కేశినేని నాని టీడీపీపై పూర్తిస్థాయిలో అసంతృప్తితో ఉన్నట్టు ఆయన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. టీడీపీ తరపున లోక్ సభలో ముగ్గురు ఎంపీలు మాత్రమే ఉన్నారు. వారిలో రామ్మోహన్ నాయుడు లోక్ సభాపక్ష నేతగా ఎంపికకగా, గల్లా జయదేవ్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నారు. దీంతో విప్ పదవి తీసుకోవడానికి కేశినేని నాని మినహా లోక్ సభలో టీడీపీకి మరో నాయకుడు లేడు. ఇలాంటి సమయంలో మరో నేతకు విప్ పదవి ఇవ్వాలని కేశినేని నాని వ్యాఖ్యానించడం పార్టీపై అసంతృప్తికి అద్దంపడుతోంది. మరోవైపు కొద్దిరోజుల క్రితం బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కేశినేని నాని కలవడంతో... ఆయన బీజేపీలో చేరుతున్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో ఆయన టీడీపీని వీడేందుకే ఈ రకమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP News, Chandrababu naidu, Kesineni Nani, Tdp, Vijayawada S01p12