దక్షిణాది రాష్ట్రం కేరళలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు బీజేపీ పక్కా వ్యూహాలతో సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా కేరళలో భారతీయ ధర్మ జనసేన (బీడీజేఎస్), కేరళ కాంగ్రెస్ పార్టీలతో కలిసి బీజేపీ బరిలో దిగుతోంది. ఈ మేరకు బీజేపీ కూటమి పార్టీల మధ్య సీట్ల పంపిణీ సర్దుబాటు బుధవారం పూర్తయ్యింది. మొత్తం 20 లోక్‌సభ నియోజకవర్గాల్లో బీజేపీ 14 లోక్‌సభ నియోజకవర్గాల నుంచి బరిలో నిలవనుంది. బీడీజేఎస్ ఐదు స్థానాల నుంచి పోటీ చేయనుండగా...పీసీ థామస్ నేతృత్వంలోని కేరళ కాంగ్రెస్ ఒక స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు అధికారిక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల నుంచి ఎన్డీయే కూటమికి మద్దతు లభిస్తోందని ఆయన చెప్పుకొచ్చారు.
లోక్‌సభ ఎన్నికల్లో కేరళ నుంచి బరిలో నిలిచేందుకు వీలుగా ఇటీవల మిజోరాం గవర్నర్ పదవికి కుమ్మనం రాజశేఖరన్ రాజీనామా చేయడం తెలిసిందే. తరువనంతపురం లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్న శశి థరూర్‌పై బీజేపీ అభ్యర్థిగా కుమ్మనం రాజశేఖరన్ బరిలో నిలవనున్నట్లు తెలుస్తోంది. కేరళలోని 20 లోక్‌సభ స్థానాలకు ఒకే విడతలో ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది.
శబరిమల వివాదం పార్టీకి కలిసొచ్చేనా?
శబరిమల వివాదం కారణంగా కేరళలో తమ పార్టీకి కలిసి వస్తుందని బీజేపీ నేతలు అంచనావేస్తున్నారు. శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోనికి మహిళల ప్రవేశాన్ని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వ్యతిరేకించగా...అధికార ఎల్డీఎఫ్ సర్కారు సమర్థించింది. పినరయి విజయన్ సర్కారు కేరళతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందంటూ బీజేపీ ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. ఈ ఎన్నికల్లో హిందువులు ఎన్డీయే కూటమికి మద్దతిస్తారని బీజేపీ నేతలు ఆశాభావం వ్యక్తంచేశారు.