Kerala Local Body Election Results: కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో LDF (లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్), UDF (యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్) మధ్య హోరాహోరీ నెలకొంది. గ్రామ పంచాయతీల నుంచి కార్పొరేషన్ల వరకు అన్నింటా నువ్వా నేనా అన్నట్లుగా పోటీపడుతున్నాయి. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. ఆ తర్వాత బ్యాలెట్ బాక్స్‌లను ఓపెన్ చేసి ఓట్లను లెక్కిస్తున్నారు. ఉదయం 09.30 సమయానికి.. ఎల్డీఎఫ్ 228 గ్రామ పంచాయతీలు, 73 మండల పంచాయతీలు, 9 జిల్లా పంచాయతీలు, 35 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లలో లీడింగ్‌లో ఉంది. ఇక యూడీఎఫ్..244 గ్రామ పంచాయతీలు, 50 మండల పంచాయతీలు, 5 జిల్లా పంచాయతీలు, 40 మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లో ఆధిక్యంలో ఉంది. ఎన్డీయే మాత్రం తక్కువ చోట్ల ఆధిక్యంలో ఉంది. కేవలం 21 గ్రామ పంచాయతీలు, ఒక మండల పంచాయతీ, 5 మున్సిపాలిటీల్లోనే లీడింగ్‌లో ఉంది.

కాగా, కేరళలో 941 గ్రామ పంచాయతీలు, 152 మండల పంచాయతీలు, 14 జిల్లా పంచాయతీలు, 86 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. మొత్తం మూడు దశల్లో పోలింగ్ నిర్వహించారు. డిసెంబరు 8న తిరువనంతపురం, కొల్లాం, పతానంతిట్ట, అలప్పుళ, ఇడుక్కి జిల్లాల్లో తొలి దశ ఎన్నికలు జరిగాయి. ఇక డిసెంబరు 10న కొట్టాయం, ఎర్నాకుళం, త్రిస్సూర్, పాలక్కడ్, వయానడ్ జిల్లాల్లో రెండో దశ, డిసెంబరు 14న మలప్పురం, కన్నూరు, కాసర్‌గఢ్, కోజికోడ్ జిల్లాల్లో తుదిదశ పోలింగ్ జరిగింది. ఇవాళ సాయంత్రం లోపు పూర్తి స్థాయి ఫలితాలు వెలువడనున్నాయి.