కేరళ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఆ పార్టీ ప్రకటించింది. ఇటీవల పార్టీలో చేరిన మెట్రో మ్యాన్ శ్రీధరన్‌ను బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. కేరళ బీజేపీ అధ్యక్షుడు కె.సురేంద్రన్ అధికారికంగా ఈ ప్రకటన చేశారు. కేరళలో బీజేపీ అధికారంలోకి వస్తే శ్రీధరన్ సీఎం అవుతారని చెప్పారు. 140 సీట్లు ఉన్న కేరళ అసెంబ్లీలో ఏప్రిల్ 6న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి.
మెట్రో మ్యాన్‌గా గుర్తింపు పొందిన శ్రీధరన్ ఫిబ్రవరిలో బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. బీజేపీ అధికారంలోకి వస్తే తాను ముఖ్యమంత్రిని అవుతానని వెల్లడించారు. ఫిబ్రవరి 19న పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడిన శ్రీధరన్ తాను బీజేపీలో చేరుతున్నట్టు ధ్రువీకరించారు. అలాగే, బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే తాను ముఖ్యమంత్రి అవుతానని వెల్లడించారు. ‘ఒకవేళ బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే కేరళను అప్పుల ఊబి నుంచి బయట పడేయాలి. అలాగే, అభివృద్ధికి మౌలిక వసతులు కల్పించాలి.’ అని శ్రీధరన్ చెప్పినట్టు పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది. ముఖ్యమంత్రే ఎందుకు అవ్వాలనుకుంటున్నారు? గవర్నర్ అవ్వొచ్చు కదా అని ప్రశ్నించగా, గవర్నర్ గిరీ కంటే తాను ముఖ్యమంత్రిగానే ఎక్కువ సేవ రాష్ట్రానికి చేయగలనన్నారు. రాజ్యాంగబద్ధ పదవి అయిన గవర్నర్‌కు పెద్దగా అధికారాలు ఉండవని కుండబద్దలు కొట్టారు.
శ్రీధరన్ బీజేపీలో చేరబోతున్నారన్న వార్త కేరళ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయింది. 'ఇది ఆకస్మిక నిర్ణయం కాదు. కేరళలో దశాబ్ధ కాలంగా ఉంటున్నా. రాష్ట్ర ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలని కోరుకుంటున్నా. ఒక్కడిగా ఏమీ చేయలేను. బీజేపీ విభిన్నమైన పార్టీ. అందుకే బీజేపీలో చేరుతున్నా. వృత్తిపరమైన అంశాలను పక్కనబెట్టి పూర్తిగా రాజకీయాలపైనే దృష్టి సారిస్తాను.' అని మలయాళ న్యూస్ పేపర్ మనోరమతో ఆయన పేర్కొన్నారు. బీజేపీ వస్తేనే కేరళ ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. పార్టీ హైకమాండ్ ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీచేస్తానని ఆయన ప్రకటించారు.
ఈ.శ్రీధరన్
ఈ.శ్రీధరన్ మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుంది. వృత్తిరిత్యా సివిల్ ఇంజినీరైన శ్రీధరన్.. మన దేశంలో ప్రజా రవాణా ముఖచిత్రాన్నే సమూలంగా మార్చేశారు. ఈయన సారథ్యంలో కొంకణ్ రైల్వేతో పాటు ఢిల్లీ మెట్రో నిర్మాణం జరిగింది. శ్రీధరన్ గైడెన్స్‌లోనే లక్నో మెట్రో రికార్డు టైమ్‌లో పూర్తయింది. అంతేకాదు కేరళలోని కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్ ప్రాజెక్టుకు ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు. కాగా, 2017లో లక్నో మెట్రో రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్రీధరన్‌ను పట్టించుకోలేదని అప్పట్లో బీజేపీపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన సలహాలు సూచనలతోనే లక్నో మెట్రో ప్రాజెక్టు వేగవంతంగా పూర్తయింది. ఐతే ప్రారంభోత్సవ కార్యక్రమంలో వేదికపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో పాటు కేంద్ర మంత్రులు ఉన్నారు. డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేశ్ శర్మ, మంత్రులు బ్రిజేష్ పాఠక్, రీటా బహుగుణ జోషి, అశుతోష్ టాండన్ కూడా పాల్గొన్నారు. ఐతే ఆ మెట్రో ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించిన శ్రీధరన్ మాత్రం పక్కనబెట్టారేశారని విమర్శలు వచ్చాయి. ప్రారంభోత్సవంలో శ్రీధరన్ ఓ మూలన నిల్చున్న ఫొటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి.