KEJRIWAL LED AAP FIVE PICKS FOR RAJYA SABHA INCLUDE CRICKETER HARBHAJAN SINGH RAGHAV CHADHA FULL LIST HERE MKS
Rajya Sabhaకు AAP భల్లే ఎంపిక: హర్భజన్ సింగ్ ఇక ఎంపీ.. పెద్దలసభలో చిన్నోడు రాఘవ్ చద్దా.. పూర్తి జాబితా ఇదే
ఆప్ ఎంపీలుగా హర్భజన్, రాఘవ్ చద్దా
మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ను రాజ్యసభ ఎంపీగా నామినేట్ చేస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ అధికారికంగా ప్రకటించింది. భజ్జీతోపాటు రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్, అశోక్ కుమార్ మిట్టల్, సంజీవ్ అరోరా పేర్లను ఆప్ ఫైనలైజ్ చేసింది.
గతానికి భిన్నంగా ఈసారి రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఇటీవల పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి రాజ్యసభలో బలం 3 నుంచి 8 ఎంపీలకు పెరిగింది. దీంతో కొత్తగా ఐదుగురు అభ్యర్థులను రాజ్యసభకు పంపాల్సి ఉండగా, ఆప్ చీఫ్ అరవింద్ క్రేజీవాల్ ఆచి తూచి ఎంపికలు చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ సోమవారం అధికారికంగా విడుదల చేసింది. అందులో..
మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ను రాజ్యసభ ఎంపీగా నామినేట్ చేస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. మొత్తం ఐదు ఖాళీలకుగానూ హర్భజన్ తోపాటు ఢిల్లీ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా, ఐఐటీ-ఢిల్లీ అసోసియేట్ ప్రొఫెసర్ సందీప్ పాఠక్, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ వ్యవస్థాపక ఛాన్సలర్ అశోక్ కుమార్ మిట్టల్, కృష్ణ ప్రాణ్ బ్రెస్ట్ క్యాన్సర్ కేర్ ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు సంజీవ్ అరోరా పేర్లను ఆప్ ఫైనలైజ్ చేసింది.
పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆమోదం తర్వాత ఆప్ తన రాజ్యసభ అభ్యర్థుల జాబితాను కొద్దిసేపటి కిందట విడుదల చేసింది. 117 సీట్లున్న పంజాబ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆప్ ఏకంగా 92 సీట్లు సాధించింది. ఢిల్లీలో(70 సీట్లకుగానూ) 67 సీట్లు ఆ పార్టీవే. దీంతో రాజ్యసభలో ఆప్ బలం 3 నుంచి 8కి పెరిగింది. రాజ్యసభను కేవలం నామినేటెడ్ పదవుల మాదిరిగా కాకుండా సమాజానికి పనికొచ్చే, అవసరమైన వ్యక్తులను మాత్రమే ఎంపిక చేస్తామని కేజ్రీవాల్ మొదటి నుంచీ చెబుతున్నట్లే ఇవాళ్టి జాబితా వెలువడింది.
టీమిండియా క్రికెటర్ గా అంతర్జాతీయ ఖ్యాతి పొందిన హర్భజన్ సింగ్ పంజాబ్ ఎన్నికలకు ముందు పీసీసీ నవజ్యోత్ సిద్ధూను కలవడంతో కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం జరిగింది. కానీ భజ్జీ తొందరపడకుండా ఆగడంతో ఇప్పుడు ఆప్ అతణ్ని రాజ్యసభ ఎంపీగా ఎంచుకుంది. పంజాబ్ లో ఆప్ ఘన విజయానికి ముఖ్య కారకుల్లో ఒకడు, ఎన్నికల ఇంచార్జి అయిన రాఘవ్ చద్దా ప్రస్తుతం ఢిల్లీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ, అతణ్ని రాజ్యసభకు పంపుతుండటం గమనార్హం. 33 ఏళ్ల రాఘవ్ చద్దా పెద్దల సభలో అతిపిన్న వయస్కుడు కానున్నారు. పంజాబ్లోని ఏడు రాజ్యసభ స్థానాల్లో ఐదింటికి మార్చి 31న ఎన్నికలు జరుగుతాయి. ఆప్ తరఫున ఐదుగురు అభ్యర్థులూ సునాయాసంగా ఎంపీలు కానున్నారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.