Harishrao: ఆపరేషన్ హుజురాబాద్.. ఈటలపై హరీష్ రావు అస్త్రం.. టీఆర్ఎస్ కొత్త స్కెచ్

హరీష్ రావు, ఈటల రాజేందర్

మంత్రి హరీష్‌రావుతో ఆపరేషన్ హుజురాబాద్‌ను ప్రారంభించింది. నియోజకవర్గ టీఆర్ఎస్ నేతలెవరూ ఈటెల వెంట వెళ్లకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే శనివారం కమలాపూర్ మండల టీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులతో మంత్రి హరీష్ రావు సమావేశమయ్యారు.

 • Share this:
  మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారం కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆయనపై భూకబ్జా ఆరోపణలు రావడం, సీఎం కేసీఆర్ మంత్రివర్గం నుంచి ఆయన్ను తప్పించడంతో.. ఇక్కడి రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. త్వరలో ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని ఇటీవలే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో హుజరాబాద్ నియోజకవర్గంలో ఉపఎన్నికలు వచ్చే అవకాశముంది. ఆ ఎన్నికల్లో ఈటలను ఓడించి.. సత్తా చాటాలని టీఆర్ఎస్ ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఉమ్మడి కరీంనగర్‌పై మంచి పట్టున్న ఈటల రాజేందర్‌ను కట్టడి చేసే బాధ్యలను ఇటీవల మంత్రి గంగులకు అప్పగించింది టీఆర్ఎస్. ఐతే గంగుల సరిగ్గా ఎదుర్కోలేకపోతున్నారన్న అభిప్రాయాల నేపథ్యంలో కొత్త వ్యక్తిని రంగంలోకి దించింది పార్టీ హైకమాండ్. ఆయన ఎవరో కాదు.. టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు.

  మంత్రి హరీష్‌రావుతో ఆపరేషన్ హుజురాబాద్‌ను ప్రారంభించింది టీఆర్ఎస్ హైకమాండ్. నియోజకవర్గ టీఆర్ఎస్ నేతలెవరూ ఈటెల వెంట వెళ్లకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే శనివారం కమలాపూర్ మండల టీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులతో మంత్రి హరీష్ రావు సమావేశమయ్యారు. మాజీ ఎంపీ వినోద్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. తాము టీఆర్ఎస్‌తోనే ఉంటామని..హుజురాబాద్ నియోజవర్గ అభివృద్ధి టీఆర్ఎస్‌తో సాధ్యమని అక్కడి నేతలు మంత్రి హరీష్ రావుతో చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేశారు. 2001 నుంచి టీఆర్ఎస్‌తోనే నడిచామని.. ఇప్పుడు కూడా టీఆర్ఎస్ వెంటే ఉంటామని తెలిపారు. దీన్నిబట్టి ఈటెల వ్యవహారం బాధ్యతలను సీఎం కేసీఆర్.. హరీష్ రావుకే అప్పగించినట్లు అర్ధమవుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


  టీఆర్ఎస్‌లో హరీష్ రావుకు ట్రబుల్ షూటర్‌గా పేరుంది. ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మలచుకొని.. తనకు అప్పగించిన పనిని సమర్థవంతంగా నిర్వహిస్తారన్న నమ్మకం ఆ పార్టీ నేతలకు ఉంది. కొడంగల్‌లో రేవంత్ రెడ్డిని ఓడించే బాధ్యతను అప్పగించగా.. దానిని సమర్థవంతంగా నిర్వహించారు. తనమైన వ్యూహాలతో రేవంత్ రెడ్డికి చెక్ పెట్టారు. ఒక్క దుబ్బాక ఉపఎన్నికలు మినహా చాలా చోట్ల ఆయన వ్యూహాలు విజయవంతమయ్యాయి. మరోవైపు ఈటల రాజేందర్ బీసీ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. ఇతర పార్టీల నేతలతోనూ వరుసగా భేటీ అవుతూ మద్దతు కూడగట్టుతున్నారు. ముదిరాజ్ సామాజికవర్గం కూడా ఆయన వెంటనే ఉందన్న సంకేతాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈటలను ఎదుర్కొనేందుకు ట్రబుల్ షూటర్ హరీష్ రావును రంగంలోకి దింపారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

  ఇంత జరిగినా ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ ఎందుకు రాజీనామా చేయడం లేదన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. పదవికి రాజీనామా చేసేందుకు ఆయన భయపడుతున్నారా అనే డౌట్స్ కూడా తెరపైకి వచ్చాయి. వీటిని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఈటల క్లారిటీ ఇచ్చారు. ఎమ్మెల్యే పదవికి ఖచ్చితంగా రాజీనామా చేస్తానని.. ఐతే కరోనా ముగిసిన తర్వాతే ఆ నిర్ణయం ఉంటుందని ఆయన తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల ద్వారానే కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి చెందినట్లు హైకోర్టు, సుప్రీంకోర్టు మండిపడ్డాయని ఈటల గుర్తు చేశారు. ఇప్పుడు తాను రాజీనామా చేస్తే, మళ్లీ ఉపఎన్నికలు వస్తాయని.. అప్పుడు ప్రజలు ఇబ్బంది పడకూడదన్నదే ఉద్దేశ్యమని ఆయన స్పష్టం చేశారు.

  మరోవైపు కేబినెట్‌ నుంచి ఈటల నుంచి తప్పించిన తర్వాత.. మొన్నటి వరకు ఆయన నిర్వహించిన వైద్య,ఆరోగ్యశాఖ బాధ్యతను స్వయంగా సీఎం కేసీఆర్ చూస్తున్నారు. ఐతే కోవిడ్ కట్టడిపై జరుగుతున్న సమీక్షా సమావేశాల్లో మంత్రి హరీష్ రావు కూడా పాల్గొంటున్నారు. కేంద్ర వైద్యఆరోగ్య సమీక్షలోనూ రాష్ట్రం తరపున ఆయనే పాల్గొంటున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ గాంధీ ఆస్పత్రిని సందర్శించినప్పుడు ఆయన వెంట హరీష్ రావు ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో వైద్య,ఆరోగ్యశాఖను హరీష్ రావుకే అప్పగిస్తారన్న ప్రచారం జరుగుతోంది.
  Published by:Shiva Kumar Addula
  First published: