KCR SAYS NO REDUCTION OF VAT ON ON PETROL DIESEL IN TELANGANA CM DEMANDS CENTRE TO WITHDRAW CESS AP CM JAGAN TOO MKS
petrol : వ్యాట్ వర్సెస్ సెస్ -ఇది కేసీఆర్, జగన్ ఉమ్మడి వ్యూహమా? -ఇక బీజేపీతో దబిడి దిబిడేనా?
కేంద్రంపై కేసీఆర్, జగన్ పెట్రో పోరు
ఎన్డీఏలో సభ్యులు కాకున్నా బీజేపీతో అమితమైన దగ్గరితనాన్ని ప్రదర్శిస్తూ, కేంద్ర సర్కారుకు అన్ని రకాలుగా మద్దతు పలుకుతోన్న కేసీఆర్, జగన్ లు తొలిసారి ఉమ్మడిగా తిరుగుబాట పట్టారు. పెట్రో ధరల విషయంలో కేంద్రం తీరును ఎండగడుతూ గంటల వ్యవధిలోనే ఇద్దరు సీఎంలు సంచలన ప్రకటనలు చేశారు. తద్వారా బీజేపీయేతర, కాంగ్రెసేతర జాతీయ కూటమి ఏర్పాటు ప్రక్రియ మళ్లీ వేగం పుంజుకుందా..
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తారా స్థాయికి చేరడంతో రవాణాతో ముడిపడిన అన్ని నిత్యావసర సరుకుల ధరలూ చుక్కలనంటాయి. పెంచిన ధరలో రాష్ట్రాలకు సంబంధం లేకుండా సెస్ రూపంలో డబ్బులన్నీ కేంద్రానికే వెళుతున్నా ఇప్పటిదాకా ముఖ్యమంత్రులందరూ సైలెంట్ గానే ఉండిపోయారు. కాగా, సడెన్ గా దీపావళి కానుక అంటూ కేంద్రంలోని మోదీ సర్కార్.. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని రూ.5, రూ.10మేర తగ్గించడం, ఆ వెంటనే రాష్ట్రాలు కూడా సుంకాలను తగ్గించుకోవాలని సూచించడంతో బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం పెట్రో ధరలు తగ్గించాయి. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న ఒడిశా లాంటి రాష్ట్రాల్లోనూ ధరలు తగ్గించారు. అయితే, ఎన్డీఏలో సభ్యులు కాకున్నా బీజేపీతో అమితమైన దగ్గరితనాన్ని ప్రదర్శించే కేసీఆర్, జగన్ లు మాత్రం పెట్రో ధరల విషయంలో కేంద్రంపై తొలిసారి తిరుగుబాటు ప్రకటించారు.
పెంచింది ఎవరు? తగ్గించాల్సింది ఎవరు?
పెట్రో ధరలు ఎవరు పెంచారు? తగ్గించాల్సింది ఎవరు? ఇందులో రాష్ట్రాల ప్రేమయం ఏంటి? అంటూ ఏపీ సీఎం జగన్ అన్ని ప్రధాన పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చిన రోజే.. తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం పెట్రో మంటల సాక్షిగా కేంద్రంపై అతి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, దేశంలో అగ్గి రాజేస్తామని శపథం చేశారు. కూడబలుక్కుని పోరాటానికి దిగారా? ఉమ్మడి వ్యూహమా? అన్నట్లుగా తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరూ ఒకేసారి పెట్రో ధరలపై పోరుకు దిగడం, ఇన్నాళ్లూ స్నేహం చేసిన బీజేపీతో ఇక యుద్దమేనని సంకేతాలివ్వడం చర్చనీయాంశమైంది.
వ్యాట్ వర్సెస్ సెస్
పెట్రో ధరలకు సంబంధించి పన్నుల వసూలు విధానాలను మోదీ సర్కారు ఉద్దేశపూర్వకంగా తనకు అనుకూలంగా మార్చుకుందని, పెట్రో ఆదాయాన్ని డివిజబుల్ పూల్‌లోకి రాకుండా సెస్‌లు, సర్‌ఛార్జీల రూపంలో వసూలు చేస్తున్నారని కేసీఆర్, జగన్ ప్రభుత్వాలు ఆరోపిస్తున్నాయి. జీఎస్టీ పరిధిలో లేనందున పెట్రోల్, డీజిల్ పై ఇప్పటికీ వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్(వ్యాట్) విధానమే అమలవుతున్నది. పెట్రోల్ పై వ్యాట్ లో నిబంధనల ప్రకారం రాష్ట్రాలకు కూడా 41 శాతం వాటా లభిస్తుంది. కానీ మోదీ సర్కార్ కావాలనే వ్యాట్ కాకుండా, ప్రత్యేక అవసరాల కోసం అదనపు నిధులు సమకూర్చుకునే సెస్ విధానాన్ని పెట్రోపై అమలు చేస్తున్నది. ఇది రాష్ట్రాల కడుపు కొట్టడమేనని కేసీఆర్, జగన్ ఆరోపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై రూ.3,35,000 కోట్లు వసూలు చేస్తే అందులో రాష్ట్రాలకు పంచింది కేవలం రూ.19,745 కోట్లు మాత్రమేనని, అంటే కేవలం 5.8 శాతం మాత్రమే అని జగన్ సర్కారు ప్రకటనలో పేర్కొంది. ఆదివారం నాటి ప్రెస్ మీట్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం ఇదే తరహా వాదన వినిపిస్తూ ఘాటు పదజాలంతో కేంద్రంపై విరుచుకుపడ్డారు..
ఇక అగ్గిమంటలే..
పెట్రో ధరలు కొండంత పెంచి, పిరసరంత తగ్గించిన కేంద్రం.. అదేదో ఘనకార్యం చేసినట్లు రాష్ట్రాలనూ ధరలు తగ్గించాలనడం విడ్డూరంగా ఉందని కేసీఆర్, జగన్ వాదిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర పెరగకున్నా కేంద్రం అబద్దాలు చెప్పి అధిక పన్నులు వసూలు చేస్తూ జనాన్ని ఏడిపిస్తోందని, ట్యాక్సులు పెంచింది కేంద్రమైతే.. రాష్ట్రాలను తగ్గించడమనమేంటని కేసీఆర్ ఫైరయ్యారు. పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం వసూలు చేస్తోన్న అన్ని సెస్‌లు వెంటనే వెనక్కు తీసుకోవాలని, తద్వారా పెట్రోల్ ధర రూ.77కి తగ్గుతుందని, అలా చేయని పక్షంలో దేశంలో అగ్గిరాజేసే ఉద్యమానికి తానే శ్రీకారం చుడతానని కేసీఆర్ హెచ్చరించారు. పెట్రో ధరలతోపాటు వ్యవసాయ చట్టాల విషయంలోనూ రాష్ట్రల నోరుకొడుతోన్న కేంద్రానికి వ్యతిరేకంగా తెలంగాణ కేబినెట్ మొత్తం ఢిల్లీలో ధర్నాకు దిగుతుందని కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు.
పెట్రో ధరలు తగ్గించం
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ గానీ, ఏపీలో అధికార వైసీపీగానీ ఇన్నాళ్లూ కేంద్రంలోని మోదీ సర్కారుతో సహకారాత్మక ధోరణిలోనే పయనించాయి. ఎన్డీఏ మిత్రులు సైతం వ్యతిరేకించిన వివాదాస్పద బిల్లులకూ జగన్, కేసీఆర్ మద్దతు పలికి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. అయితే, కరోనా అనంతర పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ చితికిపోయిన నేపథ్యంలో రాష్ట్రాలను ఆర్థికంగా దెబ్బతీసేలా కేంద్రం వ్యవహరిస్తే మాత్రం చూస్తూ ఊరుకోబోమంటూ ఇప్పుడీ ఇద్దరు సీఎంలు పోరాటానికి దిగారు. మిగతా రాష్ట్రాల సీఎలకు విరుద్ధంగా.. పెట్రోల్ ధరల్ని తగ్గించబోమని కేసీఆర్, జగన్ మాత్రమే బాహాటంగా ప్రకటనలు చేశారు.
కేసీఆర్, జగన్ ఉమ్మడి వ్యూహమా?
పెట్రో ధరలపై కేంద్రంతో పోరాటానికి సంబంధించి జగన్, కేసీఆర్ అనుకూల మీడియాలో పుంఖానుపుంఖాలుగా వార్తలు రావడం మొదలు, ముఖ్యమంత్రులే నేరుగా ప్రకటనలు చేయడం దాకా వీళ్లిద్దరూ ఉమ్మడి వ్యూహంతో ముందుకు కదులుతున్నారా? అనే చర్చ జరుగుతోంది. కేసీఆర్ చాలా కాలం నుంచి చెబుతోన్న ‘బీజేపీయేతర, కాంగ్రెసేతర ఫెడరల్ ఫ్రంట్’ ఏర్పాటుకు పెట్రో మంటలు కలిసొస్తాయని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కలిసివచ్చే పార్టీలను వెంటపెట్టుకుని కేంద్రంతో పోరాడటానికి ఇదే సరైన సమయమనీ వారు భావిస్తున్నట్లు సమాచారం. వ్యవసాయ చట్టాలు, వరి పండించే విషయంలోనూ కేంద్రంతో కొట్లాడుతానంటోన్న కేసీఆర్ కు జగన్ మద్దతిస్తా? అనేది ఇంకా తేలాల్సి ఉంది. అయితే, కేసీఆర్ గతంలోనూ కేంద్రంపై అనేక సార్లు యుద్దాలు ప్రకటించి తీరా టైమొచ్చినప్పుడు తుస్సుమనిపించారు. మరి ఈసారైనా అగ్గి రాజేస్తారా లేదా అన్నది ప్రస్తుతానికి చర్చకే పరిమితం.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.