Choose Municipal Ward
  CLICK HERE FOR DETAILED RESULTS

  ఫెడరల్ ఫ్రంట్‌: కేంద్రంలో హంగ్ వస్తే.. కేసీఆరే కింగ్?

  ప్రస్తుత తరుణంలో కాంగ్రెస్, బీజేపీ పట్ల ప్రజలు సుముఖంగా లేరు. 2004 తర్వాత ప్రాంతీయ పార్టీల బలం తగ్గినా ఆ రెండు పార్టీల ఏకపక్ష నిర్ణయాలు, పేద,మధ్య తరగతి ఇబ్బందికి గురయ్యేలా విధానాలు, ఆశించిన ఆర్థిక పురోగతి లేకపోవడం లాంటి అనేక కారణాలతో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం పెరిగింది.

  news18-telugu
  Updated: May 8, 2019, 7:56 AM IST
  ఫెడరల్ ఫ్రంట్‌: కేంద్రంలో హంగ్ వస్తే.. కేసీఆరే కింగ్?
  తెలంగాణ సీఎం కేసీఆర్(File)
  • Share this:
  ఓ వైపు ఎన్నికలు.. మరోవైపు ప్రచారాలు.. ఇంకోవైపు అధికార ఎత్తుగడలు. మొత్తంగా దేశం రాజకీయం రంజుగా కొనసాగుతోంది. మరోసారి అధికారం కోసం బీజేపీ, పోయిన అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్, కేంద్రంలో చక్రం తిప్పాలని ఫ్రంట్‌ల రాయబారాలు. ఇలా ఎటు చూసినా హస్తిన గడ్డపై కాలర్ ఎగరేయాలన్నదే వారి ప్రధాన అజెండా. అయితే ప్రస్తుత తరుణంలో కాంగ్రెస్, బీజేపీ పట్ల ప్రజలు సుముఖంగా లేరు. 2004 తర్వాత ప్రాంతీయ పార్టీల బలం తగ్గినా ఆ రెండు పార్టీల ఏకపక్ష నిర్ణయాలు, పేద,మధ్య తరగతి ఇబ్బందికి గురయ్యేలా విధానాలు, ఆశించిన ఆర్థిక పురోగతి లేకపోవడం లాంటి అనేక కారణాలతో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం పెరిగింది. అందుకే సీఎం కేసీఆర్ రంగంలోకి దిగారు. జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టుకునేందుకు చర్యలు వేగవంతం చేశారు. ఎన్నికల షెడ్యూల్‌కు ముందునుంచే వ్యూహాత్మకంగా తన మెదడుకు పని పెట్టారు. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కర్ణాటక సీఎం కుమారస్వామి, ఆయన తండ్రి మాజీ ప్రధాని దేవెగౌడను కలిశారు.

  ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశ అవసరాలు, రాజకీయ మార్పులు, ప్రజల ఆకాంక్షపై సమాలోచనలు జరిపారు. జాతి నిర్మాణానికి అనుసరించాల్సిన విధానాలు, దేశవ్యాప్త వనరుల సద్వినియోగం, దాని ద్వారా సాధించే ఆర్థిక పురోగతి, వ్యవసాయ రంగం, రైతు సంక్షేమం, గ్రామీణ సంపద సృష్టించే అంశాలపై లోతుగా చర్చించారు. జాతీయ మీడియా ద్వారా ఫెడరల్ ఫ్రంట్ అవసరాన్ని దేశానికి వివరించారు.

  ప్రస్తుతం ఉన్న వ్యవస్థీకృత లోపాలను సరిదిద్ది నవ భారత నిర్మాణాన్ని ఆవిష్కరించేందుకు తానున్నానంటూ కేసీఆర్ ముందుకు వచ్చారు. రైతులు, సంఘాల ప్రతినిధులు, మీడియా సంస్థలు, ప్రముఖ జర్నలిస్టులు, పారిశ్రామిక వేత్తలు, కార్మిక సంఘాల ప్రతినిధులతో మాట్లాడుతూ ఫ్రంట్ వేదికకు బలమైన పునాదికి వ్యూహం రచిస్తున్నారు. అయితే, ఆయన చర్చలు ఫలిస్తే దేశంలో కేసీఆర్ పేరు మరోసారి మార్మోగిపోనుంది. తెలంగాణ ఉద్యమంతో ఢిల్లీ పీఠాన్ని కదిలించిన ఆయన అదే పట్టుదలతో ఫ్రంట్ ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు.

  నిజంగానే బీజేపీ, కాంగ్రెస్‌లకు అనుకున్న మెజారిటీ రాకపోతే ప్రాంతీయ పార్టీలతో పొత్తు తప్పనిసరి. ఆలోగా ప్రాంతీయ పార్టీలన్నింటినీ కలిపి ఫ్రంట్ ఏర్పాటు చేసి , ముందుకుసాగితే ఫ్రంట్‌కు నాయకత్వం వహించిన కేసీఆర్ కింగ్ అవుతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకు తగ్గట్లు త్వరలోనే కేసీఆర్ ఢిల్లీలో ఫెడరల్ ఫ్రంట్ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.
  First published: May 8, 2019, 7:45 AM IST
  మరిన్ని చదవండి
  తదుపరి వార్తలు

  Top Stories

  corona virus btn
  corona virus btn
  Loading