ఒకేలా ఆలోచిస్తున్న కేసీఆర్, జగన్...చంద్రబాబుకు పూర్తి భిన్నం... వ్యూహాత్మకమేనా ?

జాతీయ రాజకీయాల విషయంలో కేసీఆర్, జగన్ ఆలోచన విధానం దాదాపుగా ఒకేలా ఉండటంతో పాటు చంద్రబాబుకు పూర్తి భిన్నంగా ఉన్నట్టు కనిపిస్తోంది.

news18-telugu
Updated: April 20, 2019, 4:22 PM IST
ఒకేలా ఆలోచిస్తున్న కేసీఆర్, జగన్...చంద్రబాబుకు పూర్తి భిన్నం... వ్యూహాత్మకమేనా ?
చంద్రబాబు, జగన్, కేసీఆర్
news18-telugu
Updated: April 20, 2019, 4:22 PM IST
ఏపీ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారనే విషయం తెలియాలంటే మే 23వరకు ఆగాల్సిందే. అయితే ఏపీకి చెందిన టీడీపీ, వైసీపీ నేతలు మాత్రం విజయం తమదే అని రోజూ ప్రకటనలు చేస్తున్నారు. ఈ సారి గెలుపు తమదే అని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుగా ప్రకటన చేయగా... ఇప్పుడు ప్రతి రోజూ టీడీపీ నేతలు తమ గెలుపు ఖాయమంటూ ప్రకటిస్తున్నారు. రెండు పార్టీలు గెలుపు విషయంలో ధీమాగా ఉండటంతో... అసలు ఏపీలో విజయం ఎవరికి వరిస్తుందనే అంశంపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. పార్టీల ధీమా ఎలా ఉన్నా... ఒక విషయంలో మాత్రం టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు పూర్తి భిన్నంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

ఏపీ రాజకీయాల సంగతి ఎలా ఉన్నా... జాతీయ రాజకీయాల్లో తన పాత్ర ఏ రకంగా ఉండబోతోందనే విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రజలకు ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలకు ముందే తమకు స్నేహితులుగా ఉన్న జేడీఎస్, డీఎంకే వంటి పార్టీల తరపున ఆయన రాష్ట్రాల్లో ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు చంద్రబాబు. ఆయా రాష్ట్రాల్లో వారు గెలిస్తే... జాతీయ స్థాయిలో తనకు కలిసి వస్తుందని ఆయన బలంగా నమ్ముతున్నారు. అయితే ఈ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహారశైలి పూర్తి భిన్నంగా ఉంది. జాతీయ స్థాయిలో వైసీపీ పాత్ర ఎలా ఉంటుందనే విషయంపై జగన్ పెద్దగా ఆలోచించడం లేదని తెలుస్తోంది.

ఎన్నికల ఫలితాలు వచ్చి... కేంద్రంలో పరిస్థితి ఎలా ఉంటుందనే అంశంపైనే కేంద్రంలో మన పాత్ర ఏంటన్నది ఆధారపడి ఉంటుందని ఆయన పార్టీ నేతలకు చెబుతున్నట్టు సమాచారం. కాబట్టి ఇప్పుడే ఈ విషయంపై అనవసర ప్రకటనలు చేయొద్దనే భావనలో వైసీపీ ఉంది. సరిగ్గా ఇక్కడే చాలామందికి జగన్ కేసీఆర్ బాటలో వెళుతున్నారనే భావన కలుగుతోంది. జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన కేసీఆర్... ఎన్నికలకు ముందు ఏ ఒక్క ప్రాంతీయ పార్టీకి మద్దతుగా కానీ, వ్యతిరేకంగా కానీ ప్రచారం చేయడానికి ఆసక్తి చూపడం లేదు. ఎన్నికల్లో గెలిచిన పార్టీలను కలుపుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుందని... కాబట్టి ఏ ఒక్క పార్టీకి అనుకూలంగా వ్యవహరించాల్సిన అవసరం లేదని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి జాతీయ రాజకీయాల విషయంలో కేసీఆర్, జగన్ ఆలోచన విధానం దాదాపుగా ఒకేలా ఉండటంతో పాటు చంద్రబాబుకు పూర్తి భిన్నంగా ఉన్నట్టు అర్థమవుతోంది.First published: April 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...