కవితకు కీలక పదవి... కేసీఆర్ సంకేతాలు...టీఆర్ఎస్‌లో చర్చ

త్వరలో టీఆర్ఎస్ తరపున కవిత రాజ్యసభకు వెళ్లే అవకాశం ఉందని... ఈ కారణంగానే ఆమె మళ్లీ యాక్టివ్ అయ్యారనే ఊహాగానాలు జోరందుకున్నాయి.

news18-telugu
Updated: December 12, 2019, 3:27 PM IST
కవితకు కీలక పదవి... కేసీఆర్ సంకేతాలు...టీఆర్ఎస్‌లో చర్చ
కల్వకుంట్ల కవిత
  • Share this:
లోక్ సభ ఎన్నికల్లో ఓటమి తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న కవిత... మళ్లీ పార్టీలో ఎప్పుడు క్రియాశీలకంగా మారతారనే అంశంపై టీఆర్ఎస్ నేతల్లోనూ క్లారిటీ లేదు. కవిత మళ్లీ ఎన్నికల వరకు రాజకీయాలకు దూరంగా ఉంటారా ? లేక కేసీఆర్ ఆమెకే ఏదో ఒక పదవి అప్పగిస్తారా ? అన్న అంశంపై చాలాకాలంగా చర్చ జరుగుతోంది. రాజకీయాలపై కొంతకాలంగా కవిత పెద్దగా స్పందించకపోవడంతో... ఆమె పాలిటిక్స్‌కు కొంతకాలంగా దూరంగా ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది. అయితే తాజాగా తాజాగా తెలంగాణకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ పార్లమెంట్ ఆవరణలో ఎంపీలు ధర్నా చేయడాన్ని తన ట్విట్‌లో ప్రస్తావించారు కవిత.

సమాఖ్య స్పూర్తి అనేది కేవలం నినాదానికి మాత్రమే పరిమితం కాకూడదని ప్రధాని నరేంద్రమోదీకి కవిత సూచించారు. తెలంగాణకు రావాల్సిన జీఎస్టీ సహా ఇతర బకాయిలు సమయానికి విడుదల చేయాల్సి ఉన్నా... వాటి కోసం ఎంపీలు నిరసన తెలియజేయాల్సి రావడం బాధాకరమని ఆమె వ్యాఖ్యానించారు. ఉన్నట్టుండి కవిత ఈ రకమైన వ్యాఖ్యలు చేయడంపై టీఆర్ఎస్‌లో చర్చ మొదలైంది. రాష్ట్ర స్థాయి అంశాలపై కాకుండా ఢిల్లీలో ఎంపీల నిరసనపై కవిత స్పందించడం వ్యూహంలో భాగమే అనే టాక్ వినిపిస్తోంది.

త్వరలో టీఆర్ఎస్ తరపున కవిత రాజ్యసభకు వెళ్లే అవకాశం ఉందని... ఈ కారణంగానే ఆమె మళ్లీ యాక్టివ్ అయ్యారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. వచ్చే ఏడాదితో ఎంపీ కేశవరావు పదవీకాలం ముగుస్తుందని... ఆయన స్థానంలో కవిత పార్లమెంట్‌కు వెళ్లొచ్చని పార్టీలో చర్చ సాగుతోంది. కేకేను మండలికి పంపి... ఆయనకు రాష్ట్రస్థాయిలో కీలక పదవి ఇవ్వాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారనే వాదన కూడా వినిపిస్తోంది.
Published by: Kishore Akkaladevi
First published: December 12, 2019, 3:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading