వారణాసిలో మోదీపై పోటీ చేయబోతున్న కశ్మీర్ యువకుడు..

కశ్మీర్ పొలిటికల్ యాక్టివిస్ట్ సజద్ నూరాబది (File)

Sajad Noorabadi Contesting From Varanasi against Modi : ఇప్పటివరకు కేవలం ఒకే ఒక్కసారి తాను వారణాసి వెళ్లానని సజద్ తెలిపాడు. చదువుకునే రోజుల్లో తోటి విద్యార్థులతో కలిసి ఒకసారి వారణాసి వెళ్లానని.. ఇప్పుడదే వారణాసి నుంచి పోటీ చేయబోతున్నానని.. ప్రజలు తనను అర్థం చేసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.

 • Share this:
  2014 ఎన్నికల సమయంలో ఎన్నికలను బాయ్‌కాట్ చేయాల్సిందిగా క్యాంపెయిన్ నిర్వహించిన ఆ యువకుడు.. ఇప్పుడు మోదీపై పోటీ చేసేందుకు సిద్దమవుతున్నాడు. రాబోయే ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలో మోదీపై పోటీ చేసేందుకు సమాయత్తమవుతున్నాడు. అతనే.. సజద్ నూరాబది (30). కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాకు చెందిన సజద్ హ్యుమానిటీస్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. చాలాకాలంగా పొలిటికల్ యాక్టివిస్ట్‌గా పనిచేస్తున్నాడు. వారణాసి నుంచి పోటీ చేయడం ద్వారా మోదీ పాలనలో కశ్మీరీలు, ముస్లింల పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో చెప్పడమే తన ఉద్దేశం అని అంటున్నాడు.

  గతంలో అనంత్‌నాగ్ ఉపఎన్నికలోనూ సజద్ పోటీ చేశాడు. ఆ ఎన్నికలో అప్పటి కశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీపై పోటీకి దిగాడు. అయితే హింసాత్మక ఘటనలు, అత్యల్ప ఓటింగ్ నమోదు కారణంగా ఆ బైపోల్ రద్దయిపోయింది. తాజా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు వారణాసి బరిలో నిలిచేందుకు సంసిద్దమవుతున్నాడు. ఇందుకోసం పలు ప్రాంతీయ, జాతీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపాడు. ఏ పార్టీ అయినా తనకు వారణాసి నుంచి టికెట్ ఇస్తే పోటీ చేస్తానని.. లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని చెబుతున్నాడు.


  2014లో ఎన్నికలను బాయ్‌కాట్ చేయాల్సిందిగా క్యాంపెయిన్ నిర్వహించినందుకు గాను పోలీసులు అప్పట్లో సజద్‌ను 15రోజులు కస్టడీలోకి తీసుకున్నారు. అప్పుడు ఎన్నికలనే వ్యతిరేకించిన సజద్.. ఇప్పుడు అదే ఎన్నికల ద్వారా కశ్మీర్ సమస్యకు పరిష్కారం వెతకాలని అంటున్నాడు. కశ్మీర్ సమస్యను చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించగలమన్న నమ్మకం తనకు ఉందని.. అందుకే ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగుతున్నానని చెబుతున్నాడు.

  ఇప్పటివరకు కేవలం ఒకే ఒక్కసారి తాను వారణాసి వెళ్లానని సజద్ తెలిపాడు. చదువుకునే రోజుల్లో తోటి విద్యార్థులతో కలిసి ఒకసారి వారణాసి వెళ్లానని.. ఇప్పుడదే వారణాసి నుంచి పోటీ చేయబోతున్నానని.. ప్రజలు తనను అర్థం చేసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశాడు.
  First published: