Home /News /politics /

KARNATAKA POLITICAL CRISIS UNABLE TO MEET SPEAKER BJP MLAS LEAVE ASSEMBLY JDS ALLEGES OPPN TRYING TO BUY LAWMAKERS FOR RS 1000 CR

మా ఎమ్మెల్యేలను కొనేందుకు రూ.1000 కోట్లు...బీజేపీపై జేడీఎస్ సంచలన ఆరోపణలు

కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి (File)

కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి (File)

Karnataka Political Crisis | తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ దాదాపు రూ.1000 కోట్లు వెచ్చిస్తోందని జేడీఎస్ ఆరోపించింది. ఇదంతా అవినీతి సొమ్మేనంటూ ధ్వజమెత్తింది.

    కర్ణాటకలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే రోషన్ బేగ్ రాజీనామా చేశారు. దీంతో ఇప్పటి వరకు రాజీనామాలు సమర్పించిన రెబల్ ఎమ్మెల్యేల సంఖ్య 15కు చేరింది. వీరిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 11 మంది, జేడీఎస్‌కు చెందిన ఇద్దరు, స్వతంత్ర ఎమ్మెల్యేలు ఇద్దరు ఉన్నారు. రెబల్ ఎమ్మెల్యేలు సమర్పించిన రాజీనామా లేఖల్లో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు రాజీనామా లేఖలు సరైన ఫార్మెట్‌లో లేవని స్పీకర్ రమేశ్ కుమార్ స్పష్టంచేశారు. స్పీకర్ తీరుపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ సర్కారుకు మరింత కాలావకాశం ఇచ్చేందుకే రాజీనామాలపై నిర్ణయం తీసుకునే విషయంలో స్పీకర్ కాలయాపన చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

    రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరేందుకు బీజేపీ కర్ణాటక విభాగ నేతలు మంగళవారం స్పీకర్‌ కార్యాలయానికి వెళ్లారు. అయితే ఆ సమయంలో స్పీకర్‌ అందుబాటులో లేకపోవడంతో స్పీకర్‌ను కలవకుండానే వెనుదిరిగారు.


    ఎమ్మెల్యేల రాజీనామాలపై కుమారస్వామి ప్రభుత్వం ఐసీయూలోకి చేరిందని, తక్షణమే ప్రభుత్వాన్ని స్పీకర్ డిస్మిస్ చేయాలని బీజేపీ సీనియర్ నేత, ఆ రాష్ట్ర మాజీ సీఎం యడ్యూరప్ప డిమాండ్ చేశారు. అటు కుమారస్వామి సర్కారు మైనార్టీలో పడిపోయిందని, తక్షణమే ఆయన సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ కర్ణాటక రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప డిమాండ్ చేశారు. అవసరమైన మెజార్టీ లేకున్నా సీఎం పదవిలో కుమారస్వామి కొనసాగడానికి నిరసనగా గాంధీ విగ్రహం, విధానసౌధ ఎదుట బుధవారం నిరసన తెలపనున్నట్లు వెల్లడించారు.

    అటు బీజేపీపై జేడీఎస్ తీవ్ర ఆరోపణలు చేసింది. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ రూ.1000 కోట్లు ఎరగా వేస్తోందని ఆరోపించింది. ఇది మిజోరం, మణిపూర్, సిక్కిం రాష్ట్రాల వార్షిక బడ్జెట్‌లో దాదాపు 10 శాతానికి సమానంగా పేర్కొంది. ఇంత డబ్బు అమిత్ షా, మోదీలకు ఎక్కడి నుంచి వస్తోందని ప్రశ్నించింది. అవినీతిరహిత పాలన బూటకమంటూ జేడీఎస్ ట్వీట్ చేసింది.
    Published by:Janardhan V
    First published:

    Tags: Karnataka, Karnataka bjp, Karnataka political crisis, Karnataka Politics, Kumaraswamy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు