కర్ణాటకలో రాజకీయ సంక్షోభం పతాక స్థాయికి చేరింది. 13 మాసాల సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు జేడీ(సెక్యులర్) చీఫ్, సీఎం కుమారస్వామి చివరి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా అసమ్మతి ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు, నామినేటెడ్ పోస్టులు ఇచ్చేందుకు ఇప్పటికే ఆయన సుముఖత వ్యక్తంచేశారు. కాసేపట్లో పార్టీ ఎమ్మెల్యేలతో తాజ్ వెస్ట్ హోటల్లో కుమారస్వామి సమావేశంకానున్నారు. పార్టీ ఎమ్మెల్యేలను రిసార్ట్‌కు తరలించడంపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. కూర్గ్‌లోని ఓ రిసార్టుకు ఎమ్మెల్యేలను తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. 13 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో జేడీఎస్-కాంగ్రెస్ సర్కారు మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. సోమవారం స్వతంత్ర ఎమ్మెల్యే నగేష్ జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ సర్కారుకు మద్దతు ఉపసంహరించుకుని తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ ముందుకు వచ్చేపక్షంలో తన మద్దతు ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు.
అటు తమ భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించేందుకు బీజేపీ సీనియర్ నేతలు సాయంత్రం సమావేశంకానున్నారు. అటు గవర్నర్ కార్యాలయాన్ని బీజేపీ దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలను బీజేపీ నేతలు తిప్పికొట్టారు. గవర్నర్ కార్యాలయాలను దుర్వినియోగం చేయడం కాంగ్రెస్ పార్టీ సంస్కృతిగా ఎద్దేవా చేశారు. స్వతంత్ర ఎమ్మెల్యే నగేష్ తన మంత్రి పదవికి రాజీనామా చేసి కుమారస్వామి సర్కారుకు మద్దతు ఉపసంహరించుకోవడంలో బీజేపీ ప్రమేయం లేదని ఆ పార్టీ నేత ఆర్.అశోక్ స్పష్టంచేశారు.