కర్ణాటక మాజీ సీఎం, సీఎల్పీ నేత సిద్ధరామయ్యకు ఇప్పుడు ‘రిటర్న్ గిఫ్ట్’ భయం పట్టుకుంది. ‘మాండ్యా’కు ప్రతీకారంగా మైసూరు లోక్సభ నియోజకవర్గంలో జేడీఎస్ కాంగ్రెస్ అభ్యర్థి సీహెచ్ విజయశంకర్ను బీజేపీ ఓడగొట్టుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుల్లో ఒకరు సీహెచ్ విజయశంకర్. మైసూర్ నియోజకవర్గంలో సీహెచ్ విజయశంకర్ బీజేపీ అభ్యర్థి ప్రతాప్ సింహాతో తలపడుతున్నారు. అక్కడ విజయశంకర్ గెలుపోటములు సిద్ధరామయ్య రాజకీయ భవితవ్యంపైనే ప్రభావం చూపనున్నాయి.
మాండ్యా లోక్సభ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న సుమలత అంబరీష్కు స్థానిక కాంగ్రెస్ నేతలందరూ బాసటగా నిలుస్తున్నారు. పొత్తు ధర్మానికి కట్టుబడి వారిని దారిలో పెట్టాలని జేడీఎస్ డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీని దారిలోకి తెచ్చుకునేందుకు అన్నట్లు మైసూరులో జేడీఎస్ నేతలు ‘సహాయ నిరాకరణ’ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి విజయశంకర్కు మద్దతుగా ప్రచారం చేసేందుకు స్థానిక జేడీఎస్ నేతలు ఎవరూ ముందుకురావడం లేదు.

సుమలత
నష్ట నివారణ చర్యల్లో భాగంగా మాండ్యాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలను సిద్ధరామయ్య పిలుపించుకుని మాట్లాడారు. మాండ్యాలో జేడీఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న ఆ రాష్ట్ర సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ గెలుపు కోసం పనిచేయాలని కోరారు. అయితే ఆయన విజ్ఞప్తి మేరకు నిఖిల్ కోసం పనిచేసేందుకు ఒక్కరంటే ఒక్కరు కూడా అంగీకరించలేదు. ఇప్పటికే జేడీఎస్ అభ్యర్థుల విజయం కోసం పార్టీ నేతలు పనిచేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశాలు జారీ చేశారు. రాహుల్ ఆదేశాలను పట్టించుకోని మాండ్యా కాంగ్రెస్ నేతలు...బీజేపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న సుమలతకే జై కొడుతున్నారు.
మాండ్యాలో చోటు చేసుకుంటున్న పరిణామాలు మైసూరు లోక్సభ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశముందని సిద్ధరామయ్య ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ పార్టీ అభ్యర్థి ఓడిపోతే వ్యక్తిగతంగానూ పార్టీలో సిద్ధరామయ్యకు నష్టం జరిగే అవకాశముంది.
గత ఏడాది జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఛాముండేశ్వరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు సిద్ధరామయ్య. మైసూరు ప్రాంతంలో తన ప్రాభవాన్ని పెంచుకోవాలంటే ఇక్కడి నుంచి బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి సీహెచ్ విజయశంకర్ను గెలిపించుకోవాలని ఆయన ఉవ్విళ్లూరుతున్నారు. మైసూరులో తాను ఎన్నికల ప్రచారం చేయబోనని జేడీఎస్ అధినేత దేవెగౌడ ఇప్పటికే ప్రకటించారు. దీంతో మైసూరులో పార్టీ అభ్యర్థికి తీవ్ర నష్టం కలుగుతుందని సిద్ధరామయ్య మదనపడుతున్నారు. అయితే ఈ విషయంలో నెలకొన్న విభేదాలన్నీ త్వరలోనే సమిసిపోతాయని కర్ణాటక పీసీసీ చీఫ్ దినేష్ గుండురావు ఆశాభావం వ్యక్తంచేశారు. మైసూరు, మాండ్యా, టుంకూర్తో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో సిద్ధరామయ్య, దేవెగౌడ ఇద్దరూ కలిసి ఎన్నికల ర్యాలీలు నిర్వహిస్తారని చెప్పారు.
గ్యాలరీ:కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోని రూపొందించిన 16 మంది వీరే...