కర్ణాటక రాజకీయం క్షణక్షణానికి రసవత్తరంగా మారుతోంది. కుమారస్వామి ప్రభుత్వంపై కర్ణాటక అసెంబ్లీలో విశ్వాస పరీక్ష సందర్భంగా కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత సిద్ధరామయ్య కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. రెబల్ ఎమ్మెల్యేలు సభకు హాజరు కావాల్సిందేనని ఆయన పట్టుబట్టారు. అదే సమయంలో శాసనసభాపక్ష నేతగా ఆ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసే అధికారం తనకు ఉందన్నారు. ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసే అంశంపై సుప్రీంకోర్టులో నడుస్తున్న కేసులో తాను ఇంప్లీడ్ అవుతానని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. అయితే, ఎమ్మెల్యేలకు సీఎల్పీ నేత విప్ జారీ చేస్తామనడంపై బీజేపీ అభ్యంతరం తెలిపింది. మరోవైపు యడ్యూరప్ప సీఎం కావడం కోసం తనను కుర్చీ దించడానికి పదే పదే ప్రయత్నం చేస్తున్నారని సీఎం కుమారస్వామి అన్నారు. బీజేపీ తీరును సీఎం తప్పుపట్టారు. ఈ సందర్భంగా కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ తీరును కుమారస్వామి అభినందించారు. స్పీకర్ రమేష్ కుమార్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. అయితే, వెంటనే చర్చను జరిపి ఓటింగ్ నిర్వహించాలంటూ బీజేపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. ఈ క్రమంలో స్పీకర్ రమేష్ కుమార్ సభను వాయిదా వేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Congress-jds, Hd kumaraswamy, Karnataka political crisis, Siddaramaiah