తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు (MLC Elections) అధికార టీఆర్ఎస్ పార్టీకి సవాలుగా మారాయనుకుంటే, ప్రత్యర్థి బీజేపీలోనూ అంతర్గత ఆధిపత్య పోరుకూ తెరలేచినట్లుగా ఉంది. సీఎం కేసీఆర్ (CM KCR) తో విభేదించి టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ఎమ్మెల్సీ బరిలో నిలవడంతో పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. తన వర్గానికి చెందిన కార్పొరేటర్లు, పరిషత్ సభ్యుల ఓట్లతో కచ్చితంగా గెలుస్తానని సర్దార్ చెబుతున్నారు. ఆయనకు బీజేపీ, కాంగ్రెస్ సైతం మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, అభ్యర్థి వ్యవహారంలో బీజేపీ నేతలు భిన్న ప్రకటనలు చేయడంతో టీఆర్ఎస్ కు అడ్డంగా దొరికిపోయినట్లయింది. ఇదే విషయాన్ని లేవనెత్తుతూ.. కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నిక వేదికగా బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు తారా స్థాయికి చేరాయని, బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య పొరపొచ్చలు పెరిగాయని, రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడని కరీంనగర్ ప్రస్తుత మేయర్, టీఆర్ఎస్ నేత సునీల్ రావు అన్నారు. తన తిరుగుబాటుతో కేసీఆర్ పతనం మొదలైందన్న సర్దార్ వ్యాఖ్యలకు సైతం మేయర్ ఘాటుగా బదులిచ్చారు. వివరాలివి..
కరీంనగర్‌లో హోరాహోరీ?
తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలోని 6 స్థానాల మాదిరిగానే స్థానిక సంస్థల కోటాలోని 12 ఎమ్మెల్సీలనూ ఏకగ్రీవం చేసుకుకోడానికి అధికార టీఆర్ఎస్ ప్రయత్నించినా, కేవలం 6 మాత్రమే దక్కాయి. మిగిలిన ఆరు చోట్ ఎన్నికలు అనివార్యం కాగా, రెబల్స్ బెడద, తిరుగుబాట్లతో కరీంనగర్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నిక మరింత ఉత్కంఠభరితంగా మారింది. జిల్లాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్ఎస్ నుంచి ఎల్.రమణ, భానుప్రసాద్ సహా మొత్తం 10 మంది బరిలో ఉన్నారు. మిగతా అభ్యర్థులు అందరిలోకి మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ తాను కచ్చితంగా గెలుస్తానని బల్లగుద్ది చెబుతున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ తన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డు మెంబర్, సర్పంచ్, కార్పొరేటర్లను బెంగళూరు, ముంబై, గోవాలోని క్యాంపులకు తరలించింది. సర్దార్ కు బీజేపీ, కాంగ్రెస్ పరోక్షంగా మద్దతిస్తుండటాన్ని తప్పు పడుతూ కరీంనగర్ మేయర్ సునీల్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు..
బండికి ఈటల పోటు
టీఆర్ఎస్ బాహాటంగా తన అభ్యర్థులను నిలబెడితే, బీజేపీ మాత్రం దొంగచాటు వ్యవహారాలకు పాల్పడుతున్నదని సునీల్ రావు ఆరోపించారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. తాము ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయట్లేదని ప్రకటిస్తే, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాత్రం అభ్యర్థిని పోటీలో పెట్టామని చెప్పడం విడ్డూరంగా ఉందని, తద్వారా బీజేపీలో అంతర్గత కలహాలు బహిర్గతమయ్యాయని, బండికి పోటు దించాలనే ఉద్దేశంతోనే ఈటల భిన్న ప్రకటనలు చేస్తున్నాడని సునీల్ రావు మండిపడ్డారు.
బీజేపీకి కొత్త అధ్యక్షుడు
బండి సంజయ్ కి తెలియకుండా బీజేపీ కార్పొరేటర్లు.. ఈటల నిలబెట్టిన అభ్యర్థికి మద్దతు ఇస్తున్నారన్న సునీల్ రావు.. త్వరలోనే తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడని జోస్యం చెప్పారు. ఈటల బలపర్చిన అభ్యర్థి తరచూ కాంగ్రెస్ నేతలను కలుస్తున్నాడని, హుజూరాబాద్ లాగే కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ తన ఓట్లను అమ్ముకుంటోందని సునీల్ రావు ఆరోపించారు. ఎమ్మెల్సీగా గెలిస్తే ఎంపీటీసీలు అందరికీ హెల్త్ కార్డులు ఇప్పిస్తానని సర్దార్ రవీంద్ సింగ్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, ఆయన మేయర్ గా ఉన్న రోజుల్లో పట్టుమని 50 మంది కార్పొరేటర్లకు కూడా హెల్త్ కార్డులు ఇప్పించలేకపోయాడని సునీల్ రావు ఎద్దేవా చేశారు. కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికతో సర్దార్ పతనం కాకతప్పదని మేయర్ అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandi sanjay, Bjp, CM KCR, Etela rajender, Karimnagar, Mlc elections, Trs