KARIMNAGAR EX MAYOR RAVINDAR SINGH FACING TROUBLES DUE TO BJP MLA ETELA RAJENDAR AK
Etela Rajendar: ఈటల రాజేందర్‌ను నమ్ముకున్న ఆ నేత ఇబ్బందిపడుతున్నారా ?
ఈటల రాజేందర్ (ఫైల్ ఫోటో)
Karimnagar: రవీందర్ సింగ్ ఎపిసోడ్ కారణంగా ఈటల రాజేందర్ మద్దతుతో బీజేపీలో చేరేందుకు వచ్చే వాళ్లు కూడా వెనకడుగు వేసే అవకాశం లేకపోలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయంతో ఈటల రాజేందర్ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు. అసలు తెలంగాణలో సీఎం కేసీఆర్‌కు పోటీ ఇచ్చే బలమైన నాయకుడు ఈటల రాజేందర్ అనే ప్రచారం కూడా కొన్ని రోజులు సాగింది. హుజూరాబాద్ ఉప ఎన్నికలు జరిగిన తరువాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కరీంనగర్ జిల్లా పరిధిలోని ఒక స్థానం నుంచి టీఆర్ఎస్ కార్పొరేటర్ రవీందర్ సింగ్ పోటీ చేశారు. టీఆర్ఎస్ రెబల్‌గా ఆయన బరిలోకి దిగారు. ఆయనకు ఈటల రాజేందర్ మద్దతు పలికారు. బీజేపీ ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించినా... ఈటల మాత్రం రవీందర్ సింగ్‌ను బరిలోకి నిలిపారనే వాదన ఉంది. ఆయనకు బీజేపీ నేతలు మద్దతు తెలపాలని ఆయన కోరడంతో.. ఓటు హక్కు ఉన్న కొందరు బీజేపీ నేతలు ఆయనకు ఓటు వేశారు. అయితే పార్టీ బలపరచని రవీందర్ సింగ్‌కు ఎందుకు ఓటేశారని.. బీజేపీ వారిని వివరణ కోరింది.
ఆ తరువాత జరిగిన పరిణామాలతో రవీందర్ సింగ్‌కు బీజేపీలోకి నో ఎంట్రీ బోర్డు పెట్టారనే వాదన మొదలైంది. అందుకు తగ్గట్టుగానే ఆయన ఇప్పటివరకు బీజేపీలో చేరలేదు. అయితే రవీందర్ సింగ్ విషయంలో ఇప్పుడు మరో రకమైన వాదన మొదలైంది. ఈటల రాజేందర్ మద్దతుతో టీఆర్ఎస్ను ఎదిరించిన రవీందర్ సింగ్.. ఇప్పుడు రాజకీయంగా చౌరస్తాలో ఉండిపోయారనే ఊహాగానాలు మొదలయ్యాయి. కరీంనగర్ ఎంపీ, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రవీందర్ సింగ్‌ను పార్టీలో చేర్చుకునే విషయంలో సానుకూలంగా లేరనే ప్రచారం కూడా ఆ జిల్లా వర్గాల్లో జరుగుతోంది.
రవీందర్ సింగ్ (ఫైల్ ఫోటో)
అయితే రవీందర్ సింగ్‌ను బీజేపీలోకి ఈటల రాజేందర్ తీసుకుని వచ్చి ఉంటే.. ఆయన విషయంలో ఇంత చర్చ జరిగి ఉండేది కాదు. కానీ అలా జరగకపోవడంతోనే.. ఈటల రాజేందర్ దూకుడుకు బండి సంజయ్ బ్రేకులు వేస్తున్నారా ? అనే చర్చ కూడా మొదలైంది. మరోవైపు రవీందర్ సింగ్ ఎపిసోడ్ కారణంగా ఈటల రాజేందర్ మద్దతుతో బీజేపీలో చేరేందుకు వచ్చే వాళ్లు కూడా వెనకడుగు వేసే అవకాశం లేకపోలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే రవీందర్ సింగ్ ఇప్పుడు కాకపోయినా.. భవిష్యత్తులో అయినా బీజేపీలో చేరే అవకాశం ఉందని మరికొందరు చర్చించుకుంటున్నారు.
రవీందర్ సింగ్ బీజేపీలోకి వస్తే.. భవిష్యత్తులో తాను పోటీ చేయాలనుకుంటున్న కరీంనగర్ ఎమ్మెల్యే స్థానాన్ని ఆయన ఆశించే అవకాశం ఉంటుందని.. అందుకే బండి సంజయ్ ఆయన చేరికకు బ్రేకులు వేశారనే ప్రచారం కూడా కరీంనగర్ జిల్లా రాజకీయవర్గాల్లో సాగుతోంది. మొత్తానికి ఈటల రాజేందర్‌ను నమ్ముకుని టీఆర్ఎస్ రెబల్‌గా బరిలోకి దిగిన రవీందర్ సింగ్ ఎపిసోడ్.. ఈటలకే మైనస్‌గా మారొచ్చనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.