ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష టీడీపీ నేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari)ని అధికార వైసీపీ ఎమ్మెల్యేలు దారుణంగా అవమానించారనే ఉదంతంపై వాడీ వేడి వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. గత శుక్రవారం(ఈనెల 19న) అసెంబ్లీలో వ్యవసాయంపై చర్చ పక్కదారిపట్టి, వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేలు వ్యక్తిగత దూషణలకు దిగడం, వివేకా హత్య కేసును సీఎం జగన్ కు ముడిపెడుతూ టీడీపీ నినాదాలు చేయగా, దివంగత ఎలిమినేటి మాధవరెడ్డి పేరును ప్రస్తావిస్తూ ‘నారా లోకేశ్ ఎలా పుట్టాడో తేలాలి’అని వైసీపీ ఎమ్మెల్యేలు కేకలు వేయడం, అది విన్న చంద్రబాబు(Chandrababu) ఉక్రోషంతో సభ నుంచి వెళ్లిపోవడం, ప్రెస్ మీట్ లో బోరున విలపించడం తెలిసిందే. నిజానికి సభలో భువనేశ్వరి పేరు ప్రస్తావనకే రాలేదని జగన్ సర్కారు వాదిస్తుండగా, ఎడిటింగ్ చేయని వీడియో ఫులేజీల కోసం టీడీపీ వారు అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాశారు. భువనేశ్వరి పేరుపై అన్ని పార్టీల మధ్య వాగ్వాదాలు జరుగుతున్నక్రమంలో ఈ ఉదంతంలో భారీ కుదుపుగా కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఎంటరయ్యారు..
భువనేశ్వరికి అవమానంపై ముద్రగడ
చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో కాపు కులస్తులకు రిజర్వేషన్లు కోరుతూ ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో భారీ ఆందోళనలు, నిరసనలు జరిగిన సంగతి తెలిసిందే. నాటి ఉద్యమంలో ముద్రగడపై, ఆయన కుటుంబంపై బాబు సర్కార్ ఉక్కుపాదం మోపింది. తన భార్యను అతి దారుణంగా అవమానించారని, వాటిని తట్టుకోలేక కుటుంబమంతా ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నామని ముద్రగడ తాజాగా వెల్లడించారు. భువనేశ్వరి ఉదంతో చంద్రబాబు కన్నీరు పెట్టడం ఫక్తు నాటకమేనని, గతంలో ఆయన ఇతరుల భార్యలకు చేసినదానికంటే ఇది తక్కువేనని ముద్రగడ మండిపడ్డారు. భువనేశ్వరికి అవమానం తర్వాత చంద్రబాబు ముఖం చూడాలని సీఎం జగన్ సరదాపడ్డారనే ఆరోపణలపైనా కాపునేత స్పందించారు. ఈ మేరకు పద్మనాభం మంగళవారం నాడు టీడీపీ చీఫ్ చంద్రబాబుకు ఒక బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖను యథాతథంగా ఇస్తున్నాం..
రాక్షసానందం కోసం ఫొటోలు తీశారుకదా..
‘ఈ మధ్య మీ శ్రీమతి గారికి జరిగిన అవమానం గురించి మీరు వెక్కి వెక్కి ఏడవడం టివిలో చూసి ఆశ్చర్యపోయాను. మా (కాపు) జాతికి ఇచ్చిన హమీని అమలు చేయమని (అప్పట్లో)ఉద్యమం చేస్తే.. నన్ను నా కుటుంబాన్ని మీరు చాలా అవమానపరిచారు. మీ కుమారుడు లోకేష్ ఆదేశాలతో పోలీసులు నన్ను బూటు కాలితో తన్నారు. నా భార్య,కుమారుడు,కోడల్ని బూతులు తిడుతూ లాఠీలతో కొట్టారు. ఏ తప్పు చేశామని 14 రోజుల పాటు హస్పటల్ గదిలో నన్ను, నా భార్యను బంధించి ఉంచారు? మీ రాక్షస ఆనందం కోసం హస్పటల్ లో ఉన్న నన్ను, నా భర్యను ఆ స్థితిలో ఫోటోలు తీయించి చూసేవారు.
చంద్రబాబు పతనం చూడాలనే చావలేదు..
మీరు చేసిన హింస తట్టుకోలేక, ఆ అవమానాన్ని దిగమింగలేక ఎన్నో నిద్దుర లేని రాత్రులు గడిపాం. అణిచివేత దెబ్బకు మా కుటుంబం ఆత్మహత్యకు పూనుకోవాలన్నది మీ ప్రయత్నం కాదా? మా కుటుంబాన్ని దారుణంగా అవమాన పరచిన మీ(చంద్రబాబు) పతనం నా కళ్ళతో చూడాలనే ఉద్దేశంతోనే ఆనాడు ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకున్నాం.
ఎన్టీఆర్ కుటుంబం సానుభూతి..
నా కుటుంబాన్ని ఎంతగానో అవమానించిన మీ నోటి వెంట ఇప్పడు ముత్యాల్లాంటి వేదాలు వస్తున్నాయి. మీ బంధువులు..మీ మీడియా ద్వార సానుభూతి పొందే అవకాశం మీకే వచ్చింది. ఆరోజు నాకు సానుభూతి రాకుండా ఉండేందుకు మీడియాను బంధించి నన్ను అనాథను చేశారు. దయచేసి శపధాలు చేయకండి చంద్రబాబు గారు.. అవి మీకు నీటి మీద రాతలని గ్రహించండి’అని ముద్రగడ పద్మనాభం తన లేఖలో పేర్కొన్నారు. తన భార్య భువనేశ్వరిని అవమానించిన కౌరవ సభలో ఉండనని, మళ్లీ సీఎంగానే అసెంబ్లీలో అడుగుపెడతానని చంద్రబాబు శపథం చేయడం తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP Assembly, Chandrababu Naidu, Mudragada Padmanabham, Nara Bhuvaneshwari, TDP, Ysrcp