KAPU LEADER MUDRAGADA ATTEND TO RAILWAY COURT IN VIJAYAWADA NGS
Andhra Pradesh: వైసీపీపై కాపు నేతల ఫైర్.. రైల్వే కోర్టుకు ముద్రగడ.. విచారణ మార్చి 16కు వాయిదా?
ముద్రగడ పద్మనాభం(ఫైల్ ఫోటో)
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాపు వర్సెస్ టీడీపీగా ఉన్న పరిస్థితి ఇప్పుడు మారుతోందా? వైసీపీ-బీజేపీ నేతల తీరుపై కాపు ఉద్యమ నేతలు గుర్రగా ఉన్నారా? తుని రైలు దగ్ధం కేసు మళ్లీ తెరపైకి రావడంతో.. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారేలా చేస్తోందా?
తుని రైల్వే ఘటన మళ్లీ తెరపైకి వచ్చింది. కాపు ఉద్యమంలో భాగంగా తునిలో రైలును కొందరు దగ్ధం చేశారు. 2016లో జరిగిన ఈ కేసులో ముద్రగడ పద్మనాభం, కల్వకొలను తాతాజీ, ఆకుల రామకృష్ణ, జి.వి సుధాకర్ నాయుడుతో పాటు ఇతర కాపు నేతలు ప్రధాన నిందితులుగా ఉన్నారు. రైలుకు నిప్పటించిన కేసులో నిందితులపై 146, 137, 153, 274 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఈ ఘటనకు సంభందించి కాపు నేతలకు రైల్వే కోర్ట్ సమన్లు జారీ చేసింది.
కోర్టు సమన్ల నేపథ్యంలో రెండవ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కు కాపు ఉద్యమ నేతలు హాజరయ్యారు. మొత్తం 41 మందిపై కేసు నమోదు కాగా.. 31 మంది కాపు నేతలు మాత్రమే హాజరయ్యారు. తుని ఎమ్మెల్యే తాడిషెట్టి రాజా అనారోగ్య కారణాల వల్ల హాజరుకాలేదు. కేసును విచారించిన రైల్వే కోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది.
అయితే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల తీరుపై కాపు ఉద్యమ నేతలు మండిపడుతున్నారు. గత రాష్ట్ర ప్రభుత్వం తమపై అక్రమ కేసులు పెట్టిందని.. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న సీఎం జగన్.. రైలుపై దాడి ఘటనలో కాపులు ఎవరూ లేరని చెప్పారని.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత తమపై కేసుల మాఫీకి ఎందుకు ప్రయత్నించడం లేదని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో కాపుల ఓట్ల కోసం రాజకీయం చేసిన.. వైసీపీ అధికారంలోకి వచ్చాక కాపులను వదిలేసిందని.. మండిపడ్డారు.
రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం కాపులకు అన్ని విధలా అండగా ఉంటామని చెబుతున్నారని.. కాని కేంద్రం పరిధిలో ఉన్న రైల్వే కేసులపై తమను కోర్టుకు ఈడుస్తే.. రాష్ట్ర నేతలు ఎందుకు ప్రశ్నించడం లేదని మండిపడుతున్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల తీరును కాపుజాతి ప్రజలంతా గుర్తిస్తున్నారని సరైన సమయంలో సమధానం చెబుతాము అంటున్నారు.
మరోవైపు వచ్చే ఎన్నికల నాటికి తమ సత్తా చూపతామంటున్నారు కాపు ఉద్యమ నేతలు. రాష్ట్రవ్యాప్తంగా కాపునేతలు, సామాజికవర్గాన్ని ఏకతాటిపైకి తీసుకు వచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అనేక కోణాల్లో కాపులకు రాజకీయ అధికారం విషయాన్ని ఆలోచించిన కొందరు నేతలు ముందుగా మెగాస్టార్ చిరంజీవితో చర్చించారు. తర్వాత కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంతో భేటి అయ్యారు. ఈమధ్య జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కూడా సమావేశమయ్యారు.
తాజాగా తుని కేసు తెరపైకి రావడంతో కాపులకు రాజ్యాధికారం అనే నినాదం మళ్లీ మారుమోగుతోంది. అయితే సొంతగా పార్టీ పెట్టాలా..? ఇప్పుడు ఉన్న ఏదైనా పార్టీ వెంట వెళ్లాలా అన్నది కాపు నేతలు తేల్చుకోలేకపోతున్నారు. ముద్రగడ మినహా కాపుల్లో పేరున్న నేతలంతా అన్ని పార్టీల్లోనూ ప్రధాన పాత్రే పోషిస్తున్నారు. దీంతో తమను నడిపించే నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారు ఉద్యమకారులు.. మరి ముద్రగడ రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.