news18-telugu
Updated: June 17, 2020, 3:13 PM IST
కన్నా లక్ష్మీనారాయణ(ఫైల్ ఫోటో)
ఏపీ ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను పునర్నియమించాలంటూ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన తర్వాత కూడా ఆయనకు బాధ్యతలు అప్పగించకుండా ప్రభుత్వం నరకం చూపిస్తోందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఈ అంశంపై జోక్యం చేసుకోవాలంటూ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు కన్నా లేఖ రాశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ లాంటి రాజ్యాంగబద్ధ సంస్థ విషయంలో ఏపీ ప్రభుత్వం జోక్యం చేసుకోవడం సరికాదన్నారు. రమేష్ కుమార్ తన కార్యాలయంలోకి రాకుండా నిరోధించడానికి పోలీసు బలగాలను మోహరించారని కన్నా ఆరోపించారు. రాజ్యాంగాన్ని రాష్ట్ర అధిపతిగా పరిరక్షించడంలో గవర్నర్ తప్పనిసరి పాత్రను ఉపయోగించడం ద్వారా వెంటనే జోక్యం చేసుకుని విషయాలను సరిదిద్దాలని కోరారు. ఎన్.రమేష్ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని గవర్నర్ విశ్వభూషణ్‌ను కన్నా కోరారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కన్నా లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయని, ఇలాంటి సమయంలో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తే ఆ కేసులు మరింత పెరిగే ప్రమాదం ఉందని కన్నా లక్ష్మీనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో చేసినట్టుగానే ఏపీలో కూడా పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
June 17, 2020, 3:13 PM IST