పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తాం... పొత్తులకు సిద్ధమన్న కమల్‌హాసన్

news18-telugu
Updated: December 22, 2018, 2:17 PM IST
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తాం... పొత్తులకు సిద్ధమన్న కమల్‌హాసన్
కమల్ హాసన్ (ఫైల్ ఫోటో)
  • Share this:
సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచేందుకు కమల్ హాసన్ సై అనేశారు. ఈ ఏడాది మక్కల్ నీది మయ్యమ్ అనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన కోలీవుడ్ స్టార్ హీరో... ఎన్నికల్లో ఎప్పుడు పోటీ చేస్తారనే దానిపై మాత్రం పెద్దగా క్లారిటీ ఇవ్వలేదు. అయితే వచ్చే ఏడాది ఏప్రిల్‌లో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని కమల్ హాసన్ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయాలని డిసైడయ్యిందని ప్రకటించారు. పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపిక కోసం త్వరలోనే కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా తమతో కలిసి వచ్చే పార్టీలతో పొత్తులకు సిద్ధమని కమల్ ప్రకటించడం మరో విశేషం.

కమల్ హాసన్ కంటే ముందే రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ప్రకటించిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేది లేనిది స్పష్టం చేయలేదు. ఆయన కంటే ముందే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీపై కమల్ హాసన్ ప్రకటన చేయడంతో రజనీకాంత్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే ఆసక్తి నెలకొంది. మరోవైపు తనతో కలిసొచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమని కమల్ హాసన్ ప్రకటించడంతో... కమల్, రజనీకాంత్ ఇద్దరూ కలిసి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా అనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. అయితే తమిళనాడు మూలాలను దెబ్బతీసే పార్టీలతో పొత్తు పెట్టుకోనని కమల్ హాసన్ చెప్పడంతో... ఆయన ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారనే అంశం కూడా ఆసక్తికరంగా మారింది.

లోక నాయకుడు కమల్ హాసన్‌తో సూపర్ స్టార్ రజినీకాంత్
రజనీకాంత్, కమల్ హాసన్


వచ్చే ఏడాది జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో తమిళనాడులో ప్రధాన పోటీ డీఎంకే, అన్నాడీఎంకే మధ్యే ఉంటుందని చాలామంది భావించారు. ఇప్పుడు ఎన్నికల బరిలో కమల్ హాసన్ కొత్త పార్టీ కూడా నిలుస్తుండటంతో... ఆయన ఏ మేరకు ప్రభావం చూపిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. లోక్ సభ ఎన్నికల్లో కమల్ హాసన్ పార్టీ పెద్దగా ప్రభావం చూపించలేకపోతే... ఆ తరువాత జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన ప్రభావం పెద్ద ఉండకపోవచ్చని పలువురు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా తొలిసారి ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న కమల్ హాసన్... తాను స్వయంగా పోటీకి దిగుతారా లేక పార్టీ అభ్యర్థుల ప్రచారానికి మాత్రమే పరిమితమవుతారా అన్నది కూడా ప్రస్తుతానికి సస్పెన్సే.
Published by: Kishore Akkaladevi
First published: December 22, 2018, 2:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading