Home /News /politics /

KADIYAM SRIHARI ANNOUNCES HIS SUPPORT TO THATIKONDA RAJAIAH

పద్ధతి మార్చుకో.. మద్దతిస్తా: బహిరంగ వేదికపై రాజయ్యకు కడియం క్లాస్

కడియం శ్రీహరితో రాజయ్య(Image: Facebook)

కడియం శ్రీహరితో రాజయ్య(Image: Facebook)

టీఆర్ఎస్‌లో స్టేషన్ ఘన్‌పూర్ పంచాయతీకి తెరపడింది. వచ్చే ఎన్నికల్లో రాజయ్యకు ఓటు వేసి గెలిపించాలని పార్టీ శ్రేణులకు కడియం శ్రీహరికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాజయ్యకు కడియం శ్రీహరి బహిరంగంగానే క్లాస్ తీసుకున్నారు.

    స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యేగా రాజయ్య గెలుపు కోసం తన పూర్తి సహాయ, సహకారాలుంటాయని ఆపద్ధర్మ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. వరంగల్‌లో స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ నాయకుల సమావేశంలో పాల్గొన్న కడియం శ్రీహరి... తాను స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యేగా పోటీ చేయననే విషయాన్ని ఆరు నెలల కిందటే చెప్పానని స్పష్టం చేశారు. ఇందుకు రాజయ్యే సాక్ష్యమని అన్నారు. స్టేషన్ ఘన్‌పూర్ నుంచి తాను లేదా తన కుమార్తె పోటీలో ఉంటారని జరిగిన ప్రచారంపై కూడా కడియం శ్రీహరి అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను తన జీవితంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదని... అలాంటి పార్టీలోకి తాను వెళతానని కొందరు ప్రచారం చేశారని అన్నారు.

    అసెంబ్లీ ఎన్నికల్లో రాజయ్యను గెలిపించాలని కోరిన కడియం శ్రీహరి... ఈ సందర్భంగా రాజయ్యకు, ఆయన వర్గానికి నేరుగానే హెచ్చరికలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజయ్య కొన్ని పద్దతులు మార్చుకొని అందరిని కలుపుకుని వెళ్లాలని కడియం శ్రీహరి సూచించారు. ఆరోపణలు తగ్గించుకునే ప్రయత్నం చేయడంతో పాటు నియోజకవర్గంలో టీఆర్ఎస్‌లోకి వచ్చిన వారందరినీ కలుపుకోవాలని హితబోధ చేశారు. నీ వెంట వచ్చేవారిని అవమాన పర్చే విధంగా వెకిలిగా నవ్వొద్దని సలహా ఇచ్చారు. ఒళ్లు, నోరు దగ్గర పెట్టుకుని అందరినీ కలుపుకుని వెళ్లాలని అన్నారు. ప్రజలను ఒప్పించే వ్యక్తులను వెంట పెట్టుకోవాలని, పనికిరానివాళ్లను వెంటపెట్టుకుంటే వారి వ్యతిరేకత మనపై పనిచేస్తుందని వ్యాఖ్యానించారు.

    స్టేషన్ ఘన్పూర్ నా నియోజకవర్గం అని రాజయ్య అంటున్నారని... ఆ మాట మాట్లాడొద్దు అని కడియం శ్రీహరి అన్నారు. ఇది నీ నియోజక వర్గం కాదని మన నియోజకవర్గమని తెలిపారు. 52వేల ఓట్ల మెజారిటీ వచ్చిందని రాజయ్య అంటున్నారని... కానీ తనకు 90వేల ఓట్ల మెజారిటీ వచ్చిందని అన్నారు. ఎదుటివారిని చులకన చేసి మాట్లాడొద్దని సూచించారు. కేసీఆర్ నాయకత్వంలోనే అందరం పన చేయాలని సూచించారు. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిందని వ్యాఖ్యానించిన కడియం శ్రీహరి... డిసెంబర్ 7న జరగబోయే ఎన్నికల్లో రాజయ్యకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: CM KCR, Kcr, Telangana, Telangana Election 2018, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు