మళ్లీ తెరపైకి కడప స్టీల్ ప్లాంట్.. జగన్ ముందున్న మూడు ఆప్షన్లు ఇవే..

Kadapa Steel Plant | కడప స్టీల్ ప్లాంట్ అనేది రాయలసీమ వాసుల కల. అయితే, గత ఐదేళ్ల కాలంలో వివిధ కారణాలతో ఆచరణ సాధ్యం కాలేదు.

news18-telugu
Updated: July 8, 2019, 8:31 PM IST
మళ్లీ తెరపైకి కడప స్టీల్ ప్లాంట్.. జగన్ ముందున్న మూడు ఆప్షన్లు ఇవే..
వైఎస్‌కు నివాళి అర్పిస్తున్న జగన్ (ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీ విభజన హామీల్లో కీలకమైన కడప స్టీల్ ప్లాంట్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ ఏడాది డిసెంబర్ 26న కడపలో స్టీల్ ప్లాంట్ కు శంకుస్ధాపన చేస్తానని, మూడేళ్లలో పనులు పూర్తి చేసి 20 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని సీఎం జగన్ కడప జిల్లా జమ్మలమడుగులో జరిగిన బహిరంగ సభలో ప్రకటించారు. అయితే జగన్ ప్రకటన నేపథ్యంలో విభజన హామీల్లో ఒకటైన ఈ ప్రాజెక్టును ఎవరు నిర్మించబోతున్నారనే అంశం మరోసారి చర్చనీయాంశమవుతోంది. ఏపీ విభజన సందర్భంగా అప్పటి యూపీఏ సర్కారు రాష్ట్రానికి పలు హామీలు ఇచ్చింది. వీటిలో ప్రత్యేక హోదాతో పాటు కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, జాతీయ విద్యాసంస్ధల ఏర్పాటు వంటివి ఉన్నాయి. వీటిలో కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం గత టీడీపీ ప్రభుత్వం... కేంద్రంలోని మోదీ సర్కారుతో కొంతమేర పోరాడినా సకాలంలో నివేదికలు ఇవ్వలేదంటూ ఒకసారి, కన్సల్టెన్సీ సంస్ధ మెకాన్ నివేదిక రాలేదంటూ మరోసారి కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ ప్రాజెక్టుపై ముందుకెళ్లలేకపోయింది. ఓ దశలో కేంద్రంతో సంబంధం లేకుండా తామే కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేస్తామంటూ అప్పటి టీడీపీ సర్కారు నానా హంగామా చేసింది. శంకుస్ధాపన పూర్తి చేసి మూడేళ్లలో ప్రాజెక్టు నిర్మించి తీరుతామంటూ అప్పటి సీఎం చంద్రబాబు ఆర్భాటంగా ప్రకటించారు. అయితే నిర్మాణం ప్రారంభించకముందే ఎన్నికలు రావడం, వాటిలో టీడీపీ ఓటమి పాలవ్వడం వరుసగా జరిగిపోయాయి.

గత టీడీపీ సర్కారుతో పోలిస్తే తాజాగా ఏపీలో అధికార పగ్గాలు చేపట్టిన వైసీపీ సర్కారుకు కడప స్టీల్ ప్లాంట్ కీలకంగా మారింది. సీఎం జగన్ సొంత జిల్లా కావడం, ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగితే జిల్లాలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుందన్న అంచనాలు ఉన్నాయి. దీంతో జగన్ సర్కారు తన ఐదేళ్ల హయాంలో ఈ ప్రాజెక్టు నిర్మించి తీరుతుందని కడప వాసులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్.. ఇవాళ దీనిపై ప్రకటన చేశారు. డిసెంబర్ 26న కడప స్టీల్ ప్లాంట్ కు శంకుస్ధాపన చేస్తామని, మూడేళ్లలో పూర్తి చేసి 20 వేల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించారు. దీంతో జిల్లా వాసుల్లో మళ్లీ ఈ ప్రాజెక్టుపై ఆశలు చిగురిస్తున్నాయి. సీఎం సొంత జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరిగితే వైసీపీకి రాజకీయంగానూ ఎంతో లాభం ఉంటుంది. దీంతో జగన్ ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారనే అంచనాలున్నాయి.

వాస్తవానికి జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి హయాంలోనే కడపలో బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం గాలి జనార్ధన్ రెడ్డికి భూములు కేటాయించారు. ప్రాజెక్టు ఏర్పాటు చేసే లోపే వైఎస్ హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోవడం, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వైఎస్ కుటుంబం మీద కక్షను గాలి జనార్ధన్ రెడ్డిపై చూపించడం వంటి పరిణామాలతో ఈ ప్రాజెక్టు మూలనపడింది. ఒకప్పుడు గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన బ్రాహ్మణి స్టీల్స్ కు స్టీల్ ప్లాంట్ నిర్మాణం అప్పగించడాన్ని ఏపీలో విపక్ష టీడీపీ తీవ్రంగా తప్పుబట్టింది. కానీ విచిత్రంగా అదే టీడీపీ.. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయలేదంటూ సీఎంగా ఉన్న చంద్రబాబును పల్లెత్తుమాట అనకుండా గత ఐదేళ్లుగా మోదీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశాయి. ఓ దశలో తనకు అవకాశం ఇస్తే స్టీల్ ప్లాంట్ నిర్మిస్తానని గాలి జనార్ధన్ రెడ్డి కూడా ముందుకొచ్చారు. అయితే వైఎస్ కుటుంబానికి సన్నిహితుడన్న కారణంతో చంద్రబాబు ప్రభుత్వం ఆయనకు అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వమే సొంతంగా దీన్ని నిర్మిస్తుందా లేక పీపీపీ విధానంలో గాలి జనార్ధన్ రెడ్డి సహకారం తీసుకుంటుందా, లేక కేంద్రం సాయంతో ముందుకెళ్తుందా అన్నది తేలాల్సి ఉంది. ఈ మూడింటితో ఏదో ఒక ఆప్షన్ ను మాత్రం జగన్ ప్రభుత్వం ఎంచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఎవరు నిర్మించినా స్టీల్ ప్లాంట్ వస్తే మాత్రం కడప వాసులకు పండగే అవుతుందన్నది అక్షరసత్యం.

(సయ్యద్ అహ్మద్, అమరావతి కరస్పాండెంట్, న్యూస్‌18)

First published: July 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...